Skip to main content

ఫుడ్ ప్రాసెసింగ్.. ఎఫ్‌ఎంసీజీ.. కెరీర్ అవకాశాలు

వేగంగా విస్తరిస్తోన్న వ్యాపార కార్యకలాపాలు... అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో... గ్రోత్ అండ్ కెరీర్ అవకాశాల పరంగా ‘ది బెస్ట్’గా నిలుస్తున్న రంగాలు.. ఫుడ్ ప్రాసెసింగ్; ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ). సాధారణ బ్యాచిలర్ డిగ్రీ నుంచి స్పెషలైజ్డ్ కోర్సుల వరకు అన్ని కోర్సుల వారికి అవకాశాలు కల్పిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్; ఎఫ్‌ఎంసీజీ రంగాలపై కెరీర్ ఫోకస్...
పుష్కల అవకాశాల... ఫుడ్ ప్రాసెసింగ్
ముడి ఆహార పదార్థాలను శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి, సులభంగా ‘మార్కెటబుల్ పుడ్’గా వినియోగదారులకు అందించే ప్రక్రియ పుడ్ ప్రాసెసింగ్. చిన్న పిల్లలు తినే చాక్లెట్లు మొదలు.. అన్ని ఆహార ఉత్పత్తుల రూపకల్పనలో పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య విభాగం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ముందంజలో ఉంది. అదే సమయంలో యువతకు అద్భుత అవకాశాలతో పాటు ఆకర్షణీయమైన వేతనాలకు అందిస్తోంది.

పెరుగుతున్న ప్రాధాన్యం:
దేశీయ పుడ్ ప్రాసెసింగ్ రంగం ప్రాధాన్యం క్రమేణా పెరుగుతోంది. అమూల్,నెస్లే, ఐటీసీ వంటి పెద్ద సంస్థలే కాకుండా.. మరెన్నో చిన్న, మధ్య తరహా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ విభాగంలో కొత్త సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. చిప్స్ నుంచి చైనీస్ ఫుడ్ ప్రొడక్ట్స్ వరకు.. ఇప్పుడు అన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌గా అందుబాటులోకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం.

ప్రభుత్వ ప్రత్యేక విధానం:
కేంద్ర ప్రభుత్వం ఆహార రంగ పరిశ్రమ విస్తరణ, ఆవశ్యకతలను గుర్తించింది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ రూపొందింది. దీని ప్రకారం 2025 నాటికి ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ వృద్ధిరేటు లక్ష్యం 25 శాతంగా నిర్దేశించింది. 2011 మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రకారం ప్రాధాన్యత రంగ పరిశ్రమల జాబితాలోనూ చేర్చింది. నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో ప్రత్యేక పథకాన్ని సైతం అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిర్దేశిత ప్రాంతంలో ఆహార ఉత్పత్తుల సంస్థలను ఏర్పాటు చేసి, ప్రోత్సహించేందుకు ఫుడ్ పార్క్స్ విధానానికి రూపకల్పన చేసింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 500 ఫుడ్ పార్క్‌లు, జాతీయ స్థాయిలో ఐదు మెగా ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కెరీర్ అవకాశాలు:
ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు శరవేగంగా విస్తరిస్తున్న పుడ్ ప్రాసెసింగ్ రంగంలో మంచి డిమాండ్ ఉంది. ఆయా ఆహార ఉత్పత్తి సంస్థల రా మెటీరియల్స్, సేల్స్ విభాగాల్లో పెద్ద స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. అనలిటికల్ కెమిస్ట్; బయో కెమిస్ట్, ఆర్గానిక్ కెమిస్ట్; ఫుడ్ టెక్నాలజిస్ట్; రీసెర్చ్ సైంటిస్ట్; ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగాల్లో నెలకు రూ.15 వేల నుంచి రూ. 30 వేల వరకు ప్రారంభ వేతనం లభిస్తోంది. ఫుడ్ ప్రాపెసింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి లైవ్ స్టాక్ (జీవ సంపద) పరిశ్రమల్లో సైతం అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించి పౌల్ట్రీ, డైరీ రంగాలు అగ్రపథంలో నిలుస్తున్నాయి.

అకడమిక్ అవకాశాలు:
అకడమిక్ పరంగా ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో ప్రత్యేక కోర్సులు లేనప్పటికీ.. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో హోం సైన్స్; బీఎస్సీ/బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎమ్మెస్సీ/ఎంటెక్ (ఫుడ్‌టెక్నాలజీ), న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన వారికి క్యాంపస్‌ల్లోనే కంపెనీలు ఆఫర్ లెటర్స్ అందిస్తున్నాయంటే ఈ కోర్సులకున్న డిమాండ్ అర్థమవుతుంది. వీటితోపాటు న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్; అప్లయిడ్ న్యూట్రిషన్ వంటి సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో అడుగు పెట్టేందుకు తోడ్పతాయి. డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఉపయోగపడతాయి. వీటితోపాటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెస్ విభాగంలో ప్రత్యేక శిక్షణనందించేందుకు అన్ని రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రై నింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసింది.

ఫుడ్ ప్రాసెసింగ్- ఇన్‌స్టిట్యూట్స్:
ఫుడ్ టెక్నాలజీ / ఫుడ్ సైన్స్ / హోం సైన్స్ మేజర్ సబ్జెక్ట్స్‌గా దాదాపు అన్ని యూనివర్సిటీల్లో బీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలోనూ అన్ని యూనివర్సిటీలు వివిధ స్పెషలైజేషన్లు అందిస్తున్నాయి. వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
  • సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్; మైసూర్.
    • నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.
    • గోవింద్ వల్లభ్‌పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ.
    • ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్.
    • నేషనల్ షుగర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాన్పూర్.
    • ఫ్రూట్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ - లక్నో.

టాప్ రిక్రూటర్స్
అమూల్, డాబర్ ఇండియా; నెస్లే ఇండియా; బ్రిటానియా ఇండస్ట్రీస్; ఐటీసీ లిమిటెడ్; క్యాడ్‌బరీ ఇండియా; ఎంటీఆర్ ఫుడ్స్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్;
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
  • 2015 చివరి నాటికి 258 బిలియన్ డాలర్లు చేరుకోనున్న దేశీయ ఆహార ఉత్పత్తుల పరిశ్రమ
  • ప్రపంచ స్థాయిలో ఫుడ్ అండ్ గ్రాసరీ రంగంలో ఆరో స్థానంలో నిలుస్తున్న భారత్
  • 2020 నాటికి 482 బిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని అంచనా
  • 2015 చివరి నాటికి 8.2 మిలియన్ల మందికి ఈ రంగంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి.
  • 2020 నాటికి దాదాపు 15 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా

ఎఫ్‌ఎంసీజీ.. ఫాస్ట్ మూవింగ్ కెరీర్ గ్రోత్
ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్).. ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ కెరీర్ గ్రోత్ గానూ నిలుస్తోంది. పెరుగుతున్న కార్యకలాపాలు, సంస్థల విస్తరణ, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా ఎఫ్‌ఎంసీజీ ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేసుకుంటుంది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ షూ లేస్ నుంచి హెయిర్ క్లిప్ వరకు, పేపర్ నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ వరకు అన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీ కిందకే వస్తాయి. వీటిని ఎఫ్‌ఎంసీజీగా పేర్కొనడానికి ప్రధాన కారణం వీటి విక్రయాల తీరే. వీధి చివరన ఉండే కిరాణా షాప్ నుంచి హైపర్ మాల్స్ వరకు అన్నిటిలోనూ ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. విక్రయాల పరంగా ఇతర ప్రొడక్ట్స్‌తో పోల్చితే వేగంగా అమ్ముడవుతున్నాయి. అందుకే ఈ రంగంలో ఇప్పుడు అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.

అనేక ప్రోత్సాహకాలు:
దేశంలో నాలుగో పెద్ద రంగంగా ఉన్న ఎఫ్‌ఎంసీజీని మరింత విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చింది. ఈ రంగంలో బహుళ జాతి సంస్థల ప్రవేశం క్రమేణా పెరుగుతుండటంతో అదేస్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి.

అవకాశాలు:
ఎఫ్‌ఎంసీజీ రంగంలో సేల్స్ నుంచి ఆర్ అండ్ డీ వరకు బహుళ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
  • సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్స్; సప్లయ్ చైన్ మేనేజర్స్;ఫైనాన్స్ మేనేజర్స్, ప్రొడక్ట్/బ్రాండ్ మేనేజర్, హెచ్. ఆర్.మేనేజర్ వంటివి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తి సంస్థలు/రిటైల్ షాపింగ్‌మాల్స్ నిర్వహణ పరంగా లభించే హోదాలు.
  • కోర్ ప్రొడక్ట్‌కు సంబంధించి ప్రొడక్షన్ ఇంజనీర్స్, ప్యాకేజింగ్ ఇంజనీర్స్,ప్రొడక్ట్ డెవలపర్స్ వంటివి లభిస్తాయి. వీటికి టెక్నికల్ అర్హతలు అవసరం. ఎంట్రీ లెవల్‌లో సేల్స్ పర్సన్స్‌కు షాపింగ్ మాల్ స్థాయిని బట్టి నెలకు రూ.8 వేల నుంచి పది వేల వరకు వేతనం లభిస్తుంది. ఫ్లోర్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్‌లకు నెలకు రూ. 18 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనం ఖాయం.
  • ఉత్పత్తి సంస్థల్లో సాంకేతిక, ఉత్పత్తి ఆధారిత విభాగాల్లో పని చేసే వారికి కనిష్టంగా నెలకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వేతనం లభిస్తోంది.

టాప్ రిక్రూటర్స్
ఫుడ్ ప్రాసెసింగ్ / ఫుడ్ ప్రొడక్ట్ పరిశ్రమకు అనుబంధంగా పేర్కొనే ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ నెస్లే ఇండియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనీ లీవర్; డాబర్ ఇండియా, అమూల్ వంటి సంస్థలే టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. అదనంగా భారతి వాల్‌మార్ట్, హైపర్ మాల్స్‌లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలు, ఈ కామర్స్ సంస్థల విస్తరణ కూడా ఎఎఫ్‌ఎంసీజీ రంగ విస్తరణకు దోహద పడుతున్నాయి.

అకడమిక్ అర్హతలు:
ఎఫ్‌ఎంసీజీ రంగంలో అవకాశాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులు అందుబాటులో లేవు. అకౌంటింగ్, సేల్స్, మేనేజ్‌మెంట్ తదితర నిర్వహణపరమైన విధుల కోసం బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆయా సబ్జెక్టులను చదివిన అభ్యర్థులు సరిపోతారు. రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ/పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన అభ్యర్థులకు సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి.

అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్:
ఎఫ్‌ఎంసీజీ సంస్థలు వాటి అనుబంధ విభాగాల్లో పనిచేసేందుకు తగిన విధంగా రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
  • ఇండియన్ రిటైల్ స్కూల్ - బెంగళూరు
  • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్ - న్యూఢిల్లీ
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రై జ్ - హైదరాబాద్
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్ - బెంగళూరు

ఇవే కాకుండా చాలా యూనివర్సిటీలు / ఇన్‌స్టిట్యూట్‌లు ఎంబీఏ / పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌లో రిటైల్ మేనేజ్‌మెంట్‌ను ఒక స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన వారికి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తి సంస్థలు, రిటైల్ అవుట్‌లెట్స్‌లో ఉద్యోగావకాశాలు గ్యారెంటీ.

ఎఫ్‌ఎంసీజీ ఇండస్ట్రీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
  • 2020 నాటికి 110 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందుతుందని అంచనా.
  • ప్రతి ఏటా సగటున 14.7 శాతం వృద్ధి నమోదు.
  • అయిదేళ్లలో ఏడింతలు పెరగనున్న ఆన్‌లైన్ షాపింగ్‌తో 14.5 బిలియన్ డాలర్ల వ్యాపారం.
  • రానున్న అయిదేళ్లలో దాదాపు పది మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశం.
  • దాదాపు రెండు లక్షల మంది సర్టిఫైడ్ పర్సనల్స్ అవసరం.

ప్రాక్టికాలిటికీ పెద్దపీట
ఫుడ్ ప్రాసెసింగ్/ఫుడ్ టెక్నాలజీ రంగ ఔత్సాహికులు దీనికి సంబంధించిన ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా ముడి పదార్ధాల సేకరణ, వినియోగదారులకు చేరే వరకు సదరు వస్తువు/ఉత్పత్తి/పదార్థం పాడవకుండా నిల్వ ఉండేలా అవసరమైన నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వ్యక్తిగత లక్షణాల కోణంలో ఎక్కువ సమయం లేబొరేటరీల్లో పని చేసే ఓర్పు ఉండాలి. అప్పుడే ఈ రంగంలో రాణించగలరు.
- ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్, ఫుడ్ టెక్నాలజీ ప్రొఫెసర్, ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ


పర్సనల్ స్కిల్స్ ప్రధానం
ఎఫ్‌ఎంసీజీ రంగంలో కెరీర్ ఔత్సాహికులకు అకడమిక్ స్కిల్స్‌తోపాటు పర్సనల్ స్కిల్స్ ఎంతో ముఖ్యం. ఇది వినియోగదారులతో నేరుగా సంబంధాలు ఉండే రంగం. ముఖ్యంగా ఔత్సాహికులకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. అదే విధంగా ఓర్పు, నేర్పుతోనే ఫ్రంట్ ఎండ్ విభాగంలో రాణించగలరు. ఇక బ్యాక్ ఎండ్‌గా పేర్కొనే ప్రొడక్షన్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పనిచేసే వారు నిరంతరం కొత్త ఆలోచనలతో కదలాలి.
- ఐ.వి.ఎస్.సుధాకర్, హెడ్-హెచ్‌ఆర్, సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్
Published date : 19 Sep 2015 11:43AM

Photo Stories