Skip to main content

After MBBS: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (NEXT)లో నెగ్గితేనే... ఉన్నత విద్య, ప్రాక్టీస్‌!

After MBBS Career: advantages of next exam and preparation stages
After MBBS Career: advantages of next exam and preparation stages

ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైద్య విద్య నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న.. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌.. ‘నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌’ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే.. ఉన్నత విద్య, ప్రాక్టీస్‌లకు అవకాశం లభిస్తుంది! దీనికి సంబంధించి తాజాగా.. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌.. లైసెన్స్‌ టు ప్రాక్టీస్‌ మెడిసిన్‌–2022, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ అడిషనల్‌ క్వాలిఫికేషన్స్‌–2022 పేరుతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నేపథ్యంలో.. ‘నెక్స్‌ట్‌’ ఎగ్జామ్‌ ఉద్దేశం.. ఈ పరీక్షతో ప్రయోజనాలు.. పరీక్ష విధానం తదితర అంశాలపై విశ్లేషణ...

  • నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ కీలక నిర్ణయం
  • నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్స్‌ట్‌) అమలుకు అడుగులు
  • నీట్‌–పీజీ, ఎఫ్‌ఎంజీఈలకు ఇక స్వస్తి
  • ఈ ఏడాది చివర్లో తొలి నెక్స్‌ట్‌కు అవకాశం
  • 240 ప్రశ్నలు–960 మార్కులకు ఎగ్జామ్‌

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ).. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థానంలో.. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ యాక్ట్‌–2019 పేరుతో..2019లో ఏర్పాటైన చట్టబద్ద సంస్థ. అప్పటి నుంచి దేశంలో వైద్య విద్య ప్రమాణాలు, నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వహిస్తున్న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌.. వైద్య రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్‌ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ గురించి చర్చ జరుగుతోంది. ఈ నెక్స్‌ట్‌ ఎంట్రన్స్‌ విధానాలు, ఇతర విషయాలపై కసరత్తు చేసిన ఎన్‌ఎంసీ నిపుణుల కమిటీ.. తాజాగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతోంది. 

నెక్స్‌ట్‌ అంటే?

నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌.. దీనినే నెక్స్‌ట్‌గా పేర్కొంటున్నారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు.. ఉన్నత విద్య, ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్‌ వంటి వాటి కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న వేర్వేరు విధానాలన్నింటినీ తొలగించి.. నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి జరిపే నీట్‌–పీజీ ఎంట్రన్స్, అదే విధంగా విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మన దేశంలో ప్రాక్టీస్‌ కోసం నిర్వహించే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లకు బదులు.. నెక్స్‌ట్‌ పేరుతో ఒకే పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ఎంబీబీఎస్‌ ఫైనల్‌కు ఉమ్మడి పరీక్షగా

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఉమ్మడి ఫైనల్‌ పరీక్షగా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలను వేర్వేరుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విద్య విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఉత్తీర్ణత శాతాలు, విద్యార్థుల్లో నైపుణ్యాల కోణంలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఎంబీబీఎస్‌ ఫైనల్‌కు ఉమ్మడి పరీక్షగా నెక్స్‌ట్‌ను నిర్వహిస్తే.. జాతీయ స్థాయిలోని ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులు పొందిన అవగాహన తెలుసుకునేందుకు వీలవుతుందనే అభిప్రాయాన్ని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వ్యక్తం చేస్తోంది.

వైద్య పరికరాల తయారి రంగంలో.. భారీగా ఉద్యోగాలు

రెండు దశలుగా పరీక్ష

నెక్స్‌ట్‌ను రెండు దశలుగా(నెక్స్‌ట్‌–1, నెక్స్‌ట్‌–2,) నిర్వహించాలని ఎన్‌ఎంసీ ఆలోచిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించారు. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ థియరీ పార్ట్‌ పూర్తయ్యాక నెక్స్‌ట్‌–1ను, ఆ తర్వాత ఏడాది రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక నెక్స్‌ట్‌–2ను జరపాలనే ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. 2022 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రతిపాదనలను ఆచరణలోకి తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అంటే.. 2022లో ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు.. 2026, 2027లలో నెక్స్‌ట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

అర్హతలు

  • నెక్స్‌ట్‌కు హాజరయ్యేందుకు గుర్తింపుపొందిన యూనివర్సిటీ/వైద్య కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకోవాలి. దీంతోపాటు 12 నెలల వ్యవధిలో ఉండే కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకోవాలి.
  • ఇవి పూర్తి చేసుకున్న వారికి నెక్స్‌ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది.
  • నెక్స్‌ట్‌లో ఉత్తీర్ణత తర్వాత నేషనల్‌ మెడికల్‌ రిజిస్ట్రీ, లేదా రాష్ట్రాల మెడికల్‌ రిజిస్ట్రీల్లో పేరు నమోదుకు అవకాశం లభిస్తుంది.

విదేశాల్లో ఎంబీబీఎస్‌.. ఇలా

  • విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. 
  • వీరు దేశంలో ఉన్నత విద్య, ప్రాక్టీస్‌ కోసం నెక్స్‌ట్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ ఎన్‌ఎంసీ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. అవి..
  • విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న భారత విద్యార్థులు.. ఎన్‌ఎంసీ గుర్తింపు పొందిన వైద్య విద్య సంస్థలోనే కోర్సు పూర్తి చేసుకోవాలి.
  • మన దేశంలో ఎన్‌ఎంసీ గుర్తింపు పొందిన కాలేజ్‌ లేదా హాస్పిటల్‌లో కంపల్సరీ రొటేటింగ్‌ హౌస్‌మెన్‌షిప్‌గా పిలిచే మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసుకోవాలి.
  • ఈ రెండూ పూర్తయిన తర్వాత నెక్స్‌ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇప్పటి వరకు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చిన అభ్యర్థులు ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇకపై ఈ పరీక్షను రద్దు చేయనున్నారు.

థియరీ, ప్రాక్టికల్స్‌.. పరీక్షించేలా

నెక్స్‌ట్‌ ద్వారా విద్యార్థుల థియరీ, ప్రాక్టికల్‌ నైపుణ్యాలను తెలుసుకునేలా పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. నెక్స్‌ట్‌–1ను థియరీ పరీక్షలుగా, నెక్స్‌ట్‌–2ను ప్రాక్టికల్‌ పరీక్షలుగా నిర్వహించే అవకాశం ఉంది.

240 ప్రశ్నలు–960 మార్కులు

  • నెక్స్‌ట్‌ పరీక్షను రెండు దశలుగా నిర్వహించనున్నారు. తొలిదశ నెక్స్‌ట్‌–1 తీరుతెన్నులపై, పరీక్ష విధానంపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ స్పష్టతనిచ్చింది. 
  • మేజర్‌ సబ్జెక్ట్, మైనర్‌ సబ్జెక్ట్‌ అనే రెండు విభాగాల్లో మొత్తం 240 ప్రశ్నలతో 960 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా పేర్కొంది.
  • ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి ఒక మార్కు కోత విధిస్తారు.
  • ఎంసీఐ కరిక్యులంలో పేర్కొన్న విధంగా ఎంబీబీఎస్‌లో ఉండే మొత్తం 19 సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడగనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. 

నీట్‌ పరీక్షకి.. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్‌ టిప్స్‌ ఇలా..

నెక్స్‌ట్‌ –1 ప్రశ్నలు–మార్కులు

  • మేజర్, మైనర్‌ సబ్జెక్ట్‌ల నుంచి మొత్తం 240 ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు.
మేజర్‌ సబ్జెక్ట్‌ అనుబంధ సబ్జెక్ట్‌  ప్రశ్నల సంఖ్య మైనర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలసంఖ్య
మెడిసిన్‌ డెర్మటాలజీ,సైకియాట్రి 55 పిడియాట్రిక్స్‌ 25
సర్జరీ ఆర్థోపెడిక్స్, అనస్థీషియా  60 ఈఎన్‌టీ 20
ఆబ్‌స్ట్రెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ రేడియాలజీ 60 ఆప్తాల్మాలజీ 20
మొత్తం   175   65

నెక్స్‌ట్‌–2 ఇలా

ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక నిర్వహించే నెక్స్‌ట్‌–2 ద్వారా పూర్తిగా ప్రాక్టికల్‌ నైపుణ్యాలను పరీక్షించనున్నారు. మూడు రోజులపాటు ఆరు సెషన్లలో ఈ పరీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది.

రెండు దశల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే

  • ఎంబీబీఎస్‌ విద్యార్థులు నెక్స్‌ట్‌–1, నెక్స్‌ట్‌–2 రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించాలి. –నెక్స్‌ట్‌–1 ఉత్తీర్ణత సాధించాక ఇంటర్న్‌షిప్‌నకు అర్హత లభించే విధంగా.. ఆ తర్వాత నెక్స్‌ట్‌–2 కూడా పూర్తి చేసుకున్నాక ఉన్నత విద్య, వైద్య వృత్తిలో అనుమతులకు అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్‌ట్‌.. రెండు దశల్లోనూ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను సైతం అమలు చేయనున్నారు.

ఆ నిర్ణయంపై భిన్నాభిప్రాయం

ఎంబీబీఎస్‌కు ఉమ్మడి ఫైనల్‌ పరీక్షగా నెక్స్‌ట్‌ నిర్వహించాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల ఇప్పటి వరకు ఆయా రాష్ట్ర స్థాయిలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.. ఇక జాతీయ స్థాయిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎంబీబీఎస్‌ ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించలేని అభ్యర్థులకు ఫలితాలు వెలువడిన ఆరు నెలలలోపు సదరు యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ.. నెక్స్‌ట్‌ను ఏడాదికి ఒకసారే నిర్వహించి, దాన్నే ఉమ్మడి ఉత్తీర్ణత పరీక్షగా పేర్కొనే నేపథ్యంలో.. ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఏడాది పాటు వేచి చూడాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

నెక్స్‌ట్‌– ముఖ్యాంశాలు

  • ఉన్నత విద్య, ప్రాక్టీస్‌ లైసెన్స్‌కు తప్పనిసరిగా.. నెక్స్‌ట్‌
  • ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఉమ్మడి అర్హత పరీక్షగా.. నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌
  • ఎంబీబీఎస్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే నెక్స్‌ట్‌కు అర్హత.
  • నెక్స్‌ట్‌–1, నెక్స్‌ట్‌–2.. రెండు దశలుగా పరీక్ష నిర్వహించే అవకాశం.
  • థియరీ, ప్రాక్టికల్‌ రెండు నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఎగ్జామ్‌. 

ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

Published date : 24 May 2022 05:19PM

Photo Stories