Skip to main content

కెరీర్‌కు వారధిని నిర్మించుకోండిలా...

దేశంలో అత్యధిక మంది ఎంచుకుంటున్న సంప్రదాయ వృత్తుల్లో.. న్యాయవాద వృత్తి ఒకటి.. వాక్చాతుర్యం, సవాళ్లను స్వీకరించే గుణం ఉన్న వారికి సరిపడే కెరీర్.. ఒకప్పటి మాదిరిగా కేవలం కేసులు-క్లైంట్‌లు వ్యవహారాలకే పరిమితం కాకుండా.. ప్రపంచీకరణ, సరళీకరణ దిశగా ప్రపంచం పయనిస్తున్న తరుణంలో టెక్నికల్/మేనేజ్‌మెంట్ అభ్యర్థులతో సమానంగా లా గ్రాడ్యుయేట్లకు ఎన్నో అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.. ఈ నేపథ్యంలో సంప్రదాయ అవకాశాలతోపాటు ఆధునిక కెరీర్లకు వారధిగా నిలుస్తోన్న లా కోర్సులపై ఫోకస్...

న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాలంటే సంబంధిత లా కోర్సులను ఎంచుకోవాలి. ఇటువంటి కోర్సులు బ్యాచిలర్ స్థాయి నుంచి ప్రారంభమవుతాయి. బ్యాచిలర్ స్థాయిలో కూడా అర్హతలను బట్టి రెండు రకాల కోర్సులు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు. బ్యాచిలర్ తర్వాత ఆసక్తి ఉంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేయవచ్చు. ఇందుకు సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. సివిల్/క్రిమినల్ లా, కాన్‌స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, హ్యూమన్ రైట్స్ లా, ఫ్యామిలీ లా, ట్యాక్సేషన్, కార్పొరేట్ లా, బిజినెస్ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ లా, రియల్ ఎస్టేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/పేటెంట్ లా.

ప్రవేశ పరీక్షలు:
లా కోర్సులను అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందాలంటే ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే రాత పరీక్షలకు హాజరు కావాలి. వివరాలు...
 • లాసెట్: రాష్ట్రంలో న్యాయ విద్యనభ్యసించడానికి వీలు కల్పించే పరీక్ష లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు.
  అర్హత: ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి). మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి.
 • క్లాట్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) ర్యాంక్‌తో హైదరాబాద్‌లోని నల్సార్ సహా 14 ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి లా కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు.
  అర్హత: ఇంటర్మీడియెట్. నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో వెలువడుతుంది.
  పరీక్షా విధానం: ఐదు విభాగాల్లో క్లాట్ నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి-40 మార్కులు), జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ (50 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (20 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 మార్కులు). వీటికి 2 గంటల్లో సమాధానాలను గుర్తించాలి.
  వెబ్‌సైట్: www.clat.ac.in
 • ఏఐఎల్‌ఈటీ: నేషనల్ లా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్)ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు-బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)లో ప్రవేశం పొందొచ్చు.
  అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం.
  పరీక్షా విధానం: మొత్తం ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలకు ఏఐఎల్‌ఈటీ ఉంటుంది. అవి..ఇంగ్లిష్ (35 ప్రశ్నలు); జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (35 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (10 ప్రశ్నలు); లీగల్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (35 ప్రశ్నలు); వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.
  వెబ్‌సైట్: nludelhi.ac.in/
 • ఎస్‌ఈటీ: సింబయాసిస్ లా స్కూల్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఎస్‌ఈటీ (సింబయాసిస్ ఎంట్రన్స్ టెస్ట్).
  అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 45 శాతం) ఇంటర్మీడియెట్/తత్సమానం.
  వెబ్‌సైట్: www.set-test.org
 • ఎల్‌శాట్: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్‌శాట్) స్కోర్ ఆధారంగా దేశంలోని దాదాపు 40పైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. వీటిలో జిందాల్ గ్లోబల్ లా స్కూల్, అమిటీ లా స్కూల్, జోథ్‌పూర్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.
  పరీక్షా విధానం: నాలుగు విభాగాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఎల్‌శాట్ ఉంటుంది. అవి.. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రెహెన్షన్.
  వెబ్‌సైట్:  www.pearsonvueindia.com

కావల్సిన లక్షణాలు
న్యాయవాదిగా కెరీర్‌ను ఎంపిక చేసుకునే వారికి కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఎందుకంటే ఇతర వృత్తులతో పోల్చినప్పుడు తన జ్ఞానాన్ని(నాలెడ్జ్) ప్రభావవంతంగా ప్రదర్శించాలంటే ఆ లక్షణాలు ఉండాల్సిందే. లేకుంటే కెరీర్‌లో రాణించడం అంత సులభం కాదు. ఈ క్రమంలో మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలు..
 • చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్
 • మంచి జ్ఞాపక శక్తి, వేగంగా స్పందించే గుణం
 • నాయకత్వం వహించే గుణం
 • తార్కిక వివేచన, ఓర్పు
 • సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అన్ని రకాల సంఘటనలపై అవగాహన ఉండాలి
 • చక్కగా వినే తత్వం, ప్రసంగించే చాతుర్యం
 • అవుటాఫ్ బాక్స్ థింకింగ్
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్
న్యాయవాద వృత్తి చేపట్టాలకునే అభ్యర్థులు.. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందాక ప్రాక్టీస్‌కు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు ఉన్న పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ నాలెడ్‌‌జను పరీక్షించి.. సదరు అభ్యర్థి వృత్తికి సరిపోతాడా? లేదా? నిర్ణయించడమే ఈ పరీక్ష ఉద్దేశం.
వివరాలకు:  www.barcouncilofindia.org

అవకాశాలు:
ప్రపంచీకరణ, అవుట్ సోర్సింగ్ నేపథ్యంలో.. లా గ్రాడ్యుయేట్లకు వైట్ కాలర్ జాబ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థ ల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నా యి. ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థ లు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లు పీజీ,పీహెచ్ డీ కోర్సులు చేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో చేరొచ్చు.

పభుత్వ రంగంలో:
లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఇవి అధికశాతం న్యాయవాద వృత్తికి సంబంధించినవై ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌స, ఏపీపీఓ, మేజిస్ట్రేట్స్, సబ్-మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాలి. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు..హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకోవచ్చు.

ఎల్‌పీఓ:
‘లా’ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా సరికొత్త వేదిక లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (ఎల్‌పీఓ). ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన న్యాయ సేవా సంస్థలు భారీ సంఖ్యలో (దాదాపు 150 నుంచి 200 వరకు) మన దేశంలో శాఖలను ఏర్పాటు చేస్తూ.. న్యాయ నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆయా దేశాల చట్టాలపై శిక్షణనిచ్చి శాశ్వత హోదా కల్పిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేల వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్లో అసోసియేట్‌గా అడుగుపెట్టి అనుభవం ఆధారంగా రెండు, మూడేళ్ల వ్యవధిలో సీనియర్ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రానున్న ఐదేళ్లలో ఎల్‌పీఓ రంగంలో 30 నుంచి 40 వేల మంది అవసరం ఏర్పడుతుందని అంచనా.

విదేశాల్లో:
విదేశాల్లో లా కోర్సుల విషయానికొస్తే.. బ్రిటన్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే లా కోర్సులు.. మన యూనివర్సిటీలు అందించే లా కోర్సులు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లో లా చదివేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అంతేకాకుండా కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసే వారికి అకర్షణీయమైన పే ప్యాకేజ్‌లు లభిస్తున్నాయి. హార్వర్డ్ లా స్కూల్, యేల్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలను కూడా భారతీయులు ఎక్కువగా లా కోర్సుల కోసం ఎంపిక చేసుకుంటున్నారు. నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు వస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారిలో కనీసం 20 నుంచి 25 శాతం మంది విదేశీ సంస్థల్లో అడుగుపెడుతున్నారు.

వేతనాలు:
ప్రభుత్వ రంగంలో స్థిరపడిన వారికి హోదాను బట్టి నెలకు రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి, తదితర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఏడాదికి రూ. 4 నుంచి 6 లక్షల వరకు పేప్యాకేజ్‌లు అందుతున్నాయి. సొంతంగా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.

‘లా’.. సంప్రదాయ స్థాయి నుంచి కార్పొరేట్ దిశగా
Bavitha ప్రస్తుతం కెరీర్ పరంగా ‘లా’ సంప్రదాయ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంటోంది. ‘లా’ గ్రాడ్యుయేట్లకు గ్లోబలైజేషన్ చక్కని వరంగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బహుళజాతి సంస్థలు అంతర్గతంగా లీగల్ డిపార్ట్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసి వాటిలో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం ప్రముఖ న్యాయ కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సైతం నిర్వహిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు రూ. లక్షల్లో వార్షిక వేతనం పొందుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో చదివితే అవకాశాలకు ఆకాశమే హద్దు. తాజాగా మా యూనివర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో రూ. 5.5 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులు ఎంపికయ్యారు. మరోవైపు జ్యుడీషియరీ విభాగంలోనూ నిరంతరం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. లా కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సామాజిక అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే కోర్సులో రాణించేందుకు వీలవుతుంది. కోర్సులో చేరిన తర్వాత విద్యార్థులు ప్రాక్టికల్ దృక్పథంతో అభ్యసనం చేయాలి. కేవలం పుస్తకాలు, పరీక్షలు, మంచి పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత అనే అంశాలకే పరిమితం కాకుండా రియల్ లైఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. క్లాస్ రూం లెర్నింగ్‌కు పరిమితం కాకుండా స్వీయ పరిజ్ఞానం పెంచుకునే విధంగా వ్యవహరిస్తే సుస్థిర భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. మౌలిక సదుపాయాల లేమి, ఫ్యాకల్టీ కొరత వంటి సమస్యలున్న కళాశాలల్లో సీటు లభించిన విద్యార్థులు తామే స్వయంగా నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకునేందుకు కృషి చేయాలి. రియల్ టైం కేస్ స్టడీస్ విశ్లేషణ, లీగల్ జర్నల్స్ అధ్యయనం వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. ఉన్నత విద్యకు సంబంధించి పీజీలో అన్ని స్పెషలైజేషన్స్‌కు సమ ప్రాధాన్యం ఉంటోంది. అయితే ఎంఎన్‌సీలు, కేపీఓల్లో ఉద్యోగాలు ఆశించే విద్యార్థులకు కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్పెషలైజేషన్స్ అదనపు ప్రయోజనం చేకూర్చుతాయి.
Published date : 12 Jun 2014 03:02PM

Photo Stories