Skip to main content

ప్యాకేజింగ్ ‘పొట్లం’లో పదిలమైన కెరీర్...!

మొదటి ఫొటోలో సోయా పాల అమ్మకందారుల కోసం ఓ సంస్థ రూపొందించిన ప్యాక్! ఆవు పాల పొదుగును పోలి ఉన్న ఈ పొట్లం వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ పాలు కూడా స్వచ్ఛమైన ఆవు పాల వంటివేనన్న విషయాన్ని చాటిచెబుతోంది! రెండో ఫొటోలో సూపర్ మార్కెట్‌లో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న సోయా పాల ప్యాకెట్లు.

చర్మ సంరక్షణకు ఉపయోగపడే సబ్బు బిళ్లయినా.. ఆరోగ్యాన్ని పంచే మందు బిళ్లయినా.. దేనికైనా పదిలమైన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ అవసరం. ప్రస్తుత సూపర్ మార్కెట్ సంస్కృతిలో స్వీయ సేవ (సెల్ఫ్ సర్వీసింగ్) మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ పెద్ద సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న వ్యక్తి నిమిషానికి 600 వస్తువులను దాటుకుంటూ వెళ్తాడు. ఇలాంటి పరిస్థితిలో కొనుగోలుదారుల్ని ఓ వస్తువు ఆకర్షించాలంటే అందమైన ప్యాకేజింగ్ అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల నుంచి బయటకొచ్చిన ఏ ఉత్పత్తి అయినా విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ కీలకం. అందుకే ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగ నిపుణులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయి.

ఓ కంపెనీ తయారు చేసిన వస్తువు అమ్మకాల్లో ప్యాకేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వస్తువు చెడిపోకుండా ఉంచడంలోనూ, కొనుగోలుదారుడిని ఇట్టే ఆకర్షించడంలోనూ ప్యాకేజింగ్‌ది పెద్దన్న పాత్రే! మొత్తంమీద ఓ వస్తువు మార్కెటింగ్‌లో ప్యాకేజింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్యాకేజింగ్ సాదాసీదా వ్యవహారంలా కాకుండా, సరికొత్త వృత్తిగా సొబగులద్దుకుంటోంది! యువత ముందు ఓ ప్రత్యామ్నాయ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది!

వన్నె తెచ్చే కోర్సులు:
దేశంలో ప్యాకేజింగ్‌కు సంబంధించి కోర్సులను అందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). ఇది కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ పాలనా మండలి ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో బ్రాంచ్‌లున్నాయి. బెంగళూరులో బ్రాంచ్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఇది పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకేజింగ్, గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్(దూరవిద్యలో) కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, స్వల్ప కాలిక కోర్సులను అందిస్తోంది. సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్/సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్/తత్సమాన కోర్సులను పూర్తిచేసినవారు ప్యాకేజింగ్ కోర్సుల్లో చేరొచ్చు.
  • రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు ప్యాకేజింగ్ టెక్నాలజీ డిప్లొమాను ఆఫర్ చేస్తున్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెకానికల్ మెరైన్, మెకట్రానిక్స్ బ్రాంచ్‌లతో బీటెక్ చేసే అవకాశం కూడా ఉంది.
కోర్సులో బోధించే అంశాలు:
సాధారణంగా ప్యాకేజింగ్ కోర్సుల కరిక్యులం 60 శాతం థియరీకి, 40 శాతం ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఉంటుంది. పరిశ్రమల సందర్శన, పారిశ్రామిక శిక్షణ, ప్రాజెక్టు వర్క్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ప్యాకేజింగ్; సెల్యులోజ్ టెక్నాలజీ; ఫైబర్ బోర్డు అండ్ గ్లాస్ టెక్నాలజీ; ప్లాస్టిక్ టెక్నాలజీ; మెటల్ కంటైనర్స్; టూలింగ్, డిజైన్, మౌల్డ్స్; ప్యాకేజ్ ప్రింటింగ్ టెక్నాలజీ; ప్యాకేజింగ్ టెక్నాలజీ ఫుడ్/ఫార్మాస్యూటికల్స్/కాస్మెటిక్స్/కెమికల్స్); కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను బోధిస్తారు.

కెరీర్:
ప్యాకేజింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ యూనిట్లు తదితరాల్లో అవకాశాలుంటాయి. ప్రొడక్షన్, పర్చేస్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
  • ప్యాకేజింగ్ శిక్షణ కేంద్రాల్లో బోధనా సిబ్బందిగా అవకాశాలు ఉంటాయి. ప్యాకేజింగ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ సంస్థల్లోనూ ఉద్యోగాలుంటాయి. సొంతంగా ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్:
  • ప్యాకేజింగ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్.
  • ప్యాకేజింగ్ మేనేజర్/ ఆపరేటర్.
  • క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు (ప్యాకేజింగ్).
  • ప్యాకేజింగ్ ఇంజనీర్.
  • ప్యాకేజింగ్ సైంటిస్ట్స్.
  • సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ప్యాకేజింగ్).
విధులు:
ఒక ఉత్పత్తిని అందంగా ఆకట్టుకునేలా మన్నికైన ప్యాకేజింగ్‌ను రూపొందించడం ప్యాకేజింగ్ నిపుణుల విధి. ఈ క్రమంలో ఆయా పరిశ్రమలు వాటి ఉత్పత్తులు, కాలపరిమితి ఆధారంగా సాంకేతికంగా ఎటువంటి ప్యాకింగ్ అవసరమో (ఉదాహరణకు ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం, కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి) నిర్ధారించడం, అందుకోసం అవసరమైన రసాయనాలను సూచించడం, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలో సలహానివ్వడం, పర్యావరణ పరంగా అవసరమైన జాగ్రత్తలను సూచించడం వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు.

వేతనాలు:
అవకాశాలకనుగుణంగానే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా భారీ వేతనాలు పొందే అవకాశం ఉంది.

టాప్ రిక్రూటర్స్:
  • హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్
  • క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్
  • కోకా కోలా ఇండియా ఐఎన్‌సీ
  • ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్ ఇండియా లిమిటెడ్
  • డాబర్ ఇండియా లిమిటెడ్
  • జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్
  • విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్
  • ఐటీసీ లిమిటెడ్ సిప్లా లిమిటెడ్
నైపుణ్యాలు:
  • సృజనాత్మకత
  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • మార్కెటింగ్ ధోరణులపై అవగాహన
  • బృంద స్ఫూర్తి
  • టెక్నాలజీ అప్లికేషన్.
పరిశ్రమ తీరుతెన్నులు
  • ప్రపంచ ప్యాకేజింగ్ మార్కెటింగ్‌లో భారత్‌స్థానం 6.
  • దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ప్యాకేజింగ్ పరిశ్రమ ఒకటి. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్ని రకాల పరిశ్రమలను ప్రభావితం చేస్తోంది.
  • ప్రపంచ ప్యాకేజింగ్ పరిశ్రమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.32 లక్షల కోట్లు. భారత్ ప్యాకేజింగ్ పరిశ్రమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.లక్షా 40 వేల కోట్లు. ఏటా పరిశ్రమ 15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది.
భారత్- రంగాల వారీగా ప్యాకేజింగ్
Bavitha

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ 2012-13 వార్షిక నివేదిక ప్రకారం
  • ఫార్మా ప్యాకేజింగ్
  • పర్సనల్ కేర్ ప్యాకేజింగ్
  • శుద్ధి చేసిన ఆహారపు ప్యాకేజింగ్
  • ఇతర ప్యాకేజింగ్
ఐఐపీ- పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
Bavitha ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ప్యాకేజింగ్ (ఐఐపీ).. రెండేళ్ల కాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్ (12+3 విధానంలో ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/మైక్రోబయాలజీలలో ఒక సబ్జెక్టు మెయిన్‌గా లేదా సెకండ్ సబ్జెక్ట్‌గా ఉండాలి).
  • అగ్రికల్చర్/ఫుడ్ సైన్స్/పాలిమర్ సైన్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీని కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. వీరు ఇంటర్వ్యూ సమయానికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ప్రవేశ ప్రక్రియ నుంచి తప్పిస్తారు.
  • నిర్దేశ డిగ్రీకి తత్సమాన కోర్సులను విదేశాల్లో పూర్తిచేసిన వారు అర్హులు. అయితే వారు అకడమిక్‌గా మంచి ప్రతిభ కనబరచి ఉండాలి.
ప్రవేశం: అకడమిక్ మెరిట్, ఎంట్రన్స్ (రాత పరీక్ష, ఇంటర్వ్యూ)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష పత్రం గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షను ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఉంటుంది.

సీట్ల వివరాలు:
ముంబై-80; ఢిల్లీ-80; కోల్‌కతా-60; హైదరాబాద్-60
  • ఓబీసీ విద్యార్థులకు 27శాతం, ఎస్సీ విద్యార్థులకు 15 శాతం,ఎస్టీ విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్ ఉంటుంది
  • కోర్సులో ప్రవేశించేటప్పుడు రూ.40 వేలు ఫీజు చెల్లించాలి. దీంతో పాటు సెమిస్టర్‌కు రూ.60 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సు స్వరూపం: మూడు సెమిస్టర్లు ఉంటాయి. కోర్సులో ప్యాకేజింగ్‌కు సంబంధించిన అంశాలతో పాటు మేనేజ్‌మెంట్ సబ్జెక్టులను కూడా బోధిస్తారు. అవి..
  • ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్
  • టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
  • ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
  • మెటీరియల్స్ మేనేజ్‌మెంట్
  • మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్.
దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ: జూన్ 12, 2014.
ప్రవేశ పరీక్ష జరుగు తేదీ: జూన్ 19, 2014.
వెబ్‌సైట్: www.iipin.com

కోర్సులు పూర్తిచేసిన వారికి వంద శాతం ప్లేస్‌మెంట్స్
Bavitha
ప్రస్తుతం పరిశ్రమల్లో ప్యాకేజింగ్ ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులను నియమించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్యాకేజింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. ఆహార సంబంధిత పరిశ్రమలు, కెమికల్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలకు సంబంధించిన సంస్థల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.2,50,000 వరకు వార్షిక వేతనం లభిస్తోంది. ప్రారంభంలోనే ఏడాదికి ఐదారు లక్షల ప్యాకేజీలకు ఉద్యోగాలను సొంతం చేసుకున్న వారూ ఉన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా కూడా వెళ్లొచ్చు.
Published date : 29 May 2014 05:06PM

Photo Stories