కెరీర్ గైడెన్స్... మర్చెంట్ నేవీ
కనుచూపు మేర కనువిందు చేసే కడలి కెరటాలు.. ఎగసి పడే అలలు.. చల్లని గాలుల నడుమ నౌకాయానం.. ఎంతో అద్భుతం.. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభూతి ఆస్వాదించాలనుకోవడం సహజం. మరి.. అంతటి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఏడాదిలో దాదాపు తొమ్మిది నెలలపాటు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. అలాంటి ఆనందంతోపాటు ఆదాయాన్ని కూడా అందించే.. ‘మర్చెంట్ నేవీ’ అవకాశాలపై కెరీర్ గైడెన్స్
విశ్వవ్యాప్తంగా ‘స్వేచ్ఛా వాణిజ్యం’ ఊపందుకుంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మొదలు..చిన్న దేశాల వరకు అన్నిటా ఎగుమతులు, దిగుమతుల రూపంలో వాణిజ్యం నలు దిశలా వ్యాపిస్తోంది. అదే విధంగా ప్రపంచ దేశాలకు పర్యాటకుల సందడి పెరుగుతోంది. ఈ రెండు అవసరాలకు ఎక్కువగా జలమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ‘నౌకాయానం’ ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నౌక’ నిర్వహణకు సుశిక్షితులైన సిబ్బంది అవసరం ఏర్పడుతోంది. ఈ విధంగా..వ్యాపార అవసరాలు తీర్చే నౌకల్లో కొలువులనే మర్చంట్ నేవీ అంటారు. ఇప్పుడు ఈ రంగంలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను దిగ్విజయంగా పూర్తి చేస్తే ఏడాదిలో మూడొంతులు సముద్రంతో సహవాసం చేయొచ్చు.
ఏ హోదాల్లో...
మర్చంట్ నేవీ విభాగంలో ముఖ్యంగా నేవిగేటింగ్ ఆఫీసర్స్, రేడియో ఆఫీసర్స్, మెరైన్ ఇంజనీర్స్ ప్రాముఖ్యమున్న హోదాలు. వీటికోసం గతంలో పురుషులు మాత్రమే ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. మహిళలు కూడా షిప్ డాక్టర్స్, రేడియో ఆఫీసర్స్ ఉద్యోగాలకు పురుషులకు దీటుగా పోటీ పడుతున్నారు. ఈ మర్చంట్ నేవీలో విధులు నిర్వర్తించాల్సిన విభాగాలు మూడు.. అవి డెక్, ఇంజిన్, సెలూన్. ‘డెక్’ పరిధిలో కెప్టెన్, చీఫ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, థర్డ్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్లు..ఇంజిన్ విభాగంలో చీఫ్ ఇంజినీర్, సెకండ్ ఇంజినీర్, థర్డ్ ఇంజినీర్ తదితర హోదాలుంటాయి. నెలలతరబడి సముద్రంలో ఉండే మర్చంట్ నేవీ సిబ్బంది, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ‘సేవల శాఖ’ కూడా ఉంటుంది. కిచెన్, లాండ్రీ, ఇతర మౌలిక అవసరాలు తీర్చడం సెలూన్‌లోని సిబ్బంది విధి.
ప్రవేశం ఎలా..
మర్చంట్ నేవీలో చేరాలనుకునే వారికి అందుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు సంస్థలు నాటికల్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్ వంటి అనేక కోర్సులు అందజేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండే ఈ కోర్సుల్లో చేరాలంటే.. ఇంటర్మీడియెట్ లేదా దానికి సమానమైన కోర్సులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐచ్ఛికాంశాలుగా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. వీటితోపాటు దేహదారుఢ్యం, లోపం లేని కంటిచూపు వంటి శారీరక అర్హతలు అవసరం. మర్చంట్ నేవీలో ఇంజనీరింగ్ విభాగంలో చేరాలంటే నాటికల్ సైన్స్ లేదా మెరైన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మన రాష్ట్రంలో ఆంధ్రా యూనివర్సిటీ ఈ కోర్సు అందిస్తోంది. దీంతోపాటు కోల్‌కతా, ముంబయిల్లోని మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యాట్ ప్రముఖ సంస్థ. ఇందులో ప్రవేశానికి ఐ.ఐ.టి. నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించాలి. ప్రతి ఏటా దాదాపు 190 మందికి ప్రవేశం కల్పిస్తారు.
ముంబయిలోని శిక్షణ నౌక ‘చాణక్య’ మూడేళ్ల నాటికల్ సైన్స్ కోర్సు బోధిస్తోంది. ఏటా దాదాపు 120 సీట్లు ఉంటాయి. ఈ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు ఉంటుంది.
కోర్సు ఎక్కడ..
పైవాటితోపాటు దేశవ్యాప్తంగా పలు వర్సిటీలు, ప్రముఖ ప్రైవేట్ సంస్థలూ నాటికల్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులను అందజేస్తున్నాయి. ముంబయిలోని మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ప్రీసీ ట్రైనింగ్ కోర్సుకూ వేదికగా ఉంది. డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లు సంయుక్తంగా బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్సు బోధిస్తున్నాయి. చెన్నైలోని అకాడెమీ ఆఫ్ మెరైన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ముంబయిలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లు కూడా పలు కోర్సులు బోధిస్తున్నాయి.
అప్రమత్తత అవసరం..
మర్చంట్ నేవీ సిబ్బంది కోసం డిమాండ్ పెరుగుతుండటంతో అందుకు సంబంధించి శిక్షణనిచ్చేందుకు పలు ప్రైవేట్ సంస్థలు వెలుస్తున్నాయి. ఆకర్షణీయ ప్రకటనలతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటిలో చేరేముందు ఆ సంస్థకు, బోధించే కోర్సులకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. గుర్తింపు లేకపోతే సమయం, డబ్బు రెండూ వృధా అయినట్లే.
ఇతర మార్గాలు...
నాటికల్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులు చేయనివారు కూడా మర్చంట్ నేవీలో అడుగుపెట్టొచ్చు. ఎం.పి.సి.తో ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు నేరుగా డెక్ కేడెట్లుగా అవకాశం పొందొచ్చు. అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు ఇంజిన్ కేడెట్, ఫిఫ్త్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ హోదాల్లో ప్రవేశం పొందవచ్చు. అయితే నేరుగా డెక్ కేడెట్‌గా అడుగు పెట్టినవారు సంబంధిత నియామక సంస్థ నిర్వహించే ‘ప్రీ-సీ’ శిక్షణకు..ఇంజిన్ కేడెట్‌లో చేరిన వారు మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే తొమ్మిది నెలల ‘ప్రీ-సీ’ శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలి. మర్చంట్ నేవీలో త్వరితంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్వహించే పరీక్షలో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు లభిస్తాయి. ఆ పరీక్షలో విజయం సాధించిన వారికి ‘సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ’ లభిస్తుంది. అభ్యర్థి పదోన్నతుల్లో ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
విధులిలా..
నౌకలోని ప్రయాణికులు, సరుకులకు భద్రత కల్పించడం..పలు దేశాల సముద్ర రవాణా నిబంధనలపై అవగాహన పొంది అందుకు తగిన విధంగా సూచనలివ్వడం డెక్ సిబ్బంది బాధ్యత. సముద్ర యానానికి సంబంధించిన అన్ని పత్రాలను పకడ్బందీగా ఉంచడం సెకండ్ ఆఫీసర్ విధి. లైఫ్‌బోట్స్, అగ్నిమాపక పరికరాలు, సిగ్నలింగ్ పరికరాల బాధ్యతను థర్డ్ ఆఫీసర్ నిర్వర్తించాలి. ఇక..ఇంజిన్ విభాగంలో..నౌకకు సంబంధించి సాంకేతిక నిర్వహణ చేపట్టడం మెరైన్ ఇంజనీర్ల బాధ్యత. చీఫ్ ఇంజినీర్ నేతృత్వం వహించే ఈ విభాగంలో ఇంజిన్లు, బాయిలర్లు, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేటింగ్, డెక్ యంత్రాలను సరిగా ఉంచడం చేస్తారు. నిరంతరం ఇంజిన్ రూమ్ వ్యవహారాలను సెకండ్ ఇంజనీర్... విడిభాగాలు, బాయిలర్స్ వంటి నిర్వహణను థర్డ్ ఇంజనీర్..జనరేటర్ల నిర్వహణను ఫోర్త్ ఇంజనీర్ చేపడతారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడం రేడియో ఆఫీసర్ల బాధ్యత.
ఆకర్షణీయ జీతాలు..
మర్చంట్ నేవీలో అడుగుపెట్టిన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. ప్రారంభ స్థాయిలో నెలకు రూ. 20 వేలు లభిస్తాయి. విదేశీ షిప్పింగ్ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఆ సంస్థలు ప్రారంభంలో నెలకు 15 వేల నుంచి 25 వేల డాలర్లు వేతనం లభిస్తుంది. వీటితోపాటు వేతనంతో కూడిన సెలవు, కుటుంబ సభ్యులతో నౌకా ప్రయాణ సదుపాయం వంటి సౌకర్యాలూ ఉంటాయి. విధుల్లో ఉన్నంత కాలం.. ఉచిత భోజన, వసతి సదుపాయం లభిస్తుంది.
డిమాండ్ అనూహ్యం
ప్రపంచీకరణ నేపథ్యంలో జలమార్గం ద్వారా ఎగుమతి, దిగుమతి విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని పలు షిప్పింగ్ సంస్థలు మర్చంట్ నేవీలో అడుగుపెట్టాయి. కానీ సుశిక్షితులైన సిబ్బంది కొరత వేధిస్తోంది. మరోవైపు విదేశీ షిప్పింగ్ సంస్థలు అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో అభ్యర్థులకు అనూహ్య డిమాండ్. దీన్ని గమనించిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్.. నిబంధనలు సడలించింది. మెరైన్ కోర్సులకు గతంలో 22 ఏళ్లు మాత్రమే ఉన్న కనీస వయో పరిమితిని 25 ఏళ్లకు పెంచింది. నిర్ణీత అర్హతలు లేకున్నా నేరుగా ఉద్యోగమిచ్చే అవకాశాన్ని సంస్థలకు అందించింది. ఆ తర్వాత సంబంధిత శిక్షణనిస్తోంది. మన దేశ అభ్యర్థులకు సింగపూర్, దుబాయ్ షిప్పింగ్ సంస్థల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.