Skip to main content

ర్యాంప్‌పై కాంతులీనే కెరీర్‌కు.. మోడలింగ్ అప్‌కమింగ్ కెరీర్

ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, కత్రినా కైఫ్, లారా దత్తా, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్... వెండితెరపై దేదీప్యమానంగా వెలిగిపోతున్న తారలు. కానీ, ఒకప్పుడు మోడలింగ్ రంగంలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నవారే. మోడల్స్‌గా కెరీర్‌ను ప్రారంభించివారు టీవీ, సినిమాల్లో అగ్రతారలుగా మారిపోతున్నారు. దేశవిదేశాల్లో మంచి గుర్తింపు, అధిక ఆదాయం, లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అందుకే నేటి యువత దృష్టిలో మోస్ట్ గ్లామరస్ కెరీర్.. మోడలింగ్. మార్కెటింగ్ యుగంలో మోడలింగ్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకొని, కష్టపడి పనిచేస్తే అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అవకాశాలు ఎన్నెన్నో...
టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతి వస్తువుకు ప్రచారం చేసిపెట్టడానికి మోడళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఇక ప్రసార మాధ్యమాల వ్యాప్తితో వీరికి డిమాండ్ భారీగా పెరిగింది. నగరాల్లో తరచుగా ఏదోఒక చోట ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉంటాయి. కార్పొరేట్ సంస్థల సదస్సుల్లో క్యాట్‌వాక్‌లు సర్వసాధారణమయ్యాయి. అందమైన శరీర సౌష్టవం, ఆకట్టుకొనే రూపం కలిగిన మోడల్స్ ర్యాంప్‌పై పిల్లి నడకలతో ఆహూతులను అలరిస్తున్నారు. అదేసమయంలో సంస్థల ఉత్పత్తులకు తగినంత ప్రచారం కల్పిస్తున్నారు. ఇక టీవీ చానళ్లలో వాణిజ్య ప్రకటనలు లేని కార్యక్రమాలే కనిపించడం లేదు. మోడలింగ్ రంగంలో రాణించినవారికి ఇలాంటి ప్రకటనల్లో నటించే అవకాశం కలుగుతోంది. టీవీలో గుర్తింపు పొందిన మోడళ్ల తర్వాతి అడుగు వెండితెరవైపే ఉంటోంది.

ఎత్తు అడ్డంకి కాదు
జాతీయ, అంతర్జాతీయ అందాల పోటీల్లో నెగ్గి, వజ్రాల కిరీటాలను సగర్వంగా ధరించిన మోడల్స్ ఎందరో ఉన్నారు. వార్తా పత్రికలు, మేగజైన్లలో వచ్చే అడ్వర్‌టైజ్‌మెంట్లలోనూ మోడళ్ల హొయలు కనిపించాల్సిందే. అంటే అవకాశాలకు కొదవే లేదని చెప్పొచ్చు. మోడల్‌గా మారాలంటే ఇప్పుడు ఎత్తు అడ్డంకి కాదని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు ఆరు అడుగులకు పైగా ఉన్నవారే ఇందులో కనిపించేవారు. ఇటీవలి కాలంలో ఐదు అడుగులు ఉన్నవారికి కూడా అవకాశాలు లభిస్తున్నాయి. తీర్చిదిద్దినట్లుగా శరీర సౌష్టవం, ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు ఉన్నవారు ఇందులో రాణించొచ్చు. మోడలింగ్‌లో ఆడ, మగ భేదం లేదు. ఎవరి అవకాశాలు వారికి ఉంటున్నాయి. ఈ రంగంలో అనుభవం సంపాదించి, సొంతంగా మోడలింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు.

కావాల్సిన స్కిల్స్: మోడల్స్‌కు ప్రధానంగా కావాల్సిన లక్షణం.. బిడియాన్ని వదిలేయడం. సందర్భానికి తగిన దుస్తులు ధరించడానికి సిద్ధపడాలి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిత్యం వ్యాయామంతో శరీర బరువును నియంత్రించుకోవాలి. ఒక కిలో బరువు పెరిగినా అవకాశాలు దెబ్బతింటాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవాలి. మేకప్, కెమెరా, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. పగలు, రాత్రి.. ఏ సమయంలోనైనా పనిచేయగలగాలి.

అర్హతలు: మోడలింగ్ రంగంలో కాలు మోపేందుకు ప్రత్యేకంగా విద్యార్హతలంటూ లేవు. అయినా కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. తగిన అర్హతలుండి మోడల్‌గా మారాలనుకునేవారు మొదట ఏదైనా మోడలింగ్ ఏజెన్సీ లేదా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించి, ఆకర్షణీయమైన ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. ఇందుకు రూ.20 వేలకు పైగానే ఖర్చవుతుంది. ఈ పోర్ట్‌ఫోలియోను సాధ్యమైనన్ని ఎక్కువ మోడలింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థలకు పంపించాలి. అవసరాన్ని బట్టి ఆయా సంస్థల నుంచి అవకాశాలు వస్తాయి. మొదట చిన్నపాటి ఫ్యాషన్ వీక్ ఆడిషన్లు, ర్యాంప్ షోలలో పాల్గొనొచ్చు. ఒకసారి గుర్తింపు(బ్రేక్) వస్తే ప్రొఫెషనల్ మోడల్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు. కష్టపడితే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కొన్ని మోడలింగ్ ఏజెన్సీలు ఔత్సాహికులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాయి.

వేతనాలు: మోడళ్లకు డిమాండ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. ప్రారంభంలో ఒక్కో కార్యక్రమానికి రూ.4 వేల నుంచి రూ.6 వేలు అందుకోవచ్చు. మూడు నాలుగేళ్ల అనుభవం సంపాదిస్తే ఒక్కో షో/షూట్‌కు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పొందొచ్చు. టీవీలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే ఒక రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

మోడలింగ్ శిక్షణ ఇస్తున్న సంస్థలు:
  • లఖోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.lakhotiainstituteofdesign.com
  • గ్లిట్జ్ మోడలింగ్-ఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.glitzmodelling.in
  • ద ఎలైట్ స్కూల్
    వెబ్‌సైట్:
    elitemodelschoolindia.com/
  • ద మెహర్ భాసిన్ అకాడమీ
    వెబ్‌సైట్:
    meharbhasin.com/
మోడలింగ్‌తో కలర్‌ఫుల్ లైఫ్
‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకునే యువత తమ కెరీర్ కూడా వైవిధ్యభరితంగా మలచుకుంటున్నారు. ఇదే కోవలోని కెరీర్.. మోడలింగ్. నగర ర్యాంప్‌లపై నడక ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుతం నగరంలో మోడల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఫ్యాషన్ షోల కోసం గతంలో ముంబై, కోల్‌కతా నుంచి మోడల్స్‌ను రప్పించేవారు. కానీ ప్రస్తుతం ఇక్కడే మోడలింగ్, ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు కావడంతో మనవాళ్లే బయటకెళ్లి ప్రదర్శనలిస్తున్నారు. క్యాట్ వాక్‌లతో కెరీర్‌ను ప్రారంభించిన ఎందరో మోడల్స్ వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, సీరియల్స్, సినిమాలలో అవకాశం దక్కించుకున్నారు’’
శ్రావణ్‌కుమార్, మోడల్ డిజైనర్
Published date : 09 Oct 2014 11:20AM

Photo Stories