Skip to main content

ఉజ్వల కెరీర్‌కు పునాది.. ఐఐఎస్‌ఈఆర్

నాణ్యమైన శాస్త్రీయ విద్యను అందించడంతోపాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) విద్యా సంస్థలు.. సైన్‌‌స రంగంలో ఉజ్వల కెరీర్‌కు పునాదిగా విరాజిల్లుతున్నాయి...

భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇన్‌స్టిట్యూట్స్‌కు స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. ఐఐఎస్‌ఈఆర్‌కు దేశ వ్యాప్తంగా పుణే, కోల్‌కతా, తిరువనంతపు రం, మొహాలీ, భోపాల్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 950 సీట్లు ఉన్నాయి. ఐఐఎస్‌ఈఆర్ 2014 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు..

ప్రవేశం:
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సహాన్ యోజన (కేవైపీవై) బేసిక్ సైన్స్ స్ట్రీమ్: ఎస్‌ఏ (2012)/ఎస్‌ఎక్స్ (2013)/ఎస్‌బీ (2013)లలో అర్హత సాధించి ఉండాలి.
  • జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2014: ఈ పరీక్షలో ర్యాంకు సాధించిన విద్యార్థులు.
  • స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్: 12వ తరగతి మార్కులాధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) అందజేసే ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్ పొందిన విద్యార్థులు. అయితే ఈ విద్యార్థులు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
  • ఈ మూడు విభాగాల్లో అర్హత ఉంటే ఆ మేరకు మూడు విభాగాల ద్వారా వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
షార్ట్‌లిస్ట్:
వచ్చిన దరఖాస్తుల ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ మేరకు సదరు విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అయితే కౌన్సిలింగ్‌లో ఐదు క్యాంపస్‌లలో కోరుకున్న క్యాంపస్‌లో అడ్మిషన్ లభించాలని ఏమీ లేదు. కాకపోతే ఏ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రాధాన్యతనిస్తున్నారో.. ఆ సమాచారాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. ఈ ప్రాధాన్యత ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అయితే సీట్ల కేటాయింపులో తొలుత కేవైపీవై విద్యార్థులకు ప్రాధాన్యత లభిస్తుంది, ఆ త ర్వాత వరుసగా జేఈఈ-2014 ర్యాంకర్లు, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత దక్కుతుంది. ఈ క్రమంలో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను కేవైపీవై విద్యార్థులకు, 50 శాతం సీట్లను కేవైపీవై, జేఈఈ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్ టెస్ట్ విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఆప్టిట్యూడ్ టెస్ట్:
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం మార్కులు 180. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్, మోడల్ పేపర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేర్చుకోవడం, అనుసంధానించడం:
బీఎస్-ఎంఎస్ కోర్సులో తరగతిలో బోధించిన అంశాన్ని పరిశోధనతో సమన్వయం చేసే మల్టిడిసిప్లినరీ విధానాన్ని పాటిస్తారు. నేర్చుకోవడం, అనుసంధానించడం అనే సూత్రానికి ప్రాధాన్యతనిస్తారు. కోర్సు నిర్వహణలో సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. మొదటి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు) విద్యార్థులందరికీ ఉమ్మడి సబ్జెక్ట్‌లను బోధిస్తారు. అవి.. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్. మూడు, నాలుగు సంవత్సరాల్లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌లను బోధిస్తారు. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఈ క్రమంలో ఏదో ఒక అంశం (వన్ మేజర్) లేదా బహుళ అంశాల (మోర్ మైనర్స్)ను ఎంచుకోవచ్చు. చివరి సంవత్సరం (ఐదో సంవత్సరం)లో పూర్తిగా ప్రాజెక్ట్‌వర్క్ ఉంటుంది.

స్కాలర్‌షిప్ సౌకర్యం:
బీఎస్-ఎంఎస్ కోర్సులో చేరిన విద్యార్థులకు వారి ఆలోచనలను ప్రోత్సహించడం కోసం స్కాలర్‌షిప్‌ను కూడా అందజేస్తారు. ఈ క్రమంలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి నెలకు రూ. 5 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  • దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ఎస్టీలకు-రూ.300)
  • కేవైపీవై/జేఈఈ (అడ్వాన్స్‌డ్) విద్యార్థుల దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7, 2014.
  • కేవైపీవై/జేఈఈ (అడ్వాన్స్‌డ్) విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదీ: జూలై 10, 2014.
  • స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ విధానం ద్వారా దరఖాస్తుకు గడువు తేదీ: జూలై 10, 2014.
  • ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 20, 2014.
  • కోర్సు ప్రారంభం: ఆగస్టు, 2014.
వివరాలకు:  www.iiser-admissions.in
Published date : 20 Jun 2014 02:53PM

Photo Stories