Skip to main content

చిన్నారుల వికాసానికి.. ప్లే స్కూల్ టీచర్‌

బాలలు.. విరిసీవిరియని పసిమొగ్గలు. వారికి విద్యాబుద్ధులు నేర్పడం కత్తిమీద సాములాంటిదే. చిన్నారుల పట్ల సానుభూతితో వ్యవహరించి, అక్కున చేర్చుకొని, ప్రేమను పంచి ఆటపాట నేర్పాల్సి ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గురువులే.. ప్లే స్కూల్ టీచర్లు. మానసికంగా, శారీరకంగా సున్నితంగా ఉండే పసిపిల్లల్లో ప్రాపంచిక పరిజ్ఞానం పెంపొందించే ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. అవకాశాలకు, ఆదాయానికి లోటులేని ఈ వృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఆకర్షణీయమైన వేతనాలు
సాధారణ టీచర్లకు, ప్లే స్కూల్ టీచర్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీరు సాధారణంగా ఐదేళ్లలోపు బాలలకు గురువులు. ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. బుజ్జాయిల మనస్తత్వాలను అర్థం చేసుకొని పనిచేసేవారే ఈ రంగంలో రాణిస్తారు. ప్లే స్కూల్ అంటే ఒకప్పుడు ఎవరికీ అంతగా తెలియని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవి ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. దీంతో వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు డిమాండ్ పెరిగిపోయింది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్లే స్కూళ్లు భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్నారుల గురువులుగా శిక్షణ పొందినవారు వనరులను సమీకరించుకొని, సొంతంగా ప్లే స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

లక్షణాలు: చిన్నపిల్లలకు బోధించే ఉపాధ్యాయులకు అంతులేని సహనం ఉండాలి. బాలల పట్ల ప్రేమ, సానుభూతి తప్పనిసరిగా అవసరం. వారు ఆసక్తి చూపే ఆటలు, పాటల ను పూర్తిగా నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

అర్హతలు: మనదేశంలో ఎర్లీ చైల్డ్‌హుడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసినవారు ప్లే స్కూళ్లలో టీచర్లుగా పనిచేయొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరేందుకు అవకాశం ఉంది. బీఈడీ, ఎంఈడీ చేసినవారు సైతం ప్లే స్కూళ్లలో టీచర్లుగా చేరొచ్చు.

వేతనాలు: ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియార్టీని బట్టి వేతనం పెరుగుతుంది.

ఎర్లీ చైల్డ్‌హుడ్ కోర్సులను ఆఫర్‌చేస్తున్న సంస్థలు
  • ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.andhramahilasabha.org.in
  • ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
    వెబ్‌సైట్:
    www.ignou.ac.in
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
    వెబ్‌సైట్:
    www.ncte-india.org
ఆనందాన్ని పంచే కెరీర్
ప్రస్తుతం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావటం, పోటీవాతావరణంలో ప్లేస్కూల్స్‌కు డిమాండ్ పెరిగింది. సాధారణ టీచర్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారికంటే ఎర్లీ చైల్డ్ హుడ్ కోర్సులు చేసిన వారే... పసిపిల్లల మనసెరిగి పాఠ్యాంశాలను బోధించగలరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆంధ్రమహిళాసభలో మాత్రమే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో పీజీ డిప్లొమా కోర్సు ఉంది. ఇక్కడ ఉన్న 45 సీట్లు మహిళలకు మాత్రమే కేటాయించారు. కోర్సు పూర్తవగానే ప్లేస్‌మెంట్ లభిస్తుంది.
-ఎం.రమ, కోర్సు కో-ఆర్డినేటర్, ఆంధ్రమహిళాసభ బీఈడీ కళాశాల
Published date : 20 Aug 2014 11:51AM

Photo Stories