Skip to main content

కెరీర్ గైడెన్స్.. లా

‘‘మాటల గారడీ చేయాలి. ప్రతివాదులను బురిడీ కొట్టించాలి. సంఘంలో పరిచయాలు ఉండాలి. అప్పుడే ‘లా’ పట్టాకు సార్థకత. పైసల సంపాదనకు అవకాశం’’. ‘లా’ డిగ్రీ.. న్యాయవాద వృత్తిపై ఒకప్పటి అభిప్రాయం. కానీ కాలం మారింది. ‘లా’ డిగ్రీ కేవలం న్యాయస్థానాల్లో న్యాయవాద వృత్తికే పరిమితం కావడం లేదు. విస్తృత దృక్పథంతో అన్వేషిస్తే అనేక అవకాశాలకు.. కాంతులీనే కెరీర్‌కు కేరాఫ్‌గా నిలుస్తోంది ‘లా’. ఆ వివరాలు..

అకడెమిక్ స్థాయిలో ఇ‘లా’:
లా (న్యాయశాస్త్రం) కెరీర్‌లో స్థిరపడటానికి రెండు మార్గాలు: అవి..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో ప్రవేశం పొందడం.
ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో అడుగు పెట్టడం.
దేశంలో ప్రతి యూనివర్సిటీలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు అందుబాటులో ఉండగా.. ఐదేళ్ల లా కోర్సును అందిస్తున్న కళాశాలల సంఖ్య పరిమితమనే చెప్పొచ్చు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లలో ఐదేళ్ల కోర్సులో అడుగుపెట్టే అవకాశం ఉంది.

కోర్సు పూర్తిచేశాక న్యాయవాద వృత్తి చేపట్టాలంటే సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాల్సిందే. అంతకంటే ముందు న్యాయవాద వృత్తి చేపట్టాలనుకునే ప్రతి లా గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్’లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.

కోర్సులో కాలుమోపాలంటే:
ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా లా కోర్సులో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రంలో ‘లా సెట్’ ద్వారా ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి/మార్చి నెలలో నోటిఫికేషన్ వెలువడి జూన్‌లో పరీక్ష జరుగుతుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ వయా క్లాట్:
దేశంలో పేరుకుపోతున్న కేసులు.. న్యాయవాదుల కొరత.. డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉండటం.. వంటి సమస్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో 14 నేషనల్ లా యూనివర్సిటీలను నెలకొల్పింది. వీటిలో ఇంటర్మీడియెట్ తత్సమాన అర్హతతో నిర్వహించే ఐదేళ్ల లా కోర్సులు ఉన్నాయి. వీటితోపాటు ఎల్‌ఎల్‌బీ అర్హతతో అవకాశం లభించే పీజీ కోర్సులు కూడా చదవొచ్చు. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో వెలువడుతుంది. ఔత్సాహిక అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో కనీసం 55 శాతం మార్కులు (రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం మార్కులు) తప్పనిసరి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. అంతేకాకుండా కోర్సు ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం జూలై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు(రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులు 22 ఏళ్లు వయసు) మించకూడదు.

లా.. కెరీర్ కళకళ:
ఇక.. లా డిగ్రీ అర్హతగా కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం లా గ్రాడ్యుయేట్లకు కళకళలాడే కెరీర్స్ అందుబాటులో ఉన్నాయనేది నిస్సందేహం. ప్రపంచీకరణ, అవుట్ సోర్సింగ్ నేపథ్యంలో.. లా గ్రాడ్యుయేట్లకు వైట్ కాలర్ జాబ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్ వంటి.. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి. వీరు పీజీ, పీహెచ్‌డీ చేసి వృత్తిలో చేరొచ్చు.

ప్రభుత్వ రంగంలోనూ పలు అవకాశాలు:
లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగలోనూ కొలువులకు కొదవ లేదని చెప్పొచ్చు. ఇవి అధికశాతం న్యాయవాద వృత్తికి సంబంధించినవై ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌స, ఏపీపీఓ, మెజిస్ట్రేట్స్, సబ్-మెజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు.. హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకోవచ్చు.

ఎల్‌పీఓ.. న్యూ ఎవెన్యూ:
‘లా’ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా సరికొత్త వేదిక లీగల్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ (ఎల్‌పీఓ). ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన న్యాయ సేవా సంస్థలు భారీ సంఖ్యలో (దాదాపు 150 నుంచి 200 వరకు) మన దేశంలో శాఖలను ఏర్పాటు చేస్తూ.. న్యాయ నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆయా దేశాల చట్టాలపై శిక్షణనిచ్చి పర్మినెంట్ హోదా కల్పిస్తున్నాయి.
ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేల వేతనం అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్లో అసోసియేట్‌గా అడుగుపెట్టి అనుభవం ఆధారంగా రెండు, మూడేళ్ల వ్యవధిలో సీనియర్ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రానున్న ఐదేళ్లలో ఎల్‌పీఓ రంగంలో 30 నుంచి 40 వేల మంది అవసరం ఏర్పడుతుందని.. లా గ్రాడ్యుయేట్లకు ఎల్‌పీఓ ఓ బంగారు వేదికవుతుందని ఓ అంచనా.

విదేశాల్లోనూ అవకాశాలు:
లా గ్రాడ్యుయేట్లకు విదేశీ అవకాశాలూ లభిస్తున్నాయి. మన చట్టాలతో సరిపోలే బ్రిటన్‌లో అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు వస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారిలో కనీసం 20 నుంచి 25 శాతం మంది విదేశీ సంస్థల్లో అడుగుపెడుతున్నారనేది మరో నిదర్శనం.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్.. ప్రాక్టీస్ చేయాలంటే తప్పనిసరి:
న్యాయవాద వృత్తి చేపట్టాలకునే అభ్యర్థులు.. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందాక ప్రాక్టీస్‌కు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు ఉన్న పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ నాలెడ్‌‌జను పరీక్షించి.. సదరు అభ్యర్థి వృత్తికి సరిపడతాడా? లేదా? నిర్ణయించడమే ఈ పరీక్ష ఉద్దేశం.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. 2010లో శ్రీకారం చుట్టిన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ప్రతి ఏటా రెండు సార్లు (జూన్/జూలై, నవంబర్/డిసెంబర్) జరుగుతుంది. తెలుగు సహా మొత్తం 9 భాషల్లో (హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, ఇంగ్లిష్)లలో నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వివరాలు..

పరీక్ష మూడున్నర గంటల వ్యవధిలో రెండు కేటగిరీ (కేటగిరీ-1, కేటగిరీ-2)ల్లో పార్ట్ -1, పార్ట్ ‌‌-2 పద్ధతిలో జరుగుతుంది.

కేటగిరీ-1లో 11 సబ్జెక్ట్‌లు, కేటగిరీ-2లో 9 సబ్జెక్ట్‌లు మొత్తం 20 సబ్జెక్ట్‌లలో ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవన్నీ న్యాయసంబంధమైనవి. ఎల్‌ఎల్‌బీలో చదివినవే.

మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో వంద మార్కులకు నిర్వహించే పరీక్షలో కేటగిరీ-1లో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏడు ప్రశ్నలు చొప్పున 77 ప్రశ్నలు అడుగుతారు. కేటగిరీ-2లో 9 సబ్జెక్ట్‌ల నుంచి 23 ప్రశ్నలు అడుగుతారు.
కేటగిరీ -1లో ప్రతి సబ్జెక్ట్ నుంచి అడిగే ఏడు ప్రశ్నలు రెండు విభాగాలు (ఎ, బి)గా ఉంటాయి.

ఎ విభాగం ప్రశ్నలు యాక్ట్స్-ఫ్యాక్ట్ బేస్డ్‌గా; బి విభాగం ప్రశ్నలు కేస్‌స్టడీ లేదా నిర్దిష్ట వివాదంపై ఉంటాయి.
కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.

ఉత్తీర్ణులకు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ జారీ చేస్తారు. అప్పుడు మాత్రమే వృత్తి చేపట్టేందుకు అర్హత లభిస్తుంది.

ఉత్తీర్ణత సాధించే వరకు ఎన్నిసార్లయినా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావచ్చు.
వెబ్‌సైట్: www.barcouncilofindia.org

నేషనల్ లా యూనివర్సిటీల వివరాలు:
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా - హైదరాబాద్
ద నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ - భోపాల్
ద వెస్ట్‌బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్- కోల్‌కత
నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్‌పూర్
హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ - రాయ్‌పూర్
గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ - గాంధీనగర్
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ - లక్నో
ఆర్‌ఎన్‌ఎల్‌యు ఆఫ్ లా- పాటియాలా
చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ- పాట్నా
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్‌‌స్డ లీగల్ స్టడీస్- కొచి
నేషనల్ లా యూనివర్సిటీ - ఒడిశా
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా - రాంచీ
నేషనల్ యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడెమీ - అసోం

మన రాష్ర్టంలో ప్రత్యేక ‘లా’ యూనివర్సిటీ:
న్యాయవాద వృత్తి నిపుణుల కొరత నేపథ్యంలో దాన్ని తీర్చేందుకు మన రాష్ట్రంలోనూ విశాఖపట్నంలో ప్రత్యేకంగా లా యూనివర్సిటీ ఏర్పాటైంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ర్ట ప్రభుత్వ చట్టం ద్వారా ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ‘దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా)’కి కడప, నిజామాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ అయిదు స్థాయిలలో డిగ్రీ కోర్సులను అందిస్తోంది. వివరాలు..

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆన‌ర్స్)
ప్రవేశం: క్లాట్ ర్యాంకు ఆధారంగా.

నాలుగేళ్ల ఎల్‌ఎల్‌బీ ఎల్‌ఎల్‌ఎం డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాం
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (మారిటైం లా స్పెషలైజేషన్)
ప్రవేశం: యూనివర్సిటీ ఎంట్రెన్స్. అర్హత: ఎల్‌ఎల్‌బీ

వీటికోసం ప్రతి ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వెబ్‌సైట్: www.apulvisakha.org/
Published date : 31 Dec 2012 03:33PM

Photo Stories