‘ లా’ కెరీర్‌తో విస్తృత అవకాశాలు...
కార్పొరేట్ కెరీర్..
తాము నిర్వహించే కార్యకలాపాలపరంగా ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవడం.. సమస్యలు తలెత్తినపుడు పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన న్యాయ నిపుణులను నియమించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ పరిణామం లా డిగ్రీతో కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తోంది. దీంతో లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్, కంప్లయన్స్ ఆఫీసర్స్ పేరుతో న్యాయ శాస్త్ర పట్టభద్రులకు ఆఫర్లు లభిస్తున్నాయి.
కేపీఓ, ఐపీఆర్ :
నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (కేపీఓ), ఐపీఆర్ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్).. లా కోర్సుల ఉత్తీర్ణులకు ప్రస్తుతం ఉద్యోగావకాశాల పరంగా ప్రధాన వేదికలుగా నిలుస్తున్న విభాగాలు. ముఖ్యంగా ఐపీఆర్‌లో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటోంది. లీగల్ ప్రాసెస్Sఔట్ సోర్సింగ్ (ఎల్‌పీఓ) సంస్థలు కూడా ప్రధాన ఉపాధి వేదికలుగా మారుతున్నాయి.
న్యాయ శాఖలో కొలువు...
లా డిగ్రీతో ప్రభుత్వ న్యాయ శాఖలో సైతం కొలువు సొంతం చేసుకోవచ్చు. జూనియర్ జడ్జి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి పోస్టులతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటి కోసం ఇటీవల కాలంలో నిరంతరం నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తదుపరి దశలో నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వూ్యల్లో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ కొలువు ఖాయమవుతుంది. అనంతరం అనుభవం, పనితీరు ఆధారంగా హైకోర్టు జడ్జి స్థాయికి చేరుకునే అవకాశముంది.
సైబర్ న్యాయవాదులుగా..
కోర్సు పరిజ్ఞానానికి తోడు ఐటీ నైపుణ్యాలు ఉంటే ఈ సాంకేతిక యుగంలో సైబర్ న్యాయవాదులుగానూ స్థిరపడొచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ సంబంధిత నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్‌లో సైబర్ లాయర్స్‌కు డిమాండ్ ఏర్పడింది. సంబంధిత సాంకేతికతపై అవగాహన ఏర్పర్చుకుంటే సైబర్ లాయర్‌గా మంచి గుర్తింపు పొందొచ్చు.
పీజీతో అవకాశాలు...
లాలో పీజీ పూర్తిచేసినవారికి అవకాశాల పరిధి మరింత విస్తృతమని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్స్‌కు డిమాండ్ నెలకొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లా పీజీలో సైతం సరికొత్త స్పెషలైజేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. నేషనల్ లా స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ– బెంగళూరు.. బిజినెస్ ‘లా’స్ అండ్ హ్యూమన్ రైట్స్ అంశాలు ఉన్న స్పెషలైజేషన్‌ను అందిస్తోంది.
నిరంతర అభ్యసనం...
న్యాయశాస్త్రం పూర్తిచేసి స్వయం ఉపాధి/ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు.. కేవలం లా డిగ్రీ çపట్టా అందుకోవడానికే పరిమితం కాకూడదు. కెరీర్ గమనంలో నిత్య విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే రాణించే వీలుంటుంది. ముఖ్యంగా పలు రంగాలకు సంబంధించిన చట్టాలు నిరంతరం మారుతున్నాయి. వాటిపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటేనే వృత్తిలో పైకి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
క్యాంపస్ డ్రైవ్స్ :
దేశంలో లా కోర్సులకు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ధోరణి మొదలైంది. పలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖ లా ఇన్‌స్టిట్యూట్‌లలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. నల్సార్–హైదరాబాద్, ఎన్‌ఎల్‌ఎస్‌యూ– బెంగళూరు, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ (వైజాగ్) వంటివాటికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), కన్సల్టింగ్ రంగ సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌కు వస్తున్నాయి. సగటున రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనంతో గతంలో ఆఫర్లు వచ్చాయి.
- వాక్పటిమ
- ఎదుటివారిని మెప్పించే తత్వం
- నిరంతర అభ్యసనం
- కొత్త చట్టాలపై అవగాహన
- సోషల్ నెట్‌వర్కింగ్
- సాంకేతిక నైపుణ్యాలు
- కార్పొరేట్ కంపెనీల్లో సగటు వార్షిక వేతనం రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలు.
- ఎల్‌పీఓ, కేపీఓ రంగాల్లో భారీగా న్యాయ నిపుణులకు డిమాండ్.
- పీజీలో కార్పొరేట్ లా, ఐపీఆర్ స్పెషలైజేషన్లకు క్రేజ్.
ప్రస్తుతం లా కోర్సులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు లాను కేవలం ప్రత్యామ్నాయ కోర్సుగా కాకుండా.. కెరీర్‌కు చక్కటి సోపానంగా పరిగణించాలి. కోర్సులో చేరినప్పటి నుంచే కేస్ స్టడీస్ విశ్లేషణ, ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో అభ్యసనం సాగించాలి. తద్వారా సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంపొంది తాజా పరిస్థితులపైనా అవగాహన ఏర్పడుతుంది. కెరీర్‌లో మరింత మెరుగ్గా రాణించే సామర్థ్యం లభిస్తుంది.
–ప్రొఫెసర్ జీబీ రెడ్డి, ఓయూ కాలేజ్ ఆఫ్ లా