ఈ నైపుణ్యాలు మీలో ఉన్నాయా.. అయితే డేటా అనలిస్ట్‌గా క్రేజీ కెరీర్ పొందొచ్చు..
ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు.
సేకరణ.. విశ్లేషణ..
గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి.
డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్‌లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు.
విభిన్న నైపుణ్యాలు..
బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం.
ప్రోగ్రామింగ్‌పై పట్టు..
డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి.