Skip to main content

కొలువుల వేదిక.. క్లినికల్ రీసెర్చ్

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల పరంపరలో భాగంగా ఆవిర్భవించిన కోర్సుల్లో క్లినికల్ రీసెర్చ్ ఒకటి. రాబోయే దశాబ్ద కాలంలో ఔషధ రంగం గణనీయంగా అభివృద్ధి చెందబోతుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోర్సుకు డిమాండ్ అధికమైంది. ఈ నేపథ్యంలో క్లినికల్ రీసెర్చ్ కోర్సును అందిస్తున్న విద్యా సంస్థలు, అర్హతలు, కెరీర్ స్కోప్‌పై ఫోకస్..
క్లినికల్ రీసెర్చ్ అంటే
మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఔషధాలు, వైద్య పరికరాలు, చికిత్స పద్ధతులు, వాటి ప్రయోజనాలు, ప్రభావాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని క్లినికల్ రీసెర్చ్ లేదా క్లినికల్ ట్రయల్ అంటారు. ఇందులో పాలుపంచుకునే వారిని క్లినికల్ రీసెర్చ్ నిపుణులు అంటారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఔషధాలు ఎంత సురక్షితమైనవో తెలుసుకోవడానికి క్లినికల్ పరీక్షలపై ఆధారపడతాయి. పలుమార్లు క్లినికల్ పరీక్షలు నిర్వహించి అన్ని విధాలుగా నిర్ధారణ చేసుకున్నాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. దీంతో క్లినికల్ రీసెర్చ్ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

రీసెర్చ్ నిపుణుల విధులు
కొత్తగా తయారు చేసిన ఔషధాలను ముందుగా జంతువులపై.. తర్వాత దశలో మనుషులపై ప్రయోగిస్తారు. ఈ సమయంలో జరిగే పరిణామాలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటి ఆధారంగా నివేదికలు తయారు చేయడం వీరి ప్రధాన బాధ్యతలు.

కోర్సులు
 • బీఎస్సీ క్లినికల్ రీసెర్చ్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
 • ఎంఎస్సీ క్లినికల్ రీసెర్చ్
 • పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మా కోవిజిలెన్స్
 • డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్
 • పీహెచ్‌డీ ఇన్ క్లినికల్ రీసెర్చ్(రెండేళ్లు)
 • క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్... ఇవి కాకుండా సర్టిఫికేషన్, ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: బీఎస్సీ (లైఫ్ సెన్సైస్/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ)/బీఫార్మసీ/ఎంఫార్మసీ/ఎంబీబీఎస్/నర్సింగ్ చేసిన వాళ్లు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు.

కోర్సులో అంశాలు
ఔషధ రంగానికి సంబంధించి ప్రీ క్లినికల్ ట్రయల్స్ నుంచి పోస్ట్ మార్కెటింగ్ యాక్టివిటీస్ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా కోర్సు రూపకల్పన ఉంటుంది. ఇందులో ట్రయల్ డిజైన్, లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ట్రయల్, రెగ్యులేషన్స్, ఎథిక్స్, గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ వంటి అంశాలతోపాటు అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, బయోమెడికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులార్ బయాలజీ, సైకాలజీ, టాక్సికాలజీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.

ఆఫర్ చేస్తున్న సంస్థలు
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) - హైదరాబాద్
వెబ్‌సైట్:
www.nims.edu.in
యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్:
www.unipune.ac.in

రిక్రూటింగ్ ఏజెన్సీలు
 • ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థలు
 • ఫార్మాస్యూటికల్ కంపెనీలు
 • క్లినికల్ స్టడీ ఇన్వెస్టిగేటివ్ సైట్స్
 • మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు
 • క్లినికల్ లేబొరేటరీలు విద్యా సంస్థలు (టీచింగ్)

ఆకర్షణీయ వేతనాలు
ఈ రంగంలో ఐటీ సెక్టార్‌తో సమానంగా వేతనాలు ఉంటాయి. ప్రారంభంలో ఏడాదికి రూ.2 లక్షల వరకు ఉంటుంది. తర్వాత పని అనుభవం, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, వేతనాల పెరుగుదల ఉంటాయి.

భారత్‌పై బహుళ జాతి సంస్థల గురి
ఔషధ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం, ఔషధాలకు మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడంతో విదేశీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విదేశీ సంస్థలు మన దేశ ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఔషధ రంగం వచ్చే ఐదారేళ్లపాటు ఏటా 20 శాతం వృద్ధి చెందడంతోపాటు 2.5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నిపుణుల అంచనా.

క్లినికల్ రీసెర్చ్ రంగంలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నా అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు పరిశోధనల వైపు మొగ్గు చూపడం లేదు. త్వరగా కెరీర్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్, ఐటీ వైపు ఆసక్తి చూపుతున్నారు. రీసెర్చ్ కోర్సులు చేసిన మెడికల్ విద్యార్థులకు మిగతా రంగాలతో సమానంగా వేతనాలు, అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు ప్రత్యేక గుర్తింపు.. విదేశీ అవకాశాలు రీసెర్చ్‌ల వల్ల సొంతం అవుతాయి.
ప్రభాకర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ - క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్, నిమ్స్ - హైదరాబాద్
Published date : 26 Jul 2016 01:30PM

Photo Stories