Skip to main content

కెరీర్‌కు ‘ఔషధం’ ఫార్మసీ

ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంజనీరింగ్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న కోర్సులు బీఫార్మసీ, ఫార్మ్‌డీ. మొత్తం సీట్లలో ఎంపీసీ విద్యార్థులకు, బైపీసీ విద్యార్థులకు చెరి సగం సీట్లు కేటాయిస్తారు. మన దేశం ఫార్మా హబ్‌గా ఎదుగుతుండడంతోపాటు నానాటికీ విస్తృతమవుతున్న వ్యాధులు, వాటి నివారణకు సంబంధించి పరిశోధన, కొత్త మందుల తయారీ మొదలైన అంశాల్లో నిష్ణాతుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బీఫార్మసీ, ఫార్మ్‌డీ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి ఉపాధి అవకాశాలున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్, సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ కళాశాలల్లో గతేడాది కటాఫ్ ర్యాంకుల వివరాలు..

ప్రపంచంలో వందకు పైగా దేశాలకు భారత్ నుంచి ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. 2012లో మనదేశం నుంచి రూ.80,000 కోట్ల ఔషధాలు ఎగుమతి అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాలకు ఔషధాలను విక్రయించే క్రమంలో మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు విదేశీ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం, ఉమ్మడిగా డ్రగ్ డిజైన్, అభివృద్ధి వంటివాటిలో పాలుపంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిష్ణాతులైన మానవ వనరుల కోసం సంబంధిత ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.

బీఫార్మసీ:
ఇటీవల ఆదరణ పొందుతున్న కోర్సు... బీఫార్మసీ. హెల్త్ సైన్స్‌కు సంబంధించి బహుముఖ అంశాల కలయిక ఈ కోర్సు. థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమాన ప్రాధాన్యమున్న కోర్సు. రాష్ట్రంలో మొత్తం 278 ఫార్మసీ కళాశాలల్లో 32,070 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఫార్మసీ కళాశాలలు 11. వీటిలో మొత్తం సీట్లు 510.

నాలుగేళ్ల కోర్సు:
నాలుగేళ్ల బీఫార్మసీ కోర్సు మొత్తం 7 సెమిస్టర్లుగా ఉంటుంది. ప్రథమ సంవత్సరం అంతా ఒక సెమిస్టర్, మిగిలిన మూడేళ్లు ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఇండస్ట్రీ ప్రాధాన్యంగా, హాస్పిటల్స్ అవసరాలు తీర్చే విధంగా కోర్సు ఉంటుంది. బేసిక్ కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయలాజికల్ ఫార్మసీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ సంబంధిత అంశాలను బోధిస్తారు. మైక్రోస్కోప్, డ్రగ్స్ రూపకల్పన, వాటి పనితీరు తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఔషధాల తయూరీ నుంచి వినియోగం వరకూ.. పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా మానవ శరీర నిర్మాణంపై అవగాహన పొందేలా వ్యాధుల తీవ్రత గుర్తింపు, నివారణ మార్గాలను కనుక్కోవడంలోనూ నైపుణ్యం సాధించేలా శిక్షణ ఉంటుంది. పుస్తకాలకే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులు ఆసక్తి చూపాలి. ఈ ప్రాక్టికల్స్‌తోపాటు కోర్స్ పూర్తయ్యాక లేదా మూడో సంవత్సరం పూర్తయ్యాక రెండు నెలలు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత ప్రధానం:
కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, నాలెడ్జ్, ఫార్మారంగ ప్రగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ... అవసరాలకు అనుగుణంగా కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీలు, వాటి ఉత్పత్తులు, అమ్మకాలు వంటివాటిపై పరిజ్ఞానం పెంచుకోవాలి. అదనంగా ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.

ఫార్మ్-డి:
ఫార్మసీ విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా లేవనే భావనతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. 2008లో ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌తో సమానమైదని చెప్పొచ్చు. థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ఆరేళ్ల ఈ కోర్సులో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో ఐదేళ్లు క్లాస్ రూం టీచింగ్, ప్రాక్టికల్స్ సమ్మిళితంగా ఉంటుంది. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మెడికల్ కళాశాల, హాస్పిటల్‌తో అనుసంధానమై కోర్సును నిర్వహిస్తారు. డ్రగ్ ఎంతస్థాయిలో ఇవ్వాలి? పనితీరును తెలుసుకోవడంతోపాటు పరిమితికి మించి ఔషధం వినియోగించకుండా వీరు నిరంతరం పర్యవేక్షిస్తారు. వైద్యులకు, రోగికి మధ్య వారధిగా ఉంటారు. రోగికి కౌన్సెలింగ్ చేయడం, ఔషధ వినియోగ విధానం, డ్రగ్ ప్రొఫైల్ అధ్యయనం చేయడం వీరి విధులు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లినికల్ థెరపీ, ఫార్మకోథెరపీ, క్లినికల్ రీసెర్చ్, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఫార్మ్-డిలో మన రాష్ట్రంలో దాదాపు 31 కళాశాలల్లో 930 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొదటి బ్యాచ్ విద్యార్థులు 2013-14లో కోర్సును పూర్తి చేస్తారు.

ఉన్నత విద్య:
మన దేశంలో పీజీలో మొత్తం ఏడు స్పెషలైజేషన్స్ అందిస్తున్నారు. అవి.. ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, ఫార్మకాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, డ్రగ్ రెగ్యులేటర్ ఎఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫార్మాలో ఎంబీఏ వంటి కోర్సులను నైపర్, ఇతర ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. జాతీయస్థాయిలో నైపర్ ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు ప్రతి ఏటా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో నైపర్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జీప్యాట్‌ను, మన రాష్ర్టంలో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను ఏటా నిర్వహిస్తారు. వివరాలకు www.niper.nic.in. www.aicte-gpat.in, www.appgecet.org చూడొచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఫార్మాలో ఎంఎస్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చేయొచ్చు.

ఉద్యోగావకాశాలు:
కోర్సులు పూర్తిచేసినవారికి రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో, అరబిందో, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాలున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఎనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్ వంటి హోదాల్లో ఉపాధి లభిస్తుంది. దేశ, విదేశాల్లో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటు, ఉత్పత్తులను విక్రయించడానికి ఆయా దేశాల లెసైన్సుల కోసం కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో నిపుణుల అవసరం భవిష్యత్తులో భారీగా పెరగబోతోంది. సొంతంగా మందుల దుకాణం కూడా ఏర్పాటు చేయొచ్చు.

మంచి కళాశాల ఎంపిక ఇలా..
  • మీరు ఎంచుకున్న కళాశాల, కోర్సులకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏఐసీటీఈ రెండింటి అనుమతి ఉందో, లేదో తెలుసుకోవాలి.
  • అనుమతులు లేకుండా, కనీస వసతులు, నిపుణులైన అధ్యాపకులు లేకపోయినా కొన్ని కళాశాలలు కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇలాంటివాటికి దూరంగా ఉండాలి. వివరాలకు www.pci.nic.in చూడొచ్చు.
  • ఎన్‌బీఏ అక్రిడిటేషన్ ఉన్న ఫార్మసీ కళాశాలల్లో చేరడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఫార్మసీ విద్యార్థులు తమ అభిప్రాయాల్ని, ఇబ్బందులను www.pci.nic.in వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయొచ్చు.
  • అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:15 ఉండాలి. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ 1:2:6 నిష్పత్తిలో ఉండాలి. మంచి ప్రమాణాలు కలిగిన లేబొరేటరీలు ఉన్న కళాశాలలనే విద్యార్థులు ఎంచుకోవాలి.
  • కళాశాల స్థాపించి ఎన్నేళ్లయింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఆ కళాశాలకు ఇతర పరిశ్రమలతో భాగస్వామ్యం మొదలైన అంశాలను పరిశీలించి కళాశాలను ఎంచుకోవాలి. పరిశోధనలకు ప్రాధాన్యతనిచ్చే యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో చే రాలి.
Published date : 12 Jul 2013 03:20PM

Photo Stories