Skip to main content

ఉద్యోగ వేటలో..ఈ చిన్న చిన్న పొరపాట్లతో అప్రమత్తంగా ఉంటేనే కొలువు

పోటీ ప్రపంచం.. రంగం ఏదైనా... కంపెనీ ఎలాంటిదైనా.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే చాలు.. వేలు, లక్షల్లో దరఖాస్తులు! ఒక్కో పోస్టుకు పదుల సంఖ్యలో పోటీ!! ఇలాంటి పరిస్థితుల్లో అడుగడుగునా అప్రమత్తంగా ఉంటేనే కొలువు దక్కుతుంది. లేకుంటే వెనుదిరగాల్సిందే! అభ్యర్థులు రెజ్యూమె దగ్గర నుంచి ఇంటర్వ్యూ వరకూ.. చిన్నచిన్న పొరపాట్లు చేస్తూ.. అవకాశాలు దూరంచేసుకుంటున్నారు. అర్హతలున్నా, సబ్జెక్టుపై పట్టు సాధించినా.. ఉద్యోగ వేటలో విఫలమవుతున్నవారెందరో!! ఇలాంటి అభ్యర్థులు రెజ్యూమె దగ్గర నుంచి ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వరకూ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనం...
ఏ పోస్టు.. ఏ కంపెనీ :
ఉద్యోగం కోసం ఎక్కడ, ఎలా ప్రయత్నం చేస్తున్నారనేది చాలా ముఖ్యం. ఇంటర్నెట్ లో కనిపించే కంపెనీలన్నింటికీ రెజ్యూమెలను పంపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మన అర్హతలు, భవిష్యత్ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా చేరాల్సిన కంపెనీ, చేయాల్సిన ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. లింక్‌డిన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా మనకు సరిపోయే కంపెనీలను గుర్తించొచ్చు. ప్రముఖ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లలో ఉద్యోగ సమాచారాన్ని నిత్యం చెక్ చేస్తూ ఉండాలి. ఆయా సంస్థలు నియామక ప్రకటనలను ఎప్పటికప్పడు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుంటాయి. దీనివల్ల అయా కంపెనీల్లో అవకాశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. మరోవైపు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నెట్‌వర్క్ పెంచుకోవడం కూడా ముఖ్యమే. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ సీనియర్ ఉద్యోగుల రిఫరెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్స్ ద్వారా కూడా జాబ్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే హైరింగ్ కంపెనీల హెచ్‌ఆర్‌లతో, మేనేజర్‌లతో తరచూ మాట్లాడుతుండాలి.

నైపుణ్యాల కొరత..
చాలా మంది ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం కాకపోవడానికి నైపుణ్యాల లోపం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి అభ్యర్థులు తాము దరఖాస్తు చేస్తున్న పోస్టుకు ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకోవాలి. వాటిపై అవగాహన పెంచుకునేందుకు కృషిచేయాలి. అదేవిధంగా ఆయా ఉద్యోగ విధులకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం, అకడెమిక్ సబ్జెక్టులపై పట్టు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు చేజారుతుంటాయి. మరోవైపు కొంతమంది అభ్యర్థులు అవకాశాలు లభించినప్పుడు.. చిన్న ఉద్యోగాలుగా భావించి అలాంటి వాటిని వదులుకుంటారు. అందుకే ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టేటప్పుడే ముందు మీరు ఎలాంటి ఉద్యోగం కోరుకుంటున్నారు.. మీ అర్హతలు, నైపుణ్యాలు.. ఆ ఉద్యోగానికి సరిపోతాయా? మీరు చదివిన చదువుకు, దరఖాస్తు చేసిన జాబ్‌కు సంబంధం ఉందా?.. ఇలాంటివన్నీ సరిచూసుకొని నిర్ధారణకు రావాలి.

సోషల్ మీడియా ప్రొఫైల్ :
అధిక శాతం మంది అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయరు. ఉద్యోగ ప్రయత్నం చేసే ముందు సోషల్ మీడియా సైట్లలోని ప్రొఫైల్‌ను సరి చూసుకోవాలి. ఇచ్చిన రెజ్యూమె, మీ సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న సమాచారానికి సరిపోలకుంటే.. పక్కన పెట్టే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్న ప్రొఫైల్ ఫీల్ గుడ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం చాలా కంపెనీలు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను సోషల్ మీడియా ద్వారా క్రాస్‌చెక్ చేస్తున్నాయి. వ్యక్తిగత వివరాలు, ఏవైనా వివాదాస్పద పోస్టింగ్‌లు పెట్టారా, ఎవరి మీదైనా ట్రోలింగ్ చేసారా, సోషల్ మీడియా వేదికగా ఏవైనా తగాదాలు, రాజకీయ గొడవలు జరిగాయా, స్నేహితులతో ఎలాంటి అనుభూతులు పంచుకున్నారు.. ఇలాంటి వాటిపై దృష్టిపెట్టే అవకాశముంది.

తప్పులు లేకుండా, క్లుప్తంగా
చాలామంది రిక్రూటర్లు రెజ్యూమే చూసేందుకు కేవలం 30 సెకన్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం తెలిపింది. కాబట్టి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమెలను ఎలాంటి తప్పులు లేకుండా, క్లుప్తంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలి. అలాగే గతంలో పనిచేసిన అనుభవం, విద్యార్హతలకు సంబంధించి పొరపాటు సమాచారం రెజ్యూమెలో పొందుపరచకూడదు. ఎందుకంటే.. కంపెనీలు రెజ్యూమ్‌ను షార్ట్ లిస్ట్ చేశాక... అభ్యర్థి ఇచ్చిన వివరాలను క్రాస్‌చెక్ చేస్తాయి. ఇచ్చిన వివరాలు, అభ్యర్థి నైపుణ్యాలు, కంపెనీ అవసరాలకు తగినట్లు ఉన్నాయో లేదో చూస్తాయి. అలాగే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు క్లుప్తంగా, సూటిగా సమాధానాలు చెప్పాలి. మీరు చెప్పే సమాధానాలు ఇంటర్వ్యూర్‌ను మెప్పించేలా, ఒప్పించేలా ఉండాలి.

కాపీ, పేస్ట్ చేస్తే :
ఒక కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాక.. మరో సంస్థలో జాబ్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో చాలామంది అభ్యర్థులు తమ రెజ్యూమెతోపాటు రిఫరెన్స్ లెటర్‌ను జత చేస్తున్నారు. ఇలాచేస్తే సదరు రెజ్యూమెను పరిగణనలోకి తీసుకునే అవకాశం తక్కువే. అలాగే రెజ్యూమె కాపీ పేస్ట్ చేసినట్లు ఉండకూడదు. మీ రెజ్యూమె అన్ని విధాల స్పష్టంగా ఉన్నప్పుడే.. సదరు సంస్థ మీ దరఖాస్తును పరిగణనలోకి తీసుకునే వీలుంది. రెజ్యూమె పంపే ముందు మీరు గతంలో ఏ కంపెనీలో పని చేసారు.. ఎలాంటి ప్రాజెక్ట్ లేదా విభాగంలో పనిచేశారో స్పష్టంగా పేర్కొనండి.

సమయానికి ముందుగానే..
రెజ్యూమెను సంబంధిత కంపెనీకి లేదా రిక్రూటర్‌కు పంపిన తర్వాత వారి నుంచి మెసేజ్ వచ్చే వరకూ వేచి ఉండాలి. ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు నిర్ణీత సమయానికంటే ముందుగానే వెళ్లాలి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కొంతమంది పలు కారణాలతో ఆలస్యంగా చేరుకుంటారు. టైం మేనేజ్‌మెంట్ అనేది ఉద్యోగ విధుల్లో చాలా ముఖ్యం. కాబట్టి నిర్దేశిత సమయం కంటే ముందుగానే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్యాక్‌డోర్ ప్రాసెస్ పేరుతో కొంతమంది మోసంచేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రలోభాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే ఇంటర్వ్యూకు హాజరయ్యాక కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకుంటే నిరాశ చెందకండి. మళ్లీ ఖాళీలు ఉన్నప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది.

వినయంగా మాట్లాడటం :
పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో కొంతమంది అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సరిగా స్పందించరు. ముఖ్యంగా ఇంటర్వ్యూలో కంపెనీకి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతే ఉద్యోగానికి సరిపోరనే అంచనాకు వస్తారు. కంపెనీ గురించిన సమాచారం అడిగితే వీలైనంతగా చెప్పేలా సిద్దపడాలి. ఇంటర్వ్యూలో వినయంగా మాట్లాడం చాలా ముఖ్యం. అమాయక మనస్తత్వంతో కాకుండా.. భయపడకుండా ధైర్యంగా మాట్లాడాలి. అడిగిన ప్రశ్నలకు ఆత్మ విశ్వాసంతోసమాధానం చెప్పాలి. తెలియకుంటే.. తెలియదని స్పష్టం చేయాలి. ప్రశ్న పూర్తిగా విన్న తర్వాతనే స్పందించాలి. మాట్లాడేటప్పుడు ఆధిపత్య ధోరణితో వ్యవహరించకూడదు.

డిమాండ్‌లు పెట్టొద్దు :
ఇంటర్వ్యూ తర్వాత జీతం, ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం విషయంలో డిమాండ్‌లు పెట్టకూడదు. ఇలా చేస్తే అవకాశాలు దెబ్బతింటాయి. ఉద్యోగంలో చేరేటప్పుడు వీటికి సంబంధించి కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై ఇప్పుడే డిమాండ్ చేస్తున్నట్లు వ్యవహరించకూడదు. అలాగే సంస్థలో పనిగంటలు, షిఫ్టులకు సంబంధించి వివరాలు ఇప్పటికే సదరు కంపెనీలో పనిచేసే వ్యక్తుల ద్వారా తెలుసుకొని.. అనుకూలంగా అనిపిస్తే ముందుకు వెళ్లడానికి సిద్ధపడాలి. ఏ ప్రాంతంలో పని చేయలనుకుంటున్నారు అనేది కూడా ముందుగా నిర్ణయం తీసుకొని ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి!!

బాడీ లాంగ్వేజ్ :
వ్యక్తిగతంగా మంచి ముద్ర వేయాలంటే.. అభ్యర్థి బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎక్కువగా తమ బాడీ లాంగ్వేజ్ విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. తద్వారా తమని తాము ప్రదర్శించుకోవడంలో విఫలమవుతుంటారు.
  • దుస్తులు ఆడంబరంగా కాకుండా.. సింపుల్‌గా, ఫార్మల్‌గా ఉండాలి.
  • ఇంటర్వ్యూలో రిలాక్స్ అయినట్లు కూర్చోకూడదు.
  • ఇంటర్వ్యూ చేసే వారందరనీ మర్యాదపూర్వక పరిచయం చేసుకోవాలి.
  • అడిగిన ప్రతి ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం ఇవ్వాలి. నీరసంగా మాట్లాడకూడదు. అతి చురుకుగా ఉండకుండా.. మధ్యస్థితితో సమాధానాలు ఇవ్వాలి.
  • అభ్యర్థి తన నైపుణ్యాలను పూరిస్థాయి ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించాలి.

ఫోన్ ఇంటర్వ్యూకు అంతరాయం లేకుండా...:
ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఫోన్ ఇంటర్వ్యూ సర్వసాధారణంగా మారింది. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటంతోపాటు, కంపెనీ సుదూర ప్రాంతంలో ఉన్న సందర్భాల్లో ఫోన్ ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థి పంపిన రెజ్యూమె ఆధారంగా ఓ అంచనాకు రావడం కష్టమని భావించినప్పుడు కూడా ఫోన్ ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఎక్కువగా బీపీవో, టెలీ మార్కెటింగ్, కాల్ సెంటర్ వంటి ఉద్యోగాల కోసమైతే.. అభ్యర్థి ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి ఇలా చేస్తారు. కొన్నిసార్లు ముందుగా చెప్పకుండానే టెలిఫోన్ ఇంటర్వ్యూ చేస్తారు. అలాంటి సందర్భాల్లో అభ్యర్థులు ఫోన్ ఇంటర్వ్యూను కూడా పర్సనల్ ఇంటర్వ్యూగానే భావించాలి. ఇంటర్వ్యూకు సంబంధించి ఫోన్ వస్తుందని ముందే సమాచారం ఉంటే.. ఫోన్ పని చేస్తుందో లేదో సరిచూసుకోవాలి. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆవేశంగా కానీ, అసహనంగా కానీ, నీరసంగా కానీ సమాధానాలు ఇవ్వకూడదు. రెజ్యూమెలో ఏ అంశాలైతే పేర్కొన్నారో అవే చెప్పాలి. గతంలో ఏ సంస్థలో పని చేశారు.. ఇప్పుడు ఎందుకు మానేశారో సావధానంగా వివరించగలగాలి. అలాగే జీతం, ప్యాకేజీ విషయంలో పట్టుబట్టకపోవడమే మంచిది.
Published date : 01 Nov 2019 11:47AM

Photo Stories