Skip to main content

ఆదరణ పెరుగుతున్న కెరీర్.. కార్టోగ్రాఫర్

ఒక ప్రాంత భౌగోళిక పరిస్థితులను, రూపురేఖలను తెలుసుకోవడానికి ఏకైక ఆధారం.. పటాలు(మ్యాప్స్). దేశాల మధ్య సరిహద్దులు, కొండలు, నదులు, సముద్రాలు, మైదానాలు, పీఠభూములు, నగరాలు, పట్టణాలు, పల్లెలు.. ఇలా భూమిపై ఉండే సమస్తాన్ని కళ్లముందుంచేవి పటాలే. మ్యాప్‌ల రూపకర్తలనే కార్టోగ్రాఫర్లు అంటారు. ఆధునిక కాలంలో ఎన్నో రంగాల్లో పటాల అవసరం ఉంటోంది. విదేశాల్లో డిమాండ్ కలిగిన కార్టోగ్రఫీ కెరీర్ ప్రస్తుతం మన దేశంలోనూ క్రమంగా ఆదరణ పొందుతోంది.

అవకాశాలు ఎన్నెన్నో... కార్టోగ్రఫీ కోర్సులను అభ్యసించినవారికి రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ), అగ్రికల్చర్ ఇంజనీరింగ్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, టెలి కమ్యూనికేషన్స్, ఉన్నత విద్య, పరిశోధనా కేంద్రాలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ సంస్థలు, జియోలాజికల్ సర్వే, లాండ్ మేనేజ్‌మెంట్, ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, జాతీయ పార్కులు, ఫారెస్ట్ సర్వీస్, ఐటీ పరిశ్రమ, భూగర్భ గనుల సంస్థలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రవాణా, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సర్వేలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్టోగ్రాఫర్ల భాగస్వామ్యం తప్పనిసరి. కంప్యూటర్/మ్యాథమెటికల్/డిజైన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో సులువుగా రాణించొచ్చు. జియోమాటిక్స్ కన్సల్టెంట్, రీసెర్చ్ ఫెలో, పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జీఐఎస్ అనలిస్ట్/కో-ఆర్డినేటర్, మ్యాపింగ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, జీఐఎస్ సేల్స్ మేనేజర్, ఇంటర్నెట్ ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అప్లికేషన్స్ ప్రోగ్రామర్.. ఇలా వివిధ హోదాల్లో పనిచేయొచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు: కార్టోగ్రాఫర్లు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. ఇందులో శారీరక శ్రమ, ఒత్తిళ్లు అధికం. వీటిని తట్టుకొనేవారే కార్టోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి.

అర్హతలు: భారత్‌లో కార్టోగ్రఫీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పీజీ కూడా పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ అప్లయిడ్ జాగ్రఫీ, ఎంఎస్సీ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్, ఎంటెక్ జియోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ వంటి కోర్సులు చేసినవారు కూడా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు.

వేతనాలు: కార్టోగ్రాఫర్లకు పని చేస్తున్న సంస్థను బట్టి జీతభత్యాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పొందొచ్చు. కనీసం రెండేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఇండియన్ నేషనల్ కార్టోగ్రాఫిక్ అసోసియేషన్
    వెబ్‌సైట్:
      www.incaindia.org
  • మద్రాస్ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
      www.unom.ac.in
  • అన్నామలై యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    annamalaiuniversity.ac.in/
  • జామియా మిలియా ఇస్లామియా-ఢిల్లీ
    వెబ్‌సైట్:
      www.jmi.ac.in
  • ఉత్కళ్ యూనివర్సిటీ-భువనేశ్వర్
    వెబ్‌సైట్:
    utkaluniversity.ac.in/
Published date : 15 Oct 2014 02:34PM

Photo Stories