Skip to main content

నయా కెరీర్...సైబర్ లాయర్

ఈ మెయిల్ డేటా తస్కరించి విలువైన సమాచారం హ్యాక్..వ్యక్తులకు ఫోన్ చేసి ఖాతా వివరాలు తెలుసుకుని రూ.లక్షలు చోరీ..సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్ట్‌లు చేశారంటూ కేసులు..ఇవి సాంకేతికతతో పాటు పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు..!అన్నిట్లోకి చొచ్చుకొస్తున్న సైబర్ నేరగాళ్లు! ఇలాంటి సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంతో తెరపైకి వచ్చిన నయా కెరీర్ సైబర్ లాయర్ గురించి తెలుసుకుందాం.
సోషల్ మీడియా మొదలు.. పర్సనల్ కంప్యూటర్ వరకు.. వ్యక్తిగత ఈ- మెయిల్స్ నుంచి.. బ్యాంకు ఖాతాల దాకా.. నిత్యం ఏదో ఒకవిధంగా సైబర్ దాడులు..! కొంతకాలంగా దేశవ్యాప్తంగా విసృ్తతమవుతున్న ఘటనలు..! ఈ క్రమంలో కేసుల నమోదు, విచారణకు ప్రత్యేక చట్టాలు. ఇలాంటి తరుణంలో సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

సాంకేతికతపై అవగాహన...
సైబర్ లా అనగానే భద్రతా నిపుణులు, ఎథికల్ హ్యాకర్స్ గుర్తుకొస్తారు. వాస్తవానికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యాక్ట్-2000, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అమెండ్‌మెంట్ యాక్ట్-2008 ప్రకారం- సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు వాదించాలంటే ఆ న్యాయవాదులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ముఖ్యంగా మేధో సంపత్తి, ఈ-కమ్యూనికేషన్, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపై అవగాహన ఉండాలి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, వాటి తీరుతెన్నులను పరిశీలిస్తే.. ప్రధానంగా నెట్‌వర్కింగ్, ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రొటోకాల్, ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఆమూలాగ్రం తెలుసుకోవాలి.

నేర్చుకోవచ్చు..
సంప్రదాయ న్యాయవాద వృత్తిలోని వారు సైతం సైబర్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం సాధ్యమే. ఇంజనీరింగ్/ టెక్నికల్ విద్యార్థులు ఎథికల్ హ్యాకర్స్‌గా, సైబర్ దాడుల రక్షణ విషయాలను నేర్చుకోవడంలో ముందుంటున్నారు. వీటికంటే కాస్త సులువుగా ఉండే నెట్‌వర్కింగ్, ట్రాన్‌‌సమిషన్ కంట్రోల్ ప్రొటోకాల్ (టీసీపీ), ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ (ఓఎస్‌ఐ)ను సొంతం చేసుకోవడం న్యాయవాద గ్రాడ్యుయేట్లకు పెద్ద కష్టం కాదు. కేసు పరిశీలనలో న్యాయవాదులు ఒక సైబర్ నేర మూలాన్ని కనుగొని, అది ఏ రీతిలో జరిగిందనే విషయాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. నెట్‌వర్కింగ్, టీసీపీ, ఓఎస్‌ఐ ద్వారా.. ఘటనకు కీలకంగా భావించే ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) చిరునామా తెలుసుకోవడం ముఖ్యం. దీని ద్వారానే నేరం జరిగిన సమయంలో ఆ అడ్రస్‌ను వినియోగించిన వ్యక్తులు, తర్వాత ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్స్ ఆధారంగా అది బాధితుడి దగ్గరకు ఎలా చేరిందనే విషయాల గురించి అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.

సర్టిఫికేషన్ కోర్సులు :
సైబర్ న్యాయ నిపుణులుగా రాణించేందుకు అవసరమైన సాంకేతిక అంశాల్లో పరిజ్ఞానం పొందడానికి పలు సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌హ్యాట్, జెట్ కింగ్, వీఎం వేర్ వంటి సంస్థల ద్వారా నెట్‌వర్కింగ్, టీసీపీ తదితర కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో అభ్యసించే వీలుంది. దీనినే వృత్తిగా ఎంచుకునేవారు ఈ కోర్సులను చదివితే కెరీర్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దుకోవచ్చు.

న్యాయ కళాశాలల్లోనూ..
దేశంలో న్యాయ విద్యాబోధనలో పేరుగాంచిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు సైబర్ లా పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (బీఏ, ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణులకు సైబర్ న్యాయవాదులుగా రాణించడానికి ఇవి దోహదపడతాయి. ఇగ్నో, ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు కూడా ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. నేరాల విసృ్తతి నేపథ్యంలో.. ప్రత్యేక నైపుణ్యాలున్న న్యాయవాదులను తీర్చిదిద్దేందుకు పలు కళాశాలలు ఫుల్ టైమ్ సైబర్ లా, దూర విద్య విధానాల్లో సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. కరిక్యులంలోనూ సైబర్ లా నిపుణులకు అవసరమైన సాంకేతిక అంశాలకూ చోటిస్తున్నాయి.

ఉపాధికి ఢోకా లేదు...
వ్యక్తిగత జీవితం నుంచి సోషల్ నెట్‌వర్కింగ్ వరకు ఏదో ఒక రీతిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నందున ప్రస్తుత తరుణంలో సైబర్ న్యాయ నిపుణులకు ఉపాధి పరంగా ఢోకా లేదని చెప్పొచ్చు. బాధితుల తరఫున అవసరమైన సాంకేతిక సాక్ష్యాధారాలతో సమర్థంగా వాదనలు వినిపించి, న్యాయం చేకూర్చేవారి అవసరం అంతకంతకు పెరుగుతోంది. ప్రభుత్వ సంస్థలు సైతం సైబర్ లా నిపుణులను ఫుల్‌టైం, పార్ట్‌టైమ్ పద్ధతుల్లో భర్తీ చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల్లోనూ వీరికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా.. లీగల్ కన్సల్టింగ్, కేపీవో, ఐపీఆర్ సోర్సింగ్ సంస్థలు, ఐటీ కంపెనీలు లీగల్ అడ్వైజర్స్, సైబర్ అసిస్టెంట్స్, లాయర్, సైబర్ లాయర్ వంటి హోదాల్లో నియమించుకుంటున్నాయి.

ప్రత్యేక లక్షణాలుంటేనే..
న్యాయశాస్త్ర నైపుణ్యం, సైబర్ అంశాల సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యక్తిగతంగానూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే సైబర్ న్యాయవాదిగా సుదీర్ఘ కాలం రాణించే వీలుంటుంది. అవి..
  • ఐటీ చట్టంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం
  • సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడలను పసిగట్టడం
  • సంఘటనల మూలాలు కనుగొనాలనే వ్యక్తిగత జిజ్ఞాస
  • ఏఏ రంగాల్లో సైబర్ నేరాలు విస్తృతమవుతున్నాయి..? అందుకు కారణాలు..? లోపాలను స్వయంగా విశ్లేషించగలిగే సామర్థ్యం.
ఐటీ సర్టిఫికేషన్స్ :
సైబర్ లా నిపుణులకు అవసరమయ్యే ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు..
1. రెడ్ హ్యాట్
వెబ్‌సైట్: www.redhat.com
2. జెట్ కింగ్
వెబ్‌సైట్: www.jetking.com
3. సీసీఎన్‌ఏ
వెబ్‌సైట్: www.cisco.com


దేశంలో సైబర్ న్యాయ కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యా సంస్థలు...
1. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్
కోర్సు: అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ఇన్ సైబర్ లా, ఐటీ, సోషల్ మీడియా లా
వెబ్‌సైట్: www.onlinecourses.nujs.edu

2. నల్సార్ హైదరాబాద్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సైబర్ ‘లా’స్ (డిస్టెన్స్)
వెబ్‌సైట్: www.nalsarpro.org

3. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్
వెబ్‌సైట్: www.nls.ac.in

4. ది నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ
కోర్సు: ఎంఎస్ ఇన్ సైబర్ లా అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
వెబ్‌సైట్: www.nliu.ac.in

5. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లా
వెబ్‌సైట్: www.ignou.ac.in

6. ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లా
వెబ్‌సైట్: www.ili.ac.in
Published date : 14 Oct 2017 03:52PM

Photo Stories