Skip to main content

ఇంటర్నేషనల్ బిజినెస్ లా..

ప్రపంచీకరణ నేపథ్యంలో ఉత్పత్తి, సేవలు, పెట్టుబడులు వంటి అంశాలు అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలుగా మారాయి. వీటి విషయంలో తలెత్తే వివాదాల పరిష్కారంలో ‘ఇంటర్నేషనల్ బిజినెస్ లా’ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయా కోర్సులు చదివిన వారికి ఆకర్షణీయ వేతనాలతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఇంటర్నేషనల్ బిజినెస్ లా కోర్సు.. అర్హతలు.. విద్యా సంస్థలు.. ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
కోర్సు స్వరూపం
ఈ కోర్సులో ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపార నిబంధనలు, పద్ధతులు, అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో తలెత్తే వివాదాలను ఏ దృక్పథంతో చూడాలి వంటి అంశాలు ఉంటాయి. వీటితోపాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, దివాళా చట్టాలు, పన్నుల విధానం, గ్లోబల్ ఇన్వెస్టింగ్, సెక్యూరిటీస్, హ్యూమన్ రైట్స్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, కాంపిటీషన్ లా, బిజినెస్ లా, కార్పొరేట్ గవర్నెన్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వంటి అంశాలను కూడా అధ్యయనం చేస్తారు.

ప్రాధాన్యత ఏంటి?
సాధారణంగా చట్టాలు, న్యాయ సూత్రాలు దేశస్థాయిలో లేదా సంబంధిత జ్యురిస్‌డిక్షన్ పరిధిలో అమల్లో ఉంటాయి. ఆయా దేశాలు వాటికి ఉండే సార్వభౌమత్వ హక్కుతో చట్టాలను రూపొందించుకుంటాయి. దీంతో సహజంగా పక్క దేశాలతో పోల్చినప్పుడు ఆయా దేశాల్లోని చట్టాల్లో అనేక వ్యత్యాసాలు కన్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వివిధ దేశాలకు చెందిన వ్యాపార భాగస్వాముల మధ్య వస్తువుల అమ్మకం, కొనుగోలు; సేవలు పొందడం-సేవలు అందించడం వంటి అంశాల్లో అనేక ఒప్పందాలు కుదురుతుంటాయి. ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక చట్టాలంటూ లేవు. ఒకవేళ రెండు దేశాల భాగస్వాములు తమ మధ్య వివాదాలు తలెత్తితే ఏ దేశ చట్టాల ఆధారంగా వాటిని పరిష్కరించుకోవాలి? దీనికి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు ఇంటర్నేషనల్ బిజినెస్ లా మాత్రమే పరిష్కారం చూపించగలదు.

‘కీ’ పాయింట్స్ టు కెరీర్ గ్రోత్
  • ఇంటర్నేషనల్ బిజినెస్ లా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో జరిగే సాధారణ వ్యాపార లావాదేవీలను అర్థం చేసుకునేందుకు తప్పనిసరిగా ‘ఇంగ్లిష్ లాస్‌‘ను అధ్యయనం చేయాలి. ఇందులో భాగంగా అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలతోపాటు బీమా సంబంధిత ఒప్పందాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.
  • ప్రపంచ వాణిజ్య రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆయా దేశాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో పరిశీలిస్తూ ఉండాలి.
  • దేశాలు, ప్రాంతీయ స్థాయిల్లో వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న సంస్థల పట్ల అవగాహన కెరీర్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుందని గమనించాలి.

ఉద్యోగావకాశాలు..
బిజినెస్ లా గ్రాడ్యుయేట్లకు ప్రపంచవ్యాప్తంగా..వివిధ ఎంఎన్‌సీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్యాక్స్ కన్సల్టెంట్, నాన్ ప్రాఫిట్-ఎగ్జిక్యూటివ్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆఫీసర్ తదితర హోదాల్లో పనిచేయొచ్చు.

కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
  • నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్
    ఇంటర్నేషనల్ ట్రేడ్ లా స్పెషలైజేషన్‌తో పీజీ డిగ్రీ కోర్సును అందిస్తోంది.
    వివరాలకు: www.nalsar.ac.in

  • ది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా (ఐఎస్‌ఐఎల్)
    ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లా స్పెషలైజేషన్‌తో ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: డిగ్రీ ఇన్ లా/ కామర్స్/ బిజినెస్ మేనేజ్‌మెంట్
    వివరాలకు: www.isilaca.org

  • యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా
    బిజినెస్ లా స్పెషలైజేషన్‌తో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సును అందిస్తోంది.
    వివరాలకు: www.mu.ac.in

  • నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్
    ఇంటర్నేషనల్ ట్రేడ్ లా స్పెషలైజేషన్‌తో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
    వివరాలకు: www.nlujodhpur.ac.in

సాధారణ లా కోర్సులతో పోల్చితే.. ‘ఇంటర్నేషనల్ బిజినెస్ లా’ భిన్నమైంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారు.. ప్రపంచ వ్యాపార దృక్పథాన్ని విశ్లేషించడంతోపాటు దానికి అవసరమైన న్యాయ సేవలు అందిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కోర్సులు చదివినవారికి మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఉజ్వల అవకాశాలు అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే వివిధ వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్నేషనల్ బిజినెస్ లా స్పెషలైజేషన్లతో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.
- ప్రొ॥వి. బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్ విశ్వవిద్యాలయం
Published date : 05 Jul 2016 03:08PM

Photo Stories