Skip to main content

భూవిజ్ఞానంలో బంగారు కెరీర్!

పర్వతాలు ఎలా ఆవిర్భవించాయి? శిలలు ఎలా ఏర్పడ్డాయి? పీఠభూములు, మైదానాల పుట్టుకకు కారణాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘జియాలజీ’ని అధ్యయనం చేయాల్సిందే!
భూమి, అందులోని పదార్థాలు, ఖనిజాలు, ఇంధన వనరులు, భూగర్భ జలాలు, హిమానీనదాలు ఇలాంటి వాటికి సంబంధించిన సమస్త శాస్త్రీయ సమాచారాన్ని జియాలజీ అందిస్తుంది. దేశాలన్నీ శక్తి వనరుల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తుండటం.. ప్రపంచం మొత్తం పర్యావరణం ప్రాధాన్యతను గుర్తించడం.. మౌలిక రంగంలో నిర్మాణాల విసృ్తతి తదితరాల నేపథ్యంలో నేడు జియాలజీలో కెరీర్ కాంతిలీనుతోంది. ఈ తరుణంలో జియాలజీ కోర్సులు, అర్హతలు, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తదితరాలపై ఫోకస్...

భూమికి సంబంధించి లోతైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జియాలజీ అందిస్తుంది. భూమి చరిత్ర, ఎప్పటికప్పుడు అందులో వస్తున్న మార్పులు, అగ్నిపర్వతాలు, నదులు, హిమానీనదాలు, జలవనరులు, జీవుల అవశేషాలు, శక్తి వనరులకు ఆధారాలు.. ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేసే వారిని జియాలజిస్టులుగా చెప్పుకోవచ్చు. జియాలజీ అనేది వివిధ విభాగాల సమాహారం. అవి.. మినరాలజీ (ఖనిజాల అధ్యయనం), పెట్రాలజీ (శిలల అధ్యయనం), స్ట్రక్చరల్ జియాలజీ (భూ నిర్మాణ అధ్యయనం), వోల్కనాలజీ (అగ్నిపర్వతాల అధ్యయనం), జియో మార్ఫాలజీ (భూ స్వరూపాలు, ప్రక్రియలు), పేలియంటాలజీ (శిలాజాల అధ్యయనం).

జియాలజీ-కోర్సులు
  • దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో జియాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో బీఎస్సీ (జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), బీఎస్సీ (జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ (జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ), బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ), వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ గ్రూపుల్లో 10+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుల్లో చేరొచ్చు.
  • బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ-జియాలజీ కోర్సులు చేయొ చ్చు. ఉస్మానియా యూనివర్సిటీ.. ఎంఎస్సీ జియాలజీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఓయూ సెట్ ద్వారా ఇందులో ప్రవేశించొచ్చు. ఆంధ్రాయూనివర్సిటీ కూడా ఎంఎస్సీ జియాలజీ కోర్సును అందుబాటులో ఉంచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం).. ఎంఎస్సీ టెక్ (జియాలజీ) కోర్సు ఆఫర్ చేస్తోంది. బీఎస్సీ (జియాలజీ, మ్యాథమెటిక్స్, నాన్ బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు) పూర్తిచేసినవారు దీనికి అర్హులు. జియాలజీలో కొన్ని విశ్వవిద్యాలయాలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీఎస్సీ+ఎంఎస్సీ)ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. తెలుగు ప్రాంతాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ జియాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ జియాలజీ కోర్సులు చేయొచ్చు. వీటిలో ప్రవేశానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ(జామ్)లో ప్రతిభ చూపాలి.

కోర్సు

ఐఐటీ

ఎంఎస్సీ అప్లయిడ్ జియాలజీ

బాంబే, రూర్కీ

జాయింట్ ఎంఎస్సీ-

పీహెచ్‌డీ (జియాలజీ)

ఖరగ్‌పూర్, భువనేశ్వర్

జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ

(జియోఫిజిక్స్)

ఖరగ్‌పూర్

ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్

డిగ్రీ (అప్లయిడ్ జియాలజీ)

బాంబే


  • ఎంఎస్సీ తర్వాత ఉన్నత విద్య దిశగా వెళ్లాలనుకునే వారికి ఎంటెక్ (జియో ఎక్స్‌ప్లొరేషన్), ఎంటెక్ (పెట్రోలియం జియోసైన్స్) వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటిలో ప్రవేశానికి గేట్ స్కోర్ అవసరం. ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి, పరిశోధన రంగంలో స్థిరపడొచ్చు.

కోర్సు-కరిక్యులం
బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో థియరీ, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యమిస్తూ కరిక్యులం ఉంటుంది. బీఎస్సీలో మినరాలజీ, పెట్రాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, హైడ్రాలజీ, వోల్కనాలజీ, జియో మార్ఫాలజీ, పేలియంటాలజీ తదితర విభాగాలకు సంబంధించిన అంశాలుంటాయి. ఎంఎస్సీ(జియాలజీ) కరిక్యులంలో క్రిస్టలోగ్రఫీ, ఆప్టికల్ మినరాలజీ, ఇగ్నేస్ పెట్రాలజీ, జియోకెమిస్ట్రీ, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ వంటి అంశాలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. జియాలజీ పర్యావరణంతో ముడిపడి ఉంటుంది కాబట్టి కోర్సు కరిక్యులంలో క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టులు తప్పనిసరిగా ఉంటాయి.

కెరీర్ అవకాశాలు
  • జియాలజీ కోర్సులు చేసినవారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఎంఎస్సీ జియాలజీ చేసిన వారికి ఇంజనీరింగ్, కన్సల్టింగ్ సంస్థలు; ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలు, పెట్రోలియం కంపెనీలు, మ్యూజియాలు వంటి వాటిలో ఉన్నత అవకాశాలుంటాయి.
  • యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్టు పరీక్ష ద్వారా జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వంటి వాటిలో జియాలజిస్టు, జియోఫిజిస్ట్, జూనియర్ హైడ్రోజియాలజిస్టు తదితర ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.
  • ఓన్‌జీసీ, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎన్‌ఎండీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయస్థాయి పరీక్షల ద్వారా జియాలజిస్టులను నియమించుకుంటున్నాయి.
  • సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో అర్హత సాధించడం ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) సాధిం చి పరిశోధనలు చేయొచ్చు. లేదంటే బోధనా రంగంలో లెక్చరర్లుగా అడుగుపెట్టొచ్చు. ఇంధన రంగంతో సంబంధమున్న ప్రైవేటు కంపెనీల్లోనూ జియాలజిస్టులకు అవకాశాలు ఉంటాయి.

విదేశాల్లోనూ అవకాశాలు
జియాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా విదేశాల్లోనూ మంచి అవకాశాలుంటున్నాయి. యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, థాయిలాండ్ వంటి దేశాల్లో జియాలజిస్టులకు డిమాండ్ ఉంది. ఆయా దేశాల్లో హైవేలు, విమానాశ్రయాలు, డ్యామ్‌లు, పైపులైన్ల వంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో మౌలిక వసతుల రంగంలో అవకాశాలు పెరిగాయి. చమురు విస్తృతంగా లభించే మధ్య ప్రాచ్య ప్రాంతం జియాలజిస్టులకు స్వర్గధామమని చెప్పొచ్చు.

జాబ్ ప్రొఫైల్స్
జియాలజిస్టుల విధుల్లో ప్రధానమైనవి.. అన్వేషణ, పరిశోధన. వివిధ భూస్వరూపాల గుర్తింపు, ఓ ప్రాంతంలో చమురు, నీరు, ఖనిజాలు, ఇతర ఇంధన వనరులు వంటివి ఎక్కడ ఉన్నాయి? ఎంత లోతులో ఉన్నాయి? వంటి సమాచారాన్ని అన్వేషిస్తారు. మైక్రోస్కోపిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ఓ ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలను పరిశోధించి, సమగ్ర నివేదికలు అందజేస్తారు. అయితే విధుల ఆధారంగా వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి.. మెరైన్ జియాలజిస్టు, మినరాలజిస్టు, జియోహైడ్రాలజిస్టు, హైడ్రోజియాల జిస్టు, పేలియంటాలజిస్టు, సిస్మాలజిస్టు, సర్వేయర్.

అవసరమైన నైపుణ్యాలు
  • ఊహాత్మక(Visualise) శక్తి
  • శాస్త్రీయ/ సాంకేతిక నైపుణ్యాలు, జీఐఎస్
  • అన్వేషణ, విశ్లేషణాత్మక శక్తి
  • స్టాటిస్టికల్, గ్రాఫికల్ సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం
  • రిపోర్ట్-రైటింగ్ స్కిల్స్
  • ఏ ప్రాంతంలోనైనా పనిచేయగల సామర్థ్యం
  • శారీరక, మానసిక సామర్థ్యం

వేతనాలు
ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగంలోని కంపెనీలు జియాలజిస్టులకు ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. పని వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంఎస్సీ-జియాలజీ పూర్తిచేసిన వారికి నెలకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలు ఉంటున్నాయి. స్వీయ సామర్థ్యం, పని అనుభవం, ఉన్నత విద్యార్హతలు, పనిచేసే ప్రాంతం తదితరాల ఆధారంగా జీతభత్యాల్లో పెంపు ఉంటుంది.

జియాలజిస్టులను నియమించుకునే సంస్థలు
  • జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ)
  • సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ)
  • డెరైక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ (డీజీఎం)
  • ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)
  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)
  • ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
  • నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)
  • వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డెహ్రాడూన్)
  • బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)

ఇతర సంస్థలు
  • ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)
  • నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)
  • నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)
  • మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీఎస్)
  • నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)
  • నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)
  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)
  • కెయిర్న్ ఎనర్జీ, రిలయన్స్ ఎనర్జీ తదితర సంస్థలు

టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు
  • ఢిల్లీ యూనివర్సిటీ- ఢిల్లీ
  • ఐఐటీ ఖరగ్‌పూర్ ఐఐటీ బాంబే
  • బెనారస్ హిందూ యూనివర్సిటీ
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ధన్‌బాద్)
  • మహాత్మాగాంధీ యూనివర్సిటీ (కేరళ)
  • యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
  • కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • పంజాబ్ యూనివర్సిటీ
  • ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్)
  • ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం)

ఎంఎస్సీ-జియాలజీతో అపార అవకాశాలు
బీఎస్సీ- జియాలజీతో ఆపేయకుండా ఎంఎస్సీ-జియాలజీ చేయడం ద్వారా కెరీర్ పరంగా మంచి అవకాశాలు పొందొచ్చు. ఎంఎస్సీ అర్హతతో ఏటా యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్టు పరీక్షకు హాజరుకావొచ్చు. ఇందులో ప్రతిభకనబరచడం ద్వారా ఉన్నతస్థాయి ప్రభుత్వ సంస్థలైన జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వంటి వాటిలో జియాలజిస్టు (గ్రూప్ ఏ), జూనియర్ హైడ్రోజియాలజిస్టు (సైంటిస్ట్ బి) తదితర అత్యున్నత ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. ఓన్‌జీసీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎండీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్ ఎనర్జీ వంటి ప్రైవేటు సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో అర్హత సాధించడం ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) సాధిస్తే పరిశోధనలకు అవసరమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. బోధనా రంగంలోనూ అవకాశాలు అపారమని చెప్పొచ్చు.
- ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి, జియాలజీ డిపార్ట్‌మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ.
Published date : 29 May 2015 12:10PM

Photo Stories