Skip to main content

‘కళాత్మక’ కెరీర్

ఇంటర్ పూర్తికాగానే.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. తదితర లక్ష్యాలను చేరుకునే దిశగా చాలామంది అడుగులేస్తారు! కోర్సు పూర్తయింది తడవు.. రూ.లక్షల ప్యాకేజీలతో కొలువులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొంత మంది తమకు ఆసక్తి ఉన్న అంశాన్ని భవిష్యత్ కెరీర్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. అభిరుచే పెట్టుబడిగా.. సృజనాత్మకతే గీటురాయిగా.. క్రియేటివ్ కోర్సుల వైపు కాలు కదుపుతున్నారు. ఈ క్రమంలో కళాత్మక కెరీర్స్, కోర్సులు, ఉపాధి అవకాశాలపై విశ్లేషణాత్మక కథనం...
క్లాసికల్ డ్యాన్స్
కూచిపూడి, భరత నాట్యం, కథాకళి, కథక్, మణిపురి.. ఇలా ఎన్నో సంప్రదాయ నృత్యాలకు భారతదేశం పుట్టినిల్లు. శాస్త్రీయంగా చూస్తే ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నృత్యాలున్నాయి. లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధంగా కదలడమే నాట్యం/నృత్యం. సమాజంలో నాట్యంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

కోర్సులు
డ్యాన్స్‌కు సంబంధించి ఆయా విభాగాల్లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ), మాస్టర్స్ డిగ్రీ (రెండేళ్లు), పీహెచ్‌డీ, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీఏలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత డ్యాన్స్‌లో ప్రవేశం ఉన్నట్లు ఏదైనా సర్టిఫికెట్ ఉండాలి. మాస్టర్స్ కోర్సులో ప్రవేశానికి ఎంపీఏ చదివి ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు
నిరంతరం నేర్చుకునే తత్వం ఉండాలి. భావాలను చక్కగా ప్రదర్శించగలగాలి. సంగీతం, నట్టువాంగం తదితరాలపై అవగాహన ఉండాలి.

ఉపాధి అవకాశాలు
క్లాసికల్ డ్యాన్లర్లకు అవకాశాలకు కొదవలేదు. ప్రస్తుతం చాలా స్కూళ్లు డ్యాన్స్ టీచర్లను నియమించుకుంటున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటివద్ద సొంతంగా డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దూరదర్శన్ ప్రత్యేకంగా ఆడిషన్లు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది. పీహెచ్‌డీ పూర్తిచేసిన వారు వర్సిటీల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

వేతనాలు
క్లాసికల్ డ్యాన్సర్లకు స్కూళ్లలో ప్రారంభంలో కనీసం రూ.15 వేలు వేతనం లభిస్తుంది. విడిగా ఒక్కో ప్రదర్శనకు కనీసం రూ.3 వేలు చెల్లిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలకు పెద్ద మొత్తంలో అందుకోవచ్చు.

విస్తృత అవకాశాలు
క్లాసికల్ డ్యాన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రస్తుతం భారీగా అవకాశాలున్నాయి. ఎంపీఏ డ్యాన్స్ కోర్సులో విద్యార్థులకు సంగీతం, నట్టువాంగం, పాటలు పాడటం, భామాకలాపం, దరువులు, సొంతంగా కొరియోగ్రఫీ చేయడం వంటివి నేర్పిస్తాం. దీనివల్ల వారు ఇంటివద్దే స్కూల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం చాలా స్కూళ్లు వీరిని నియమించుకుంటున్నాయి. ఆయా జోన్ల కల్చరల్ సెంటర్లలో దరఖాస్తు చేసుకుని ప్రదర్శనలు ఇవ్వొచ్చు.
- వనజ ఉదయ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, డ్యాన్స్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

శిల్పం
శిల్పకళ (స్కల్ప్చర్) కూడా అతి ప్రాచీనమైంది. ఎలాంటి ఆకారం, విలువ లేని సామగ్రికి శిల్పకారుడు అపురూపమైన రూపం ఇచ్చి జీవం పోస్తాడు. స్కల్ప్చర్ కూడా యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది.

కోర్సులు
నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ), రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎఫ్‌ఏలో ప్రవేశానికి ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. మాస్టర్స్ డిగ్రీలో ప్రవేశానికి బీఎఫ్‌ఏ ఉండాలి.

రకరకాల సామగ్రితో.. ఒకప్పుడు చాలావరకు శిల్పాలను రాళ్ల నుంచే తయారుచేసేవారు. ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, చెక్క, లోహాలు, బంకమన్ను, వైర్లు, ప్లాస్టిక్, ఐస్, ఇసుక... ఇలా వేర్వేరు సామగ్రితో రూపొందిస్తున్నారు. కొన్ని రకాల శిల్పాలను ఒకటికన్నా ఎక్కువ సామగ్రితో కూడా తయారుచేస్తారు. ఇవే కాకుండా వాడిపడేసిన, ప్రకృతి సిద్ధంగా లభించే, దొరికిన వస్తువులతో కూడా ఆధునిక శిల్పకారులు శిల్పాలను రూపొందిస్తున్నారు. కైనటిక్, మూవింగ్ శిల్పాలు కూడా ప్రస్తుతం రూపొందుతున్నాయి.

కావాల్సిన స్కిల్స్
ప్రధానంగా చక్కటి పరిశీలనా నైపుణ్యం ఉండాలి. భావోద్వేగాలు, ఆలోచనలకు సమర్థ రూపం ఇవ్వగలగాలి. సౌందర్య తత్వశాస్త్రాన్ని అన్వయించగలగాలి. బృందంగా, వ్యక్తిగతంగా పనిచేయగల నేర్పు ఉండాలి.

ఉపాధి అవకాశాలు
సాధారణంగా చాలామంది శిల్పకారులు తమ ఇళ్లవద్దే శిల్పాలు రూపొందిస్తుంటారు. కొందరు శిల్పకారులకు ప్రత్యేకంగా హోం స్టూడియోలు కూడా ఉన్నాయి. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, వ్యక్తులకు వీరు శిల్పాలు చేస్తుంటారు. ప్రధానంగా స్మారక శిల్పాలు, ఇతర విగ్రహాలు రూపొందిస్తుంటారు. తమ శిల్పాలను ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచి విక్రయించొచ్చు.

సొంతంగా ఉపాధి
సృజనాత్మకత, అంకితభావం, పట్టుదల, సహనం ఉంటే స్కల్ప్చర్ కోర్సు పూర్తిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరు సొంతంగా ఉపాధి పొందొచ్చు. అలాగే తమ శిల్పాలను ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శనకు ఉంచి విక్రయించొచ్చు. ముఖ్యంగా స్కల్ప్చర్ విద్యార్థులు ప్రపంచంలో ఈ విభాగంలో వస్తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
- శాంతి స్వరూపిణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, స్కల్ప్చర్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ

చిత్రలేఖనం
చిత్రలేఖనం (పెయింటింగ్) అతి పురాతన కళ. ప్రకృతి అందాలను తన మనసులో నిక్షిప్తం చేసుకుని, సృజనాత్మకతను జోడించి కుంచెతో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు చిత్రకారుడు. ప్రస్తుతం సమాజంలో కళాభిలాష పెరిగిన నేపథ్యంలో పెయింటింగ్ యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది.

ఎన్నో రకాలు
పెయింటింగ్‌లో ఆయిల్ పెయింట్, వాటర్ కలర్ పెయింట్, ఆక్రిలిక్ పెయింట్, టెంపెరా పెయింట్ ముఖ్యమైనవి. సంప్రదాయ క్లాత్ కాన్వాస్, పేపర్ కాన్వాస్‌తో పాటు చెక్క, రాళ్లు ఇతర సామగ్రిపై కూడా చిత్రాలను చిత్రిస్తున్నారు. మీనియేచర్ చిత్రకళ కూడా ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ధి చెందుతోంది. కొందరు ఆధునిక చిత్రకారులు మొత్తం భవనాలను తమ కాన్వాసులుగా మార్చుకుంటున్నారు. వీరిని కుడ్య చిత్రకారులుగా పిలుస్తారు.

కోర్సులు
పెయింటింగ్‌కు సంబంధించి నాలుగేళ్ల బీఎఫ్‌ఏ, రెండేళ్ల మాస్టర్స్ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పెయింటింగ్‌లో వస్తున్న కొత్త పద్ధతులను తెలుసుకోవడంతోపాటు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ఇవి తోడ్పడతాయి. బీఎఫ్‌ఏ కోర్సులో ప్రవేశానికి ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణత, మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి బీఎఫ్‌ఏ చదివి ఉండాలి.

ఉపాధి అవకాశాలు
పెయింటింగ్ కోర్సులు పూర్తిచేసినవారు టీచింగ్, యానిమేషన్ స్టూడియోస్, సినిమా రంగంలో ఉపాధి పొందొచ్చు. ఆసక్తి ఉన్నవారు కార్టూనిస్టుగా కూడా పనిచేయొచ్చు. ప్రస్తుతం అన్ని స్కూళ్లు డ్రాయింగ్ టీచర్లను నియమించుకుంటున్నాయి. మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు వర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టులు సాధించొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫ్రీలాన్సర్‌గా కూడా పనిచేయొచ్చు. చాలా కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహికులు తమ భవనాల్లో కుడ్య చిత్రాలు వేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిద్వారా మంచి ఆదాయం వస్తుంది. తమ చిత్రాలను ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచి విక్రయించొచ్చు. హైదరాబాద్‌లో ఇన్‌స్పైర్, ఐకాన్, కళాకృతి, అలంకృతి, ఆకృతి, సృష్టి, కళాశ్రీ, న్యూ విజన్ తదితర ఆర్ట్ గ్యాలరీలున్నాయి.

వేతనాలు
పేరున్న చిత్రకారుల ఆర్జన భారీగానే ఉంటుంది. అంతర్జాతీయంగా పేరు పొందితే మంచి డిమాండ్ ఉంటుంది. ప్రముఖ స్కూళ్లలో డ్రాయింగ్ మాస్టర్లకు ప్రారంభంలో రూ.15 వేల నుంచి వేతనం లభిస్తోంది.

నిరంతర సాధన ముఖ్యం..
కళాకారులకు కష్టపడేతత్వం, సహనం చాలా ముఖ్యం. కోర్సు పూర్తయ్యాక కూడా నిరంతరం సాధన చేయడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. తమకంటూ ప్రత్యేక స్టైల్‌ను సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోర్సులు చేయడం ద్వారా క్రియేటివిటీకి పదును పెట్టుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో మమేకం అవడం వల్ల ప్రపంచ పెయింటింగ్ పోకడలపై అవగాహన పెరుగుతుంది.
- కె.శ్రీనివాసాచారి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్- స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

కొరియోగ్రఫీ
మ్యూజిక్‌కి అనుగుణంగా వివిధ రకాల స్టెప్పులు, కదలికలను మిళితం చేయడమే కొరియోగ్రఫీ. సినిమాల్లో తమ అభిమాన హీరోలు వేసే స్టెప్పులకు యువత ఫిదా అయిపోతుంటుంది. ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమైన కొరియోగ్రఫీ ఇప్పుడు యువతకు మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్లు తొలుత డ్యాన్సర్లుగా తమ కెరీర్‌ను ప్రారంభిస్తారు. కొంత అనుభవంతో కొరియోగ్రాఫర్లుగా ఎదుగుతారు. సాధారణంగా కొరియోగ్రాఫర్లు సంప్రదాయ నృత్యం, క్లాసికల్ బాలెట్, మోడ్రన్ డ్యాన్స్, హిప్‌హాప్, జాజ్, ఫోక్.. ఇలా రకరకాల డ్యాన్సుల్లో నైపుణ్యం సాధిస్తారు. సినిమా పరిభాషలో చెప్పాలంటే.. కొరియోగ్రాఫర్లు వీటన్నింటినీ మిళితం చేసి కొత్త స్టెప్పులను సృష్టిస్తారు. డ్యాన్స్ మూమెంట్ కూర్పు, డ్యాన్స్ డెరైక్షన్‌కు కొరియోగ్రాఫర్ బాధ్యత వహిస్తారు.

కోర్సులు
చాలామంది కొరియోగ్రాఫర్లు ఏదో ఒక క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉంటారు. ఇందులో భాగంగా కూచిపూడి, కథక్.. ఇలా ఏదో ఒక డ్యాన్స్‌లో డిగ్రీ చేస్తుంటారు. అయితే క్లాసికల్ డ్యాన్స్‌కు ఆధునిక హంగులు అద్దగలిగే నేర్పు ఉంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణింపు సాధ్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో క్లాసికల్ డ్యాన్స్‌కు సంబంధించి కూడా కొరియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్‌తో సంబంధం లేకుండా నగరాలు, పట్టణాల్లో చాలా ప్రైవేటు డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్లు డ్యాన్స్ కోచింగ్ ఇస్తున్నాయి. ప్రముఖ డ్యాన్సర్లు సొంతంగా స్కూళ్లు నడుపుతున్నారు.

ఉపాధి అవకాశాలు
ప్రస్తుతం చాలా టీవీ చానళ్లలో రియాలిటీ డ్యాన్స్‌షోలు వస్తున్న నేపథ్యంలో కొరియోగ్రాఫర్లకు అవకాశాలు పెరిగాయి. మంచి కొరియోగ్రాఫర్లకు సినిమాల్లో సైతం అవకాశాలకు కొదవలేదు. ఆడియో, సినీ అవార్డు ఫంక్షన్లు, ఏదైనా సంస్థల ప్రారంభ కార్యక్రమాలు, యాన్యువల్, ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు.. ఇలా అన్నింటిలో ప్రస్తుతం నృత్య ప్రదర్శనలు ఉంటున్నాయి. వీటికి కూడా కొరియోగ్రాఫర్ల అవసరం ఉంటుంది. స్టేజ్ షో కంపెనీలు, వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీలు, మోడలింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు, టెలివిజన్, ఫిలిం స్టుడియోలు, డ్యాన్స్ స్కూళ్లలో వీరికి ఉపాధి అవకాశాలుంటాయి. సొంతంగా డ్యాన్స్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్నవారికి మంచి ఆదాయం లభిస్తోంది.

వేతనాలు
ప్రారంభంలో రూ.10 వేలు-రూ.15 వేల వరకు వేతనాలుంటాయి. పేరుగడించిన కొరియోగ్రాఫర్లు ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆర్జించవచ్చు. ప్రస్తుతం స్టేజ్ షోలు పెరిగిన నేపథ్యంలో గంటల విధానంలో కూడా వేతనాలు అందిస్తున్నారు. గంటకు రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల వరకు అందుకోవచ్చు. కొన్ని స్టేజ్‌షోలలో ఒక్కో ప్రదర్శనకు రూ.10 వేల నుంచి చెల్లిస్తున్నారు.

కొన్ని వర్సిటీలు - అందిస్తున్న కోర్సులు
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: ఎంపీఏ - కూచిపూడి/ఆంధ్ర నాట్యం (రెండేళ్లు), డిప్లొమా ఇన్ కూచిపూడి/ఆంధ్రనాట్యం (ఏడాది), పీహెచ్‌డీ ఇన్ డ్యాన్స్, డిప్లొమా ఇన్ సాత్వికాభినయం (ఏడాది), సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కూచిపూడి డ్యాన్స్, కళాప్రవేశిక - కూచిపూడి డ్యాన్స్ (ఏడాది), బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) ఇన్ స్కల్ప్చర్/పెయింటింగ్/ప్రింట్‌మేకింగ్ (నాలుగేళ్లు).
  • జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ
    కోర్సులు:
    బీఎఫ్‌ఏ పెయింటింగ్ (నాలుగేళ్లు), బీఎఫ్‌ఏ స్కల్ప్చర్ (నాలుగేళ్లు), ఎంఎఫ్‌ఏ పెయింటింగ్ (రెండేళ్లు), ఎంఎఫ్‌ఏ స్కల్ప్చర్ (రెండేళ్లు).
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) ఇన్ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్ప్చర్ (రెండేళ్లు), మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) ఇన్ డ్యాన్స్ (రెండేళ్లు), పీహెచ్‌డీ ఇన్ డ్యాన్స్.
  • శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్ హైదరాబాద్ (ఉస్మానియా వర్సిటీ అనుబంధం) బీఎఫ్‌ఏ ఇన్ పెయింటింగ్.
  • బెంగళూరు యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్: మాస్టర్, పీజీ డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్/స్కల్ప్చర్/గ్రాఫిక్ ఆర్ట్స్/ప్రింట్ మేకింగ్ అండ్ న్యూస్ మీడియా (రెండేళ్లు).
  • ఆంధ్రా యూనివర్సిటీ
    కోర్సులు:
    బీఎఫ్‌ఏ (నాలుగేళ్లు), ఎంఎఫ్‌ఏ ఇన్ స్కల్ప్చర్/పెయింటింగ్/ప్రింట్‌మేకింగ్ (రెండేళ్లు), ఎంఏ డ్యాన్స్ (రెండేళ్లు), వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కూచిపూడి నృత్య ప్రవేశిక.
  • ద్రవిడియన్ యూనివర్సిటీ - కుప్పం
    కోర్సు: ఎంఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎంఏ డ్యాన్స్ (రెండేళ్లు), వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కూచిపూడి నృత్య ప్రవేశిక.
  • శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఎంఏ ఇన్ భరత నాట్యం (రెండేళ్లు), సర్టిఫికెట్ కోర్సెస్ ఇన్ భరతనాట్యం, కూచిపూడి.
  • నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీ - బెంగళూరు: కథక్, కాంటెంపరరీ ఇండియన్ డ్యాన్స్ క్లాసెస్ (వారంలో కొన్ని రోజులపాటు నిర్ణీత సమయంలో నేర్పిస్తారు).
Published date : 22 Jul 2016 03:11PM

Photo Stories