Skip to main content

రాష్ట్రంలో ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్.. నిఫ్ట్

హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - నిఫ్ట్’. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ సమీపంలోని నిఫ్ట్ క్యాంపస్ కూడా జాతీయ స్థాయిలో సుపరిచితమైన సంస్థ. ఫ్యాషన్ రంగంలో వినూత్న కోర్సుల్లో శిక్షణకు కేరాఫ్ ఈ ఇన్‌స్టిట్యూట్. ఫ్యాషన్ టెక్నాలజీలో యాక్సెసరీస్ డిజైన్ మొదలు నిర్వహణ నైపుణ్యాలు అందించే ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ వరకు పలు కోర్సులను అందిస్తున్న నిఫ్ట్ విశేషాలు...

ఆధునిక ప్రపంచం.. అత్యాధునిక అభిరుచులు.. కాళ్లకు ధరించే షూస్ నుంచి కళ్లజోడు వరకు వినూత్నమైన డిజైన్లను కోరుకుంటున్న వినియోగదారులు. వ్యక్తుల రోజువారీ అవసరాల్లో భాగంగా మారిన అనేక వస్తువుల డిజైనింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో శిక్షణనందిస్తున్న సంస్థ... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్‌గా 1986లో ఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 1995లో ప్రారంభమైన నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీజీ వరకు పలు కోర్సులను అందిస్తూ ఫ్యాషన్ రంగ ఔత్సాహికులకు చక్కటి వేదికగా నిలుస్తోంది. కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేస్తోంది.

City Plus బ్యాచిలర్ టు పీజీ: ప్రస్తుతం నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో.. డిజైన్ విభాగంలో అయిదు కోర్సులు (ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్స్; ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్స్ యాక్సెసరీస్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; నిట్ వేర్ డిజైన్).. టెక్నాలజీ విభాగంలో ఒక కోర్సు( బీటెక్ - అపరెల్ ప్రొడక్షన్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సు వినూత్నమైందిగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగాల్లో రాణించడానికి అవసరమైన స్కిల్స్ అందించే ఈ స్పెషలైజేషన్‌ను పూర్తి చేస్తే డిజైన్ రంగంతోపాటు ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, గ్రాఫిక్ డిజైన్ తదితర కమ్యూనికేషన్ విభాగాల్లోనూ మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. పీజీ స్థాయిలో ఎంబీఏకు తత్సమానమైన మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సు కూడా నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది.

బోధనలో సృజనాత్మకత: ఫ్యాషన్ టెక్నాలజీ అంటే సృజనాత్మకతకు పెద్దపీట వేసే రంగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌లో బోధనలోనూ సృజనాత్మకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులే కొత్త డిజైన్లను ఆవిష్కరించేలా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కల్పించే విధంగా శిక్షణనిస్తున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్-ఫ్యాకల్టీ నిష్పత్తిని 20:1గా నిర్దేశించి ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం: ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో అకడమిక్ శిక్షణ మిగతా కోర్సులతో పోల్చితే భిన్నమైంది. విద్యార్థులు నిరంతరం సృజనాత్మకత, పరిశీలన దృక్పథంతో అడుగులు వేయాలి. కేవలం క్లాస్ రూం, లైబ్రరీ, లేబొరేటరీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా నిఫ్ట్ ప్రాధాన్యమిస్తోంది. నిరంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తోంది.

ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్: నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను కూడా చేపడుతోంది. కేంద్ర చేనేత శాఖ ఆమోదం పొందిన పాలరాతి బొమ్మల రూపకల్పన; సిల్వర్ ఫిల్‌గ్రీ ప్రాజెక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అంతేకాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలకు అవసరమైన లోగో డిజైన్, ఉద్యోగుల యూనిఫాం డిజైన్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టింది. వీటిలో ప్రత్యక్షంగా పాల్పంచుకునేందుకు విద్యార్థులకూ అవకాశం కల్పిస్తోంది.

ప్లేస్‌మెంట్స్ ఖాయం: నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఖాయం. ప్రతి ఏటా నవంబర్ / డిసెంబర్‌లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో అర్‌వింద్ మిల్స్, రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్, స్నాప్ డీల్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పాల్గొంటున్నాయి. లక్షల్లో వార్షిక వేతనాలను అందిస్తున్నాయి. 2013 ప్లేస్‌మెంట్స్‌లో పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థుల్లో అత్యధికంగా రూ.15 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో అత్యధికంగా రూ.9 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని నిఫ్ట్ - హైదరాబాద్ సెంటర్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. సగటున పీజీ బ్యాచ్‌లో రూ.3.69 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో 2.99 లక్షల వార్షిక వేతనం లభించింది. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణులకు ఎన్‌డీటీవీ, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే వంటి మీడియా సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభించాయి.

అత్యాధునిక సదుపాయాలు: టీచింగ్, లెర్నింగ్ కోణంలో నిఫ్ట్-హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో-విజువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లేబొరేటరీ, లైబ్రరీల ద్వారా విద్యార్థులకు నిరంతర అధ్యయన మార్గాలను అందిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలోని అత్యంత ఆదరణ పొందుతున్న డిజైన్‌ల రూపకల్పన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా ఆయా వస్తువులను రిసోర్స్ సెంటర్‌లో అందుబాటులో ఉంచుతోంది.

ప్రవేశానికి మార్గం.. నిఫ్ట్ ఎంట్రెన్స్: నిఫ్ట్ 15 క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిఫ్ట్ ఎంట్రెన్స్ (యూజీ/పీజీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత కౌన్సెలింగ్ విధానంలో క్యాంపస్‌లు, సీట్ల కేటాయింపు ఉంటుంది.
వెబ్‌సైట్: www.nift.ac.in/hyderabad/

సృజనాత్మకత ఉంటే..
‘‘ఫ్యాషన్ రంగంలో అవకాశాలు కోరుకునే వారికి, తగిన సృజనాత్మకత ఉన్న వారికి సరైన వేదిక నిఫ్ట్. హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైన కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ లభించడానికి అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. నగరంలోని విభిన్న జీవన శైలులు గల వ్యక్తులు, అభిరుచులను ప్రత్యక్షంగా వీక్షించి.. తద్వారా తాజా పరిస్థితులకు సరితూగే విధంగా డిజైన్లు రూపొందించే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది’’
ప్రొఫెసర్ ఎన్. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్ - హైదరాబాద్
Published date : 11 Sep 2014 05:34PM

Photo Stories