Skip to main content

భవితకు భరోసా ఇచ్చే వివిధ కెరీర్లు

కెరీర్.. వ్యక్తి వృత్తిగత జీవితానికి పునాది. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ జీవితాన్ని నిర్మించుకోవాలంటే ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలి.
లేకుంటే అవకాశాలను కోరికోరి దూరం చేసుకున్నట్లే! తమ అభిరుచి, నైపుణ్యాలు, లక్ష్యాలు, విలువల ఆధారంగా ఈ ప్రణాళిక ఉండాలి. ఎంచుకున్న రంగంలో ఉజ్వల భవిష్యత్తు అప్పుడే సొంతమవుతుంది.ఈ నేపథ్యంలో యువతకు అద్భుత అవకాశాలు అందిస్తున్న పలు కెరీర్ ఆప్షన్లపై స్పెషల్ ఫోకస్..

హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్) విభాగం.. ఒక సంస్థకు హృదయం లాంటిది. సంస్థ ప్రగతిని పరుగులు తీయించడంలో హెచ్‌ఆర్ మేనేజర్లు కీలకపాత్ర పోషిస్తారు. ఒక సంస్థలో ఉద్యోగులను నియమించుకోవడం, వారి పనితీరును అంచనా వేయడం, అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం, సంస్థ పనితీరును మెరుగుపరిచే వ్యూహాలు రూపొందించడం వంటి విధులను హెచ్‌ఆర్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు.

ప్రవేశం ఎలా?: వర్శిటీలు అందించే ఎంబీఏలో భాగంగా హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో భాగంగా స్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్, పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్, లేబర్ లాస్ తదితర అంశాలను బోధిస్తారు.

అవకాశాలు:
ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్ హౌసెస్, ఎంఎన్‌సీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, ఉన్నత వేతనాలను అందుకోవచ్చు.

బ్యాంకింగ్
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది..
దేశంలో పెద్ద కార్పొరేట్లు(రిలయన్స్, టాటా వంటివి) కొత్త బ్యాంకులు ప్రారంభించేందు కు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం చేసిన దరఖాస్తులపై మూడు, నాలుగు నెలల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి కొత్త బ్యాం కుల ఏర్పాటుకు అనుమతులు మంజూరైతే చాలా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ముఖ్యమైనవి.

నియామక ప్రక్రియ: అన్ని రకాల బ్యాంకుల్లోనూ ప్యూన్ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఉపాధికల్పన కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
  • క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ సాధారణంగా రాత పరీక్షల ద్వారా జరుగుతుంది. ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిర్వహిస్తోంది.
  • విదేశీ బ్యాంకులు మాత్రం పేరొందిన విద్యా సంస్థల (ఐఐఎంలు వంటివి) లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనుభవం ఉన్న వారికి అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా ఆకర్షిస్తున్నాయి.

డెరైక్ట్ రిక్రూట్‌మెంట్: కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమైతే ఆయా బ్యాంక్ లు ఉన్నతస్థాయిలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయి.

వేతనాలు: క్లరికల్ స్థాయి వేతన స్కేలు రూ. 6,200 నుంచి రూ. 19,100 వరకు ఉంటుంది. ప్రస్తుతం అన్ని రకాల అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు రూ. 10 వేల (ఉద్యోగం చేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది.) వరకు ఉంటుంది. పీవోగా బ్యాంకింగ్ రంగంలో బేసిక్ పే నెలకు రూ. 14,500. విధులు నిర్వహించే ప్రదేశం ఆధారంగా ప్రారంభంలో కనీసం రూ. 21,000 వరకు వేతనం లభిస్తుంది.

పదోన్నతులు: క్లర్క్‌గా ఐదేళ్ల అనుభం ఉంటే ఆఫీసర్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా ఐదేళ్లలో జూనియర్ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత జనరల్ మేనేజర్ హోదాను పొందొచ్చు. బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు పదోన్నతుల ద్వారా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి నుంచి మిడిల్ మేనేజ్‌మెంట్, ఆపైన సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరొచ్చు. దీని తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లకు సంబంధించిన ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఒకటో స్కేల్ నుంచి ఏడో స్కేల్ వరకు పదోన్నతులు ఉంటాయి.

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ప్రస్తుతం దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల కొరత ఎక్కువగా ఉంది. వీరికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది.

21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు: సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముంది. ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

మూడు దశలు: సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి.

సీపీటీ: పదో తరగతి ఉత్తీర్ణులు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఐపీసీసీ : సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి.

డిగ్రీతో నేరుగా:
గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో కామర్‌‌స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన వారు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.

ఆర్టికల్స్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు.

ఫైనల్: ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.

అవకాశాలు: సీఏ చేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.

వేతనాలు: కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ. 35 వేల వేతనం లభిస్తుంది.తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ.10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.

డెంటిస్ట్చ్రీ
దంతసిరి బాగుంటే ముఖంపై విరిసే చిరునవ్వు చిరుముత్యమై మెరుస్తుంది.. మనిషి సౌందర్యంలో దంతసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు దంత వైద్యమంటే కేవలం పళ్లకు పట్టిన గారను తొలగించడం, పుచ్చిన పళ్లను తొలగించడానికే పరిమితమైంది. అయితే ఇప్పుడిది లేజర్ సర్జరీలు, టిష్యూ గ్రాఫ్ట్స్, ఇంప్లాంట్స్ వంటి అధునాతన చికిత్సా విధానాలకు విస్తరించింది. మారిన ఆహారపు అలవాట్ల నేపథ్యంలో దంత క్షయం, ఎనామిల్ లాస్ వంటి సమస్యలు అధికమయ్యాయి. మరోవైపు దంత సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో డెంటిస్టులకు డిమాండ్ పెరిగింది.

ఉద్యోగావకాశాలు:
బీడీఎస్ పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంటిస్టులుగా ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. నోటి సంరక్షణ ఉత్పత్తుల కంపెనీల్లోనూ డెంటిస్టులకు అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ వైద్యులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వేతనాలు లభిస్తాయి.
  • సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ స్థిరపడొచ్చు.
  • బీడీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. -యుకే, యూఎస్‌ఏలో బీడీఎస్‌తోపాటు అక్కడ నిర్వహించే పార్టు-1, 2 పరీక్షలు అర్హత సాధిస్తే.. దంత వైద్యంలో ‘డాలర్’ అవకాశాలు సొంతమవుతాయి.

ఉన్నత విద్య:
బీడీఎస్ తర్వాత మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (ఎండీఎస్) పూర్తిచేస్తే కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు ఉంటాయి. ఎండీఎస్ తర్వాత బోధన, పరిశోధనలవైపు అడుగులు వేయొచ్చు.
  • డెంటిస్ట్రీ కెరీర్‌లో రాణించాలంటే ఎప్పటికప్పుడు వైద్య రంగం, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి.

కోర్సుల వివరాలు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బైపీసీని 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు ఎంసెట్‌లో ర్యాంకు సాధించి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్)లో చేరొచ్చు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్
నేటి టెక్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ అనేది ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఉంటూ నవ తరానికి క్రేజీ కెరీర్‌గా నిలుస్తోంది. నాస్కామ్ అంచనాల ప్రకారం దేశంలో ఐటీ సేవల రంగం విలువ 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ క్రమంలో భారీగా ‘సాఫ్ట్’ కొలువుల సృష్టి జరగనుంది.

ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకొస్తున్న యువతలో చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొలువులను చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కష్టానికి తగ్గ కాసుల వర్షం, సమాజంలో గుర్తింపు, సృజనకు అవకాశం ఉండటమే దీనికి కారణాలు.

కెరీర్ అవకాశాలు
సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కెరీర్‌లోకి ప్రవేశించాలంటే కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పరిజ్ఞానం అవసరం.

ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. క్యాంపస్ నియామకాలను అందుకోలేని వారు సబ్జెక్టును అభివృద్ధి చేసుకొని ఆఫ్ క్యాంపస్, వాక్ ఇన్‌ల ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్వర్తించే విధుల్లో కోడింగ్, టెస్టింగ్, నెట్‌వర్కింగ్ వంటి విభాగాలుంటాయి. అభ్యర్థులు తమకిష్టమైన దానివైపు అడుగులు వేయొచ్చు.

వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.25 వేలకు తక్కువ కాకుండా వేతనాలు అందుకోవచ్చు. ప్రతిభను బట్టి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 3-5 ఏళ్ల అనుభవంతో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థాయికి చేరుకోవచ్చు.

నాస్కామ్ అంచనాల ప్రకారం 2020 నాటికి భారతీయ సాఫ్ట్‌వేర్ రంగంలో దాదాపు 3 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

లా (LAW)
ఒకప్పుడు సివిల్ లేదంటే క్రిమినల్ లా కే పరిమితమైన ‘లా’.. ఇప్పుడు మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. యువత ముందు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉంటోంది.

ఇప్పుడు లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఐటీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.

ప్రవేశం ఇలా:
విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండే ‘లా’ కోర్సులో చేరేందుకు రెండు మార్గాలున్నాయి.
అవి:
1. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు.
2. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు.
  • రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు.
కెరీర్ అవకాశాలు: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తయిన తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి, లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది.
  • ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రైబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. వీటికోసం ఆయా రాష్ర్ట ప్ర భుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది.
  • ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొందేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
  • లా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లా) చేయొచ్చు. నెట్, సెట్‌ల్లో అర్హత సాధించి, లా కళాశాలల్లో ఫ్యాకల్టీగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.

వేతనాలు: లా కోర్సులు పూర్తిచేసిన వారికి తాము ఎంపిక చేసుకున్న రంగం ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి.
Published date : 15 May 2015 02:13PM

Photo Stories