Skip to main content

NIFT: నిఫ్ట్‌ క్యాంపస్‌ల్లో ప్రవేశాలు.. కోర్సులు, అర్హతలు, పరీక్ష విధానం ఇలా..

National Institute of Fashion Technology
National Institute of Fashion Technology

ఫ్యాషన్‌.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్‌ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు ఉంటే.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి! ఇలాంటి నైపుణ్యాలు అందించే వేదిక.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)!! దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్‌ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్‌ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

  • ఫ్యాషన్‌ కోర్సులకు కేరాఫ్‌గా నిఫ్ట్‌ క్యాంపస్‌లు
  • యూజీ, పీజీ స్థాయిలో డిజైన్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులు
  • జాతీయ స్థాయిలో 17 నిఫ్ట్‌ క్యాంపస్‌ల్లో ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ
  • 2022 సంవత్సరానికి నిఫ్ట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హెయిర్‌ స్టైల్‌ అదిరిపోవాలి. డ్రెస్సింగ్‌ ట్రెండీగా ఉండాలి. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకూడదు. చివరకు కాళ్లకు తొడిగే ఫుట్‌వేర్‌ సైతం వెరైటీగా ఉండాల్సిందే! ఇది నేటి యువత ఫ్యాషన్‌ ధోరణి!! ఇలాంటి ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లో తేవాలంటే..అంత తేలిక కాదు. అందుకు ఫ్యాషన్‌ నిపుణులు అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్‌ అవకాశంగా మారుతోంది. 

చ‌ద‌వండి: Fashion Career: డిజైనింగ్‌ రంగం... కొలువుల త‌రంగం

నిఫ్ట్‌ ప్రత్యేకత

భారత ప్రభుత్వ టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌). ఈ ఇన్‌స్టిట్యూట్‌కు దేశ వ్యాప్తంగా 17క్యాంపస్‌లు ఉన్నాయి. ఫ్యాషన్‌ రంగానికి సంబంధించి డిజైన్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో.. బ్యాచిలర్, మాస్టర్‌ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిఫ్ట్‌ క్యాంపస్‌లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే.. నిఫ్ట్‌–అడ్మిషన్‌ ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 

బ్యాచిలర్‌ స్థాయి డిజైన్‌

  • బ్యాచిలర్‌ స్థాయిలో..బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌; లెదర్‌ డిజైన్‌; యాక్ససరీస్‌ డిజైన్‌; టెక్స్‌టైల్‌ డిజైన్‌; నిట్‌వేర్‌ డిజైన్‌; ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌. 
  • వీటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ

బ్యాచిలర్‌ స్థాయిలోనే.. ఫ్యాషన్‌ విభాగంలో టెక్నికల్‌ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ. ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

పీజీ ప్రోగ్రామ్‌లు

  • పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. 
  • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా నిఫ్ట్‌/నిడ్‌ నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా(కనీసం మూడేళ్లు)ఉత్తీర్ణులు అర్హులు.
  • మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: నిఫ్ట్‌ అందించే బీ.ఎఫ్‌.టెక్‌ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. 
  • పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

చ‌ద‌వండి: ఫ్యాష‌న్ రంగం.. ఉద్యోగాల త‌రంగం

మూడంచెల ఎంపిక ప్రక్రియ

నిఫ్ట్‌–అడ్మిషన్‌ ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. తొలిదశలో క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌(సీఏటీ);జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు.

తొలి దశ జీఏటీ

  • బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ(జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌)ను నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్‌ కోర్సుల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. 
  • బీడిజైన్‌ కోర్సుకు జీఏటీ పేపర్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • ఎండిజైన్‌ కోర్సుకు జీఏటీ పేపర్‌లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ; కమ్యూనికేషన్‌ ఎబిలిటీ; ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌; అనలిటికల్‌ ఎబిలిటీ; జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఫ్యాషన్‌ టెక్నాలజీ.. ప్రత్యేక పరీక్ష

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్‌ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో బీ.ఎఫ్‌.టెక్, ఎం.ఎఫ్‌.టెక్‌లకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి.

రెండో దశ.. సీఏటీ

నిఫ్ట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ(క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్‌ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. 

మూడో దశ.. సిట్యుయేషన్‌ టెస్ట్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా మూడో దశలో నిర్వహించే పరీక్ష.. సిట్యుయేషన్‌ టెస్ట్‌. ఇది పూర్తిగా ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్‌ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని సూచిస్తారు. లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు. 

చివరగా.. జీడీ, పీఐ

నిఫ్ట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), పర్సనల్‌ ఇంటర్వ్యూ(పీఐ)లు నిర్వహిస్తారు. జీడీ ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ, స్పష్టత, ఆలోచన సామర్థ్యాలను పరిశీలిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్‌ కెరీర్‌ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

కోర్సులు–సీట్లు

  • జాతీయ స్థాయిలో మొత్తం 17 నిఫ్ట్‌ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌: 686, లెదర్‌ డిజైన్‌: 168, యాక్ససరీ డిజైన్‌: 600, టెక్స్‌టైల్‌ డిజైన్‌: 646, నిట్‌వేర్‌ డిజైన్‌: 296, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌: 642,బీఎఫ్‌టెక్‌(అపెరల్‌ ప్రొడక్షన్‌): 518, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: 171, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: 650, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ: 140.
  • నిఫ్ట్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు..బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌: 37, యాక్ససరీ డిజైన్‌:37, టెక్స్‌టైల్‌ డిజైన్‌: 37, నిట్‌వేర్‌ డిజైన్‌: 37, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌: 37, బీ.ఎఫ్‌.టెక్‌(అపరెల్‌ ప్రొడక్షన్‌): 37,మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: 37. 
  • అన్ని క్యాంపస్‌లలోనూ ఇక్కడ పేర్కొన్న సీట్లతోపాటు ప్రతి కోర్సులో అయిదు సీట్లను అదనంగా.. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు, సార్క్‌ దేశాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలో ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్.. నిఫ్ట్

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • యూజీ/పీజీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి మొదటి వారం.
  • బ్యాచిలర్‌ కోర్సులకు రాత పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి మొదటి వారం
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nift.ac.in/

విజయం సాధించండిలా

  • నిఫ్ట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్‌ టెస్ట్‌లు.. వాటిలో సెక్షన్లు, సంబంధిత సబ్జెక్ట్‌లలో రాణించడానికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
  • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్,అర్థమెటిక్స్‌ నుంచి ఉంటాయి. వర్క్‌ అండ్‌ టాస్క్, శాతాలు, నిష్పత్తులు,టైమ్‌ అండ్‌ డిస్టెన్స్,టైమ్‌ అండ్‌ వర్క్‌ సంబంధించిన అంశాల్లో పట్టు సాధించాలి.
  • కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌: ఇంగ్లిష్‌ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.అభ్యర్థులు బేసిక్‌ గ్రామర్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన కాన్సెప్ట్‌లు, వాటికి సంబంధించి అప్లికేషన్‌ అప్రోచ్‌తో ప్రాక్టీస్‌ చేయడం అలవర్చుకోవాలి.
  • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్‌ స్థాయి సోషల్‌ స్టడీస్‌ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు–సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి.
  • కేస్‌ స్టడీ: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే కేస్‌ స్టడీ వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి.. దానికి పరిష్కారం అడుగుతారు. దీనిలో రాణించాలంటే.. అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం పెంచుకోవాలి.

ఆసక్తి ప్రధానం

ఫ్యాషన్‌ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్‌ పరిస్థితులు,జీవన శైలి,వ్యక్తుల అభిరుచుల్లో మార్పులు గమనిస్తూ.. ప్రొడక్ట్‌ డిజైన్‌ చేసే దూరదృష్టి అవసరం. ప్రస్తుతం ఫ్యాషన్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఢోకా లేదు.
–ప్రొ.ఎల్‌.మదన్‌ కుమార్‌ రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్, నిఫ్ట్, హైదరాబాద్‌ 

చ‌ద‌వండి: రాత పరీక్ష ఫలితాలొచ్చాయ్‌... నెక్ట్స్‌ ఏంటి?

Published date : 07 Dec 2021 07:16PM

Photo Stories