పీఎంఆర్‌ఎఫ్‌తో టెక్, సైన్స్ పరిశోధనలకు వరం.. ఎంపికైతే నెలకు రూ.80వేల వరకు స్టైఫెండ్!
2020–21 సంవత్సరానికి సంబంధించి ఇటీవలే పీఎంఆర్‌ఎఫ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 2021–22 సంవత్సరానికి సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. పీఎంఆర్‌ఎఫ్‌తో ప్రయోజనాలు.. విధి విధానాలు.. అర్హతలు.. ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం..
‘సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు పెరగాలి. వీటిద్వారా సరికొత్త ఆవిష్కరణలు జరగాలి. అప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుంది’ అనే విద్యావేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. 2018–19 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ప్రత్యేక పథకం.. ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్‌ఎఫ్). నిర్దిష్టంగా పేర్కొన్న ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. పీఎంఆర్‌ఎఫ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఏటా వేయి మందికి ఈ ఫెలోషిప్ లభిస్తుంది.
భారీ ఆర్థిక ప్రోత్సాహకం..
పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. సదరు రీసెర్చ్ ఫెలోస్‌కు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తాయి. తొలి రెండేళ్లు నెలకు రూ.70వేలు చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.75వేలు, నాలుగు, అయిదో సంవత్సరాల్లో నెలకు రూ.80వేలు చొప్పున ఫెలోషిప్ అందిస్తారు. దీనికి అదనంగా ఏటా రూ.రెండు లక్షల రీసెర్చ్ గ్రాంట్‌ను కూడా ఇస్తారు. ఇలా అయిదేళ్లపాటు ఫెలోషిప్ ఇచ్చే క్రమంలో.. నిర్దిష్ట ప్రమాణాలు, అర్హతలు కూడా పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అర్హతగా రీసెర్చ్‌కు ఎంపికైన వారికి నాలుగో ఏడాది చివరి వరకు; బీటెక్ తత్సమాన కోర్సు అర్హతగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరిన వారికి అయిదో ఏడాది చివరి వరకు ఫెలోషిప్ లభిస్తుంది.
గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే..
పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. పీహెచ్‌డీలో చేరిన విద్యార్థుల రీసెర్చ్ ప్రతిపాదనలను ఆయా విద్యాసంస్థలు.. పీఎంఆర్‌ఎఫ్ కోసం ఆన్‌లైన్ విధానంలో పంపుతాయి. వీటిని నేషనల్ కో–ఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తుంది.
సదరు విద్యార్థుల రీసెర్చ్ అంశం, ఉద్దేశం, దానివల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని.. పీఎంఆర్‌ఎఫ్‌కు అర్హులను ప్రకటిస్తుంది. గ్రాంటింగ్ ఇన్‌సిట్యూట్‌ల వివరాలు..
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు)
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లు
ఐఐఎస్‌సీ–బెంగళూరు
సైన్స్, టెక్నాలజీ కోర్సులు అందిస్తూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్స్ జాబితాలో టాప్–25లో నిలిచిన ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు.
బ్యాచిలర్ డిగ్రీ నుంచే రీసెర్చ్ దిశగా..
వాస్తవానికి పీహెచ్‌డీలో ప్రవేశించాలంటే.. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. కాని పీఎంఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం–సైన్స్, టెక్నాలజీ కోర్సులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోనే పీహెచ్‌డీ దిశగా అడుగులు వేసే అవకాశం లభిస్తుంది.
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఈఎస్‌టీ, ఐఐఎస్‌సీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో బోధన సాగించే ట్రిపుల్ ఐటీల్లో.. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధిలోని కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు,చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పీఎంఆర్‌ఎఫ్‌కు అర్హులు. (లేదా)
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లేదా రెండేళ్ల ఎమ్మెస్సీ లేదా అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ (యూజీ+పీజీ) ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు అకడమిక్‌గా పది పాయింట్ల జీపీఏ విధానంలో కచ్చితంగా 8పాయింట్లు సొంతం చేసుకోవాలి.
జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ, ఇతర సంస్థలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో పైన పేర్కొన్న కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యార్థులు అకడమిక్‌గా 8జీపీఏ పాయింట్లతోపాటు గేట్ పరీక్షలో తమ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్‌లో కనీసం 650స్కోర్ సాధించాలి.
ఈ అర్హతలున్న విద్యార్థులే కాకుండా.. ఇప్పటికే గేట్ ఉత్తీర్ణతతో పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ లేదా ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశించి.. మొదటి సెమిస్టర్‌లో 8 జీపీఏ పొందిన విద్యార్థులు కూడా పీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుకు అర్హులే.
పైన పేర్కొన్న అర్హతలున్న విద్యార్థులంతా.. పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉండాలి. ఇలా పీహెచ్‌డీ అడ్మిషన్ ఇచ్చిన సదరు ఇన్‌స్టిట్యూట్‌లు.. ఆయా విద్యార్థులకు ఫెలోషిప్‌కోసం ప్రతిపాదనలు, ఇతర వివరాలను పీఎంఆర్‌ఎఫ్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు కూడా..
పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత.. అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక వెబ్‌లింక్‌ను పంపుతారు. ఈ వెబ్‌లింక్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యా నేపథ్యం, రీసెర్చ్ అనుభవం లేదా ఇంటర్న్‌షిప్ వివరాలు, సీవీ(కరిక్యులం విటే), రీసెర్చ్ ప్రతిపాదన,స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, ఇప్పటికే ఏమైనా పబ్లికేషన్స్ ప్రచురితమైతే.. ఆ వివరాలు, అభ్యర్థులకు రికమండేషన్ లెటర్ ఇచ్చే సబ్జెక్ట్ నిపుణుల వివరాలు ఈ ఆన్‌లైన్ దరఖాస్తులో పొందుపర్చాలి.
లేటరల్ ఎంట్రీ విధానం..
పీఎంఆర్‌ఎఫ్‌కు అర్హులైన అభ్యర్థులను గుర్తించే క్రమంలో గత ఏడాది నుంచి లేటరల్ ఎంట్రీ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించి కూడా నిర్దిష్ట అర్హత ప్రమాణాలు పేర్కొన్నారు.
పీజీ అర్హతతో పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. కనీసం 12 నెలల ప్రోగ్రామ్‌ను పూర్తి చేసుకోవాలి. (లేదా)
పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో..బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. 24 నెలలు కోర్సు పూర్తి చేసుకొని ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/ఎమ్మెస్సీ అండ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందితే.. వారు పీజీ కోర్సు పూర్తి చేసిన తేదీ నుంచి 12 నెలలోపు దరఖాస్తు చేసుకోవాలి.
పీహెచ్‌డీ విద్యార్థులు కనీసం నాలుగు కోర్సులు పూర్తి చేసుకొని.. వాటిలో అన్నింటిలో కలిపి కనీసం 8.5 జీపీఏ సాధించాలి.
నోడల్ ఇన్‌స్టిట్యూట్‌ల విధానం..
పీఎంఆర్‌ఎఫ్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం–నోడల్ ఇన్‌స్టిట్యూట్‌ల విధానం అమలవుతోంది. పలు విభాగాల్లో రీసెర్చ్ కార్యకలాపాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఆయా విభాగాలకు సంబంధించి ఐఐటీలను నోడల్ ఇన్‌స్టిట్యూట్‌లుగా నిర్దేశించారు. ముందుగా గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను నోడల్ ఇన్‌స్టిట్యూట్‌లు పరిశీలించి.. జాతీయ స్థాయి ఎంపిక కమిటికీ పంపుతాయి. ఆ తర్వాత జాతీయ స్థాయి కమిటీ మరోసారి క్షుణ్నంగా అభ్యర్థులకు సంబంధించిన వివరాలు, ప్రతిపాదనలు పరిశీలించి తుది ఎంపిక చేస్తుంది.
ఇంకా చదవండి : part 2: ఏటా రెండుసార్లు పీఎంఆర్‌ఎఫ్.. ఫలితాలు సాధిస్తేనే..