Skip to main content

ఆర్థిక సలహాలిచ్చే.. ఎకానమిస్ట్

ప్రపంచంలో మనిషి మనుగడకు ఆక్సిజన్ తర్వాత అవసరమైన ప్రాణ వాయువు.. డబ్బు. భూగోళం సూర్యుడితోపాటు ధనం చుట్టూ తిరుగుతోందనే నానుడి ఉంది. అలాంటి ధనాన్ని, దాని కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే.. అర్థ శాస్త్రం (ఎకనామిక్స్). భూమిపై డబ్బు చెలామణిలో ఉన్నంతకాలం ఆర్థికవేత్తలు కూడా ఉండాల్సిందే. అందుకే ఎప్పటికీ వన్నె తగ్గని కెరీర్‌గా ఎకనామిక్స్ ఆదరణ పొందుతోంది. ఆర్థిక రంగంపై ఆసక్తి ఉన్న యువతను ఆకర్షిస్తున్న సబ్జెక్ట్.. అర్థ శాస్త్రం. డబ్బు, స్థిర చరాస్తులు వంటి విలువైన వనరులను ప్రజలు సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేదే ఎకనామిక్స్.

కార్పొరేట్ రంగం, విద్యా సంస్థల్లో అవకాశాలు
ఎకానమిస్ట్‌లకు దేశ విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవే లేదు. సబ్జెక్టుపై పట్టు, తగిన అనుభవం ఉన్నవారికి కార్పొరేట్ సంస్థలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు ఊపందుకుంటున్నాయి. ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలకు డిమాండ్ పెరుగుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, బ్యాంకులు ఎకనామిస్ట్‌లను సలహాదారులుగా నియమించుకుం టున్నాయి. ప్రభుత్వ రంగంలోనూ ఎన్నో అవకాశాలున్నాయి. బడ్జెట్ల రూపకల్పనలో ఆర్థికవేత్తలదే ప్రధాన పాత్ర. ఆసక్తి ఉంటే బోధనా రంగంలోనూ స్థిరపడొచ్చు. విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్లకు లక్షల్లో వేతనాలు అందుతున్నాయి.

కావాల్సిన స్కిల్స్: ఎకానమిస్ట్‌లుగా వృత్తిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే.. దూరదృష్టి ఉండాలి. అంటే.. భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే నేర్పు అవసరం. ఆర్థిక లావాదేవీలు, సంబంధిత చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. తార్కిక ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. పరిస్థితులను విశ్లేషించేందుకు క్వాంటిటేటివ్, రీజనింగ్ స్కిల్స్ అలవర్చుకోవాలి. వృత్తిలో సవాళ్లను తట్టుకొని నిలిచేందుకు కష్టపడే తత్వం, ఓర్పు అవసరం.

అర్హతలు: ఎకనామిక్స్‌పై మనదేశంలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాతఎకనామిక్స్‌లో బీఏ, ఎంఏ చదవొచ్చు. ఎంఫిల్, పీహెచ్‌డీ కూడా చేస్తే అవకాశాలు మెరుగవు తాయి. జాబ్ మార్కెట్‌లో విలువ పెరుగుతుంది. ఇంటర్మీడియెట్‌లో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కామర్‌‌సపై మంచి పట్టు సాధించి బీఏలో చేరడం ఉత్తమం.

వేతనాలు: ఎకనామిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించినవారికి భారీ వేతనాలుంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఏడాదికి దాదాపు రూ.6 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.10 లక్షలు, ప్రొఫెసర్‌కు రూ.15 లక్షల వేతనం లభిస్తుంది. ఇక కార్పొరేట్ సంస్థల్లో ఎకనామిస్ట్‌కు ప్రారంభంలో ఏడాదికి దాదాపు రూ.7 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.12 లక్షలు అందుకోవచ్చు. సీనియర్ లెవల్‌లో ఉన్నవారి వేతనాలకు ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు.

ఎకనామిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న విద్యా సంస్థలు: 
ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్:
www.osmania.ac.in
యూనివర్సిటీ ఆఫ్ హెదరాబాద్
వెబ్‌సైట్: www.uohyd.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ
వెబ్‌సైట్:
www.andhrauniversity.edu.in
ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్:
www.nagarjunauniversity.ac.in
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్:
www.braou.ac.in
సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(సీఈఎస్‌ఎస్)
వెబ్‌సైట్:
www.cess.ac.in
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
వెబ్‌సైట్:
www.econdse.org

అన్నింటా అర్థ శాస్త్రమే
సామాజిక శాస్త్రాల్లో ఎవర్‌గ్రీన్ సబ్జెక్టు అర్థ శాస్త్రం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆర్థిక నిపుణులు లేనిదే అభివృద్ధి సాధ్యం కాదనేది వాస్తవం. బిజినెస్ స్కూళ్లలో బోధించే ప్రధాన సబ్జెక్టుల్లో ఎకనామిక్స్‌దే అగ్రభాగం. ఇంత క్రేజ్ ఉన్న సబ్జెక్టులో పరిశోధన చేసినవారికి దేశ, విదేశాల్లో మంచి అవకాశాలున్నాయి. బీఏ, బీకాం, బీబీఏ వంటి కోర్సుల్లో స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్, స్టాటిస్టికల్ ఉద్యోగాల ఎంపికలో ఎకానమిస్ట్‌లకు ప్రాధాన్యతనిస్తు న్నారు. బోధన రంగంలోనూ పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసి, నైపుణ్యాలను పెంచుకోగలిగితే ఎవరికీ తీసిపోని విధంగా కెరీర్‌లో ఉన్నతంగా స్థిరపడతారు.
-డాక్టర్ సునంద, హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రమహిళాసభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
Published date : 09 Aug 2014 11:50AM

Photo Stories