Skip to main content

వృత్తి విద్య కోర్సులు .. ఉపాధికి వెలుగు రేఖలు

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.. పది పూర్తయితే చాలు ఇంటర్మీడియెట్ స్థాయిలో చాలా మంది ఎంపిక చేసుకునే గ్రూపులివి!
ఉన్నత విద్యా కోర్సుల్లో చేరి, నచ్చిన కెరీర్‌ను అందుకునేందుకు బాటలు వేసే గ్రూపులివి! అయితే పది తర్వాత రెండేళ్లకే పదిలమైన ఉపాధిని అందించే కోర్సులు ఒకేషనల్ కోర్సులు. విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని అందించే ఇంటర్ ఒకేషనల్ కోర్సులపై స్పెషల్ ఫోకస్..

ఇంటర్ ఒకేషనల్ లక్ష్యాలు
  • ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు వివిధ వృత్తులకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలను అందించి, ఉద్యోగావకాశాలు లేదా స్వయం ఉపాధిని పొందేలా చేయడం.
  • ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి, వ్యక్తిగత శ్రేయస్సులను అనుసంధానించడం.
  • వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో వృద్ధి పథంలో పయనిస్తున్న విభాగాలకు అవసరమైన మధ్యస్థాయి మానవ వనరులను సృష్టించడం.

తక్షణ ఉపాధికి సత్వర మార్గం:
పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇ లాంటి వారికి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులు అవసరం. మరోవైపు నేటి ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి.
అర్హత :
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఔత్సాహిక విద్యార్థులు నేరుగా కాలేజీని సంప్రదించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కంపెనీలు తేలికపాటి, భారీ వాహనాలను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నాయి. దీంతో సర్వీసింగ్, మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో మధ్యస్థాయి టెక్నీషియన్లకు డిమాండ్ పెరిగింది.
కరిక్యులం: వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్‌మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్..
ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.
స్వయం ఉపాధి: ఆటోమొబైల్ మెకానిక్, డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ సర్వీస్ మెకానిక్, వెహికల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్‌మ్యాన్-డీలర్.

మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
ఉద్యోగావకాశాలు:
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్‌కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్‌ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.
స్వయం ఉపాధి: సోలార్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ; వెల్డింగ్ వర్క్‌షాప్; లైట్ మోటార్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్; జనరల్ వర్క్‌షాప్.
  • ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రికల్ టెక్నీషియన్
ఉద్యోగావకాశాలు:
ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్.
స్వయం ఉపాధి: ఎలక్ట్రిక్ ఉపకరణాల డీలర్‌షిప్/ఏజెన్సీ; రిపైర్ షాప్; మ్యానుఫ్యాక్చరింగ్; ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్; ఎలక్ట్రీషియన్; వైర్‌మ్యాన్; సర్వీస్ టెక్నీషియన్/సర్వీస్ ఇంజనీర్.

కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ
ఉద్యోగావకాశాలు:
నిర్మాణ రంగంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లకు అసిస్టెంట్లు; కాంట్రాక్ట్ ఉద్యోగాలు; తాపీమేస్త్రీ, కార్పెంటర్, పెయింటర్ వంటివి.
స్వయం ఉపాధి: నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్; పెయింటింగ్, బార్ బెండింగ్ వంటి సేవలు.

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
ఉద్యోగావకాశాలు:
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.
స్వయం ఉపాధి: ఎలక్ట్రానిక్ పరికరాల సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల డీలర్‌షిప్/ఏజెన్సీ, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి.

హోంసైన్స్
ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్
కరిక్యులం:
ఫండమెంటల్స్ ఆఫ్ గార్మెంట్ కన్‌స్ట్రక్షన్, ఫండమెంటల్స్ ఆఫ్ టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్, అడ్వాన్స్‌డ్ డ్రెస్ డిజైనింగ్, ట్రెడిషనల్ టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ గార్మెంట్ డిజైనింగ్.
ఉద్యోగావకాశాలు: ఫ్లోర్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ డిజైనర్, సోర్సింగ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్యాటర్న్ మేకర్.
స్వయం ఉపాధి: బోటిక్, కాంట్రాక్ట్ పనులు, గ్రామీణ ప్రాంత ఔత్సాహికులకు శిక్షణ..

హోటల్ ఆపరేషన్స్
ఉద్యోగావకాశాలు:
హోటళ్లలో ఫ్లోర్ మేనేజర్/సూపర్‌వైజర్; కుక్‌లు, బేకరీ అసిస్టెంట్లు, కిచెన్ స్టీవార్డింగ్ అసిస్టెంట్. విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమల్లో కేంటీన్లు వంటి వాటిలో అవకాశాలుంటాయి.

ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
కరిక్యులం:
ఇంట్రడక్షన్ టు చైల్డ్ డెవలప్‌మెంట్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ క్రెచెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ప్రిస్కూల్, పేరెంట్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్.
ఉద్యోగావకాశాలు: ప్లే స్కూల్ టీచర్, ప్రీ స్కూల్ టీచర్, అంగన్‌వాడీ వర్కర్, ప్రీ స్కూల్ సూపర్‌వైజర్, స్కూల్ కోఆర్డినేటర్.
స్వయం ఉపాధి: క్రెచ్, ప్రీ స్కూల్, ప్లే స్కూల్..

అగ్రికల్చరల్
క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్
భూ, నీటి వనరులు క్షీణిస్తుండటం.. వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి నేపథ్యంలో దేశంలో పంట ఉత్పత్తుల్లో నిలకడ వృద్ధి సాధించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సంస్థాగతపరమైన సహకారంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ వృత్తి విద్యా నిపుణుల అవసరం పెరుగుతోంది.
ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఫార్మ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, విలేజ్ కోఆర్డినేటర్, ప్లాంట్ ప్రొటక్షన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: అగ్రీ ఇన్‌పుట్ సప్లయిర్; సీడ్ గ్రోవర్, క్రాప్ ప్రొడ్యూసర్, కస్టమ్ సర్వీస్, కాంట్రాక్టర్/కాంట్రాక్టింగ్ ఫార్మింగ్.

డెయిరీ
ఉద్యోగావకాశాలు:
వెటర్నరీ అసిస్టెంట్, డెయిరీ ఫారం
అసిస్టెంట్; మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ సూపర్‌వైజర్; డెయిరీ లేబొరేటరీ అసిస్టెంట్; ఫీడర్ ప్రొడక్షన్ సూపర్‌వైజర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: డెయిరీ ఫారం ఓనర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్; ఫీడర్ ప్రొడ్యూసర్; మిల్క్ పార్లర్; మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్; మిల్క్ కలెక్షన్ సెంటర్.

ఫిషరీస్
ఉద్యోగావకాశాలు:
లేబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, సూపర్‌వైజర్; ఆక్వా కేంద్రాలు, హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబొరేటరీ అసిస్టెంట్; ఫీల్డ్ మార్కెటింగ్ అసిస్టెంట్, సీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిషరీస్ కోఆపరేటివ్ సంస్థలలో ఉద్యోగాలు, స్టేట్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.
స్వయం ఉపాధి: ఫిషరీ ఇన్‌పుట్ సప్లయిర్, సీడ్ ప్రొడ్యూసర్, ఫిష్ ప్రొడ్యూసర్..

సెరీకల్చర్
ఉద్యోగావకాశాలు:
ఆపరేటివ్ (గ్రెయినేజ్/మల్బరీ కల్టివేషన్/ఎక్స్‌టెన్షన్/రియరింగ్/రీలింగ్); లేబ్ అటెండర్; కల్టివేటర్/లేబర్.
స్వయం ఉపాధి: మల్బరీ నర్సరీ, గ్రెయినేజ్, సెరీకల్చర్ సర్వీస్ సెంటర్, మల్బరీ గ్రోవర్, సిల్క్‌వార్మ్ సీడ్ సప్లయిర్, మల్బరీ ప్రోపగేటర్, సిల్క్ రీలర్, సిల్క్ ట్విస్టర్, కకూన్ సప్లయిర్.

హ్యుమానిటీస్, ఇతరాలు
కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్
ఉద్యోగావకాశాలు:
మీడియా సంస్థలలో యానిమేటర్‌గా అవకాశాలుంటాయి. డ్రాయింగ్ అసిస్టెంట్, ఫొటో ఎడిటింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందొచ్చు. స్థానిక కేబుల్ టీవీ కేంద్రాలు, గేమింగ్ స్టూడియోల్లోనూ అవకాశాలుంటాయి.

టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్
ఉద్యోగావకాశాలు:
టూరిజం అసిస్టెంట్, టూరిస్ట్‌గైడ్, టూర్ ఎస్కార్ట్, గెస్ట్ రిలేషన్ అసిస్టెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్, హౌస్‌కీపింగ్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: కేటరింగ్ ఆపరేషన్స్, టూర్ కండక్టర్, కొరియర్ అండ్ కార్గో ఏజెంట్, టూరిస్ట్ గైడ్..

పారామెడికల్
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్:
వైద్య సేవల రంగంలో రోగ నిర్ధరణ కీలకమైంది. సరిగా రోగ నిర్ధరణ జరక్కుంటే రోగికి చికిత్స చేసేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు.
కరిక్యులం: బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ అండ్ పాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ.
ఉద్యోగావకాశాలు: ఆసుపత్రుల రోగ నిర్ధారణ కేంద్రాలు; వైద్య, ఫార్మసీ కళాశాలలు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్స్ వంటివాటిలో లేబొరేటరీ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.
స్వయం ఉపాధి: డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల ఏర్పాటు; ల్యాబ్ కెమికల్స్, గ్లాస్‌వేర్, ల్యాబ్ పరికరాలు, విడి భాగాల డిస్ట్రిబ్యూటర్.
ఇతర కోర్సులు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ.

బిజినెస్, కామర్స్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్:
కరిక్యులం:
బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్.
ఉద్యోగావకాశాలు: సూపర్ బజార్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, బ్యాంకుల్లో అవకాశాలుంటాయి. మ్యూచ్‌వల్‌ఫండ్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు.
స్వయం ఉపాధి: పోస్టల్ సేవింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లుగా స్వయం ఉపాధి పొందొచ్చు. చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం
ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులకు కొత్త కరిక్యులం రూపొందించి, 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏ ఒకేషనల్ కోర్సుకైనా ప్రాక్టికల్స్ కీలకం. కాబట్టి కోర్సులో భాగంగా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కుల వెయిటేజీ కూడా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమానంగా ఉంటుంది. అంటే.. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు పాక్టికల్స్‌కు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్టులుంటాయి. కళాశాల వీలునుబట్టి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ఉన్నత విద్యావకాశాలు
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే 10 శాతం కోటా కింద సంబంధిత పాలిటెక్నిక్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరొచ్చు. బీఏ, బీకామ్ కోర్సుల్లోనూ ప్రవేశించవచ్చు.
వేతనాలు
ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధిని చూపించవచ్చు.
Published date : 16 May 2015 02:53PM

Photo Stories