Skip to main content

UCEED Notification 2022: డిజైనింగ్‌ రంగం... ఆకర్షణీయ కెరీర్‌ మార్గం

చదువంటే ఇంజనీరింగ్‌.. ఉద్యోగమంటే ఐటీనే కాదు.. వీటికి దీటైన చదువులు, కొలువులు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సృజనాత్మకత, తార్కిక ఆలోచనలకు రూపానిచ్చే నైపుణ్యం ఉంటే.. డిజైనింగ్‌ రంగం ఎర్ర తివాచీ పరుస్తోంది. ఆకర్షణీయ కెరీర్‌ మార్గంగా నిలుస్తున్న డిజైనింగ్‌ రంగానికి అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులూ ఉన్నాయి. వాటిని దేశంలోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. వాటిల్లో ప్రవేశానికి వీలు కల్పించే యూసీడ్, సీడ్‌ 2022కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో డిజైనింగ్‌ కోర్సుల ప్రత్యేకత, యూసీడ్, సీడ్‌ పరీక్షల విధానం, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం...
Design Entrance Exam UCEED 2022 Notification
Design Entrance Exam UCEED 2022 Notification

యూసీఈఈడీ

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ సంక్షిప్త రూపమే యూసీడ్‌. ఐఐటీ బాంబే యూజీ స్థాయిలో డిజైనింగ్‌ కోర్సులను అభ్యసించాలనుకునే వారికి జాతీయ స్థాయి లో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువహటి, హైదరాబాద్, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ల్లో.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడీఈఎస్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సుల అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరొచ్చు.
అర్హతలు

  • ఇంటర్మీడియెట్‌/10+2 అన్ని విభాగాల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: అక్టోబర్‌1, 1997 తర్వాత జన్మించి ఉండాలి. కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. యూసీడ్‌ స్కోర్‌ ఒక్క సంవత్సరం మాత్రమే పరిగణనలో ఉంటుంది. 

ప్రవేశ పరీక్ష

ఈ పరీక్ష పార్ట్‌ ఏ– 240 మార్కులు, పార్ట్‌ బీ –60 మార్కులకు.. రెండు పార్ట్‌లుగా ఉంటుంది. అంటే.. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 

240 మార్కులకు పార్ట్‌–ఏ

  • పార్ట్‌ ఏ పరీక్ష ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో ఉంటుంది. మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. మార్కింగ్‌ స్కీమ్‌ ఒక్కో విభాగానికి ఒక్కో విధంగా ఉంటుంది. మొత్తం 240 మార్కులకు రెండున్నర గంటల కాలవ్యవధితో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 
  • సెక్షన్‌–1: న్యూమరికల్‌ అన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ): ఈ సెక్షన్‌ నుంచి 18 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఈ సెక్షన్‌లో ప్రశ్నలకు సమాధానాల(నంబర్‌)ను కంప్యూటర్‌ స్క్రీన్‌పై వర్చువల్‌ కీ బోర్డ్‌ ద్వారా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు లేవు. ఈ సెక్షన్‌లో ప్రశ్నలకు చాయిస్‌ చూపించరు. 
  • సెక్షన్‌–2: మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్‌ (ఎంఎస్‌క్యూలు): ఈ సెక్షన్‌ నుంచి 18 ప్రశ్నలుంటాయి. నాలుగు ఆప్షన్స్‌ ఇస్తారు. ఇందులో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి.
  • సెక్షన్‌–3: ఈ సెక్షన్‌లో ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూ) విధానంలో ఉంటాయి. మొత్తం 32 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తాయి. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.71 మార్కు తగ్గిస్తారు. ఇందులో నాలుగు ఆప్షన్స్‌ ఇస్తారు. ఏదైనా ఒకదాన్ని సరైన సమాధానంగా ఎంపిక చేసుకోవాలి.
  • సిలబస్‌: పార్ట్‌–ఏ విభాగానికి సంబంధించి అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిబిలిటీ, విజువలైజేషన్‌ అండ్‌ స్పెషియల్‌ ఎబిలిటీ, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, లాంగ్వేజ్‌ క్రియేటివిటీ నుంచి ప్రశ్నలుంటాయి.

60 మార్కులకు పార్ట్‌–బీ

  • ఈ విభాగంలో పరీక్షను మొత్తం 60 మార్కులకు నిర్వహిస్తారు. 30 నిమిషాలు పరీక్ష సమయంగా కేటాయిస్తారు. ఇందులో ముఖ్యంగా అభ్యర్థుల డ్రాయింగ్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. పేన్‌–పేపర్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. కంప్యూటర్‌లో ప్రశ్న కనిపిస్తుంది. దానికి బుక్‌లెట్‌లో సమాధానం రాయడం లేదా డ్రాయింగ్‌ను గీయాల్సి ఉంటుంది. 
  • పార్‌–బీ: ఈ విభాగంలో వ్యక్తులు లేదా సన్నివేశాలకు అనుగుణంగా అడిగే వాటికి డ్రాయింగ్స్‌ గీయాలి.

సీడ్, యూసీడ్‌ 2022 ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: 
అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 10, 2021
యూసీడ్‌ పరీక్షతేదీ: జనవరి 23, 2022

వెబ్‌సైట్‌: http://www.uceed.iitb.ac.in/2022/   

కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ 2022

అర్హత: సీడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియెట్‌ తర్వాత కనీసం మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ లేదా 2022 జులై నాటికి జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ (10+5) ఉత్తీర్ణత ఉండాలి. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, ఐఐఎస్సీ బెంగళూరు తదితర టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరొచ్చు.

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్ష విధానం: ఈ ఎంట్రెన్స్‌ను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌ ఏ 100 మార్కులకు, పార్ట్‌ బీ 100 మార్కులకు ఉంటాయి. పార్ట్‌ ఏలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్‌ టైప్, మల్టిపుల్‌ చాయిస్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌ బీలో స్కెచింగ్, క్రియేటివిటీ, ఫార్మ్‌ సెన్సివిటీ, విజువల్‌ సెన్సివిటీ, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

కెరీర్‌ స్కోప్‌

  • డిజైనింగ్‌ కోర్సులను పూర్తిచేసిన వారికి మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, రెనాల్డ్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్, ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్, హోండా మోటార్స్, గోద్రేజ్, ఐబీఎమ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థలు ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలోనూ డిజైనింగ్‌ కోర్సులను పూర్తిచేసిన వారికి మంచి డిమాండ్‌ ఉంది. 
  • కెరీర్‌ ప్రారంభంలో అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతిభ/అనుభవంతో చీఫ్‌ డైరెక్టర్‌/డిజైనర్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంటి ఉన్నత స్థాయి హోదాలు లభిస్తాయి. పనిచేసే సంస్థను బట్టి ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4–5లక్షల మధ్య ఉంటుంది. అనుభవంతో వార్షిక వేతనం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు.
Published date : 17 Sep 2021 01:23PM

Photo Stories