Skip to main content

ఐటీ సర్టిఫికేషన్స్.. కెరీర్ వెలుగులు

ఇది డిజిటల్ ప్రపంచం! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వివిధ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఐటీ వినియోగం ఎక్కువైంది. దాంతో సంబంధిత రంగాల్లో ఐటీసర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను చేస్తే మంచి ఉద్యోగాన్ని దక్కించుకున్నట్లే! వీటి ద్వారా సంబంధిత సబ్జెక్టుల్లో అవసరమైన స్కిల్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పరిశ్రమలు, కంపెనీలు కూడా సంబంధిత రంగంలో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు చేసినవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఐటీ సర్టిఫికేషన్ కోర్సులపై ఫోకస్...

స్పెషలైజేషన్
కోర్సులకనుగుణంగా ఐటీ సర్టిఫికేషన్స్‌లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో కంప్యూటింగ్ స్కిల్స్‌ను నేర్పడమే ధ్యేయంగా ఈ కోర్సులు ఉంటున్నాయి. ఉదాహరణకు క్లౌడ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, నెట్‌వర్కింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి. ప్రధానంగా బిజినెస్ సర్టిఫికేషన్ కోర్సుల్లో.. బిజినెస్ ఎనలిటిక్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు ఉంది. ఇవే కాకుండా.. నేడు అందరికీ తెలిసిన ఆన్‌లైన్ షాపింగ్‌లో మెళకువలు తెలుసుకోవడానికి ఈ-కామర్స్; సేవారంగంలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మీడియా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా తమ విద్యా నేపథ్యానికి సరితూగే కోర్సులను, ఆసక్తి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న ఐటీ/ఐటీ బేస్డ్ సర్టిఫికేషన్ కోర్సులను ఎంచుకోవాలి. దీంతోపాటు ఆ కోర్సులను అందిస్తున్న సంస్థల్లో పేరున్న (మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి) వాటిని ఎంచుకోవాలనేది నిపుణుల మాట.

ఇంటర్మీడియెట్ తర్వాత
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక సర్టిఫికేషన్ కోర్సులు చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ).. ఐటీఈఎస్-బీపీవో(కస్టమర్‌కేర్) కోర్సును నిర్వహిస్తోంది. దీని వ్యవధి 100 గంటలు. ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపునకు చెందిన విద్యార్థులైనా అర్హులే. ఇంటి నుంచే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా కంప్యూటర్ బేసిక్స్, హార్డ్‌వేర్, ఆఫీస్ ఆటోమేషన్‌ల గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా కామర్స్ విద్యార్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్‌పై పట్టు పెంచుకోవడానికి ఈ రంగంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను అభ్యసించవచ్చు. అదేవిధంగా సైన్స్ విద్యార్థులు బయోఇన్ఫర్మేటిక్స్‌లోని ముఖ్య అంశాలను గురించి తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఎంతో ఉపయుక్తం.

అందించే సంస్థలు..
ఈ సర్టిఫికేషన్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఎన్‌ఐఈఎల్‌ఐటీ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) వంటి పేరొందిన పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవి.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డీఈఐటీ), కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఐటీలో విద్య, పరిశోధనను పెంపొందింపజేయడం వీటి ప్రధానవిధి. కంప్యూటర్ అప్లికేషన్స్‌కు సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ఎన్‌ఐఈఎల్‌ఐటీ, సీడాక్‌లు అందిస్తున్నాయి. ఐటీ సర్టిఫికెట్స్ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. కంపెనీలు కూడా నిర్దేశిత అంశంలో సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కంపెనీలు.. ఏ సంస్థలైతే మంచి సదుపాయాలతో శిక్షణ అందించి, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతున్నాయో..వాటిని తరచుగా సందర్శించి, తమకు తగినవారిని ఎంపిక చేసుకుంటున్నాయి.

ఇండస్ట్రీ నిర్దేశిత సర్టిఫికేషన్స్
నేడు ప్రతి ఒక్క రంగంలోనూ.. ఆయా అవసరాలకు అనుగుణంగా ఐటీ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ డేటా విశ్లేషణ, ఫ్యాషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌ల నుంచి సేవారంగాలైన హెల్త్‌కేర్, ఈ-కామర్స్ వరకూ.. ఐటీ రంగం విస్తరించింది. కంపెనీలు కూడా అభ్యర్థులు నిర్దేశిత అంశాల్లో, ఐటీ టూల్స్‌లో అవగాహన పొంది ఉండాలని, పూర్తిస్థాయీ పరిజ్ఞానం సాధించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది.

ఫ్యాషన్
నిఫ్ట్-హైదరాబాద్.. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కోర్సును అందిస్తోంది. 10+2 ఉత్తీర్ణులు మొదటి ఏడాది కోర్సులో చేరి ఫ్యాషన్ బిజినెస్‌లో ఐటీ పాత్రను అధ్యయనం చేయొచ్చు.

హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. హెల్త్‌కేర్ రంగంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, ఆస్పత్రి, రోగి ఆరోగ్య నివేదికలు మొదలైనవాటి రూపకల్పనలో ఐటీ ఉపయోగపడుతుంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలను పొందడానికి సీడాక్.. ఆరు నెలల వ్యవధి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అదేవిధంగా ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ రీసెర్చ్‌లో బయోఇన్ఫర్మేటిక్స్‌ది ప్రధాన పాత్ర. ఎన్‌ఐఈఎల్‌ఐటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ‘ఎ’, ‘ఒ’ లెవల్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. 10+2, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు.

అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
కామర్స్ ఉత్తీర్ణులు, వృత్తి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సీడాక్.. డిప్లొమా కోర్సును అందిస్తోంది. కోర్సు వ్యవధి 144 గంటలు. పవర్‌పాయింట్, ట్యాలీ, అవుట్‌లుక్, ఐఎస్‌ఎం అండ్ ఎంఎస్ వర్డ్ వంటివి కరిక్యులంలో ప్రధానంగా ఉంటాయి. రోజువారీ ఆఫీసు విధుల్లో భాగంగా ఈ ఐటీ టూల్స్‌ను ఉపయోగించి పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అన్ని ఆదాయ, వ్యయ పట్టికలను అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర చుకోవచ్చు.

ఈ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్
ఉరుకుల పరుగుల జీవితంలో బయట షాపింగ్‌కు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకునేంత తీరికా, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. దుస్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్‌ఫోన్లు, జ్యుయెలరీ, ఆటబొమ్మలు, గృహోపకరణాలు.. ఇలా ఒకటేమిటి..! ప్రతిదానికీ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడికి సమ యం ఆదా కావడంతోపాటు ఖర్చు కలిసి వస్తుంది. కంపెనీలు కూడా షాప్‌ల ఏర్పాటు, అద్దెలు, మానవ వనరుల ఖర్చులు, నిర్వహణా వ్యయం వల్ల తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌లో నిష్ణాతుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. నేడు సంబంధిత కంపెనీల ఉత్పత్తుల ప్రచారంలో డిజిటల్ మార్కెటింగ్‌దే ప్రధాన పాత్ర. కోర్సులో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? సోషల్ మీడియాను డిజిటల్ మార్కెటింగ్‌కు ఎలా ఉపయోగించుకోవచ్చు? వంటివాటిని తెలియజేస్తారు. దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తద్వారా చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సీడాక్ ఆరు నెలల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ కోర్సును అందిస్తోంది. దీని ద్వారా ఈ-కామర్స్‌లో ఉన్న వివిధ విభాగాల గురించి, ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడం, సైట్ నిర్వహణా నైపుణ్యాలను తెలుసుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ - హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) అభివృద్ధి వల్ల ఎన్నెన్నో కొత్త, కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం- ప్రతి 18 నెలలకు కొత్త కంప్యూటర్ టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. వివిధ రకాలైన కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి రకరకాల సర్టిఫికేషన్ కోర్సులున్నాయి. ఒక్కొక్క టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలంటే దానికి సంబంధించిన కోర్సు చేసి సర్టిఫికేట్ సంపాదిస్తే కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నింటినీ దాదాపుగా ఆయా సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ కంపెనీలే ప్రోత్సహించడం గమనార్హం. ఒక్కొక్క కోర్సు.. ఒక్కొక్క సబ్జెక్టులో లేదా సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్‌లో నిష్ణాతులను చేయడానికి నిర్దేశించింది. ఏ కోర్సు చేయాలన్నా బేసిక్స్‌లో మంచి అవగాహన అవసరం. ఈ కోర్సుల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. వీటికి శిక్షణ ఎక్కడైనా తీసుకోవచ్చు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్ష రాయొచ్చు. ఒకసారి ఏదైనా కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ సంపాదిస్తే దానికి సంబంధించిన ఉద్యోగం రావడం ఖాయం. జీతం కూడా ఎక్కువే. ప్రస్తుతం కనీసం 30 రకాల ఐటీ సర్టిఫికేట్ కోర్సులున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 15 వరకు ఉంటాయి. ఇవన్నీ మంచి ఉద్యోగాన్ని సంపాదించిపెట్టేవే. వాటిని గురించిన వివరాలు..

హార్డ్‌వేర్ కోర్సులు
సిస్కో సర్టిఫైడ్ ప్రొఫెషనల్
సిస్కో అనేది ఒక కంపెనీ. అది కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌కి కావలసిన సామగ్రిని తయారుచేస్తుంది. ప్రపంచంలోనే ఇది అగ్రగామి సంస్థ. నెట్‌వర్కింగ్‌కి కావలసిన స్విచ్‌లు, రూటర్లు, పంచ్‌లు ఈ సంస్థ తయారు చేస్తుంది. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ అనేది మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థకి గుండె వంటిది. ఉదాహరణకు బ్యాంకులు, రైల్వేలు, కరెంటు బిల్లులు కట్టడంలాంటివి అన్నీ కూడా సిస్కో తయారుచేసిన వస్తువులపైనే. వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి చాలామంది నిపుణులు అవసరం. అంతేకాకుండా ఈ రంగంలో నానాటికీ వాడేవాటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుండటం వల్ల నిపుణుల కొరత కూడా ఎక్కువ. అందువల్ల సీసీఎన్‌ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు, మంచి జీతం పొందే అవకాశాలు పుష్కలం.

సెక్యూరిటీ ప్రొఫెషనల్
ప్రధానమైన కోర్సు ఇది. అటు హార్‌‌డవేర్, ఇటు సాఫ్ట్‌వేర్ రెండింటికీ ఉపయుక్తం. మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా జరగాలని కోరుకుంటాం. ఉదాహరణకు మనం ఆన్‌లైన్‌లో డబ్బు ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకొక బ్యాంకు ఖాతాకి ట్రాన్స్‌ఫర్ చేస్తే అప్పుడు అందులో ఏదైనా పొరపాటు జరిగి ఇంకొకరి ఖాతాలో జమ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికోసం కొన్ని పద్ధతులు, సాఫ్ట్‌వేర్ డిజైన్ ఉన్నాయి. అందులో నిష్ణాతులను తయారుచేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. సెక్యూరిటీ అనేది ఎప్పటికీ అవసరమైనది కాబట్టి, భవిష్యత్తులో దాని అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ.

సాఫ్ట్‌వేర్ కోర్సులు
మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్
ఇందులో దాదాపు 15 రకాల కోర్సులున్నాయి. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌లలో నిపుణతను పెంచడానికీ, పరీక్షించడానికీ ఉద్దేశించినవి. వీటిలో ముఖ్యమైనది మైక్రోసాఫ్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఐదింటిలో ఏ కోర్సులో సర్టిఫికేటు పొందినా.. మంచి ఉద్యోగం, జీతం ఖాయం.

ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్
ఇది ప్రధానంగా డేటాబేస్‌కి సంబంధించిన కోర్సు. ఇందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్. రెండోది, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్: ఇది జావా ప్రోగ్రామింగ్ గురించి మంచి అవగాహనను కలిగిస్తుంది. ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: ఒరాకిల్ డేటాబేస్‌లో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాల్లో 20 వరకు వీటిల్లోనే ఉంటున్నాయి.

లైనక్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్
లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే.. ఇది కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన సాఫ్ట్‌వేర్. దీనిలో నైపుణ్యం పొందడానికి కూడా చాలా కోర్సులున్నాయి. ఇందులో ముఖ్యమైనది లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. పెద్దపెద్ద కంప్యూటర్ వ్యవస్థలన్నీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం మీదే పనిచేస్తాయి. ఉదాహరణకు విమానయాన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, అన్ని సెక్యూరిటీ వ్యవస్థలు లైనక్స్ పైనే పనిచేస్తాయి. అందువల్ల ఈ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు అపారం. అంతేకాకుండా మంచి జీతం కూడా పొందొచ్చు.

జావా సర్టిఫైడ్ ప్రొఫెషనల్
జావా అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజీ. ఇది ఇంటర్నెట్ వినియోగంలోకి రావడానికి ప్రత్యేకంగా తయారుచేసిన భాష. ఇది ఫ్లాట్‌ఫారం ఇండిపెండెంట్. అంటే.. ఏ కంప్యూటర్ మీదనైనా దానితో పనిచేయించవచ్చు. అదేవిధంగా ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కూడా. అందువల్ల ఇంటర్నెట్ ఉపయోగించి చేసే ఏ కంప్యూటర్ అప్లికేషనైనా సరే ఇది తప్పనిసరి. అందువల్ల జావా అనేది అన్ని విశ్వవిద్యాలయాల బీటెక్ (సీఎస్‌ఈ)పాఠ్యాంశాలలో విధిగా ఉంటుంది. విద్యార్థులు మరింత లోతైన పరిజ్ఞానం పొందాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులవ్వాల్సిందే. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం ఎంత కష్టమో, ఈ జావా రాకపోతే కంప్యూటర్ కంపెనీల్లో పనిచేయడం కూడా అంతే కష్టం. అందువల్ల ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువ.

ప్రత్యేకమైన కోర్సులు..
ఎస్‌ఏపీ
ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయిన కోర్సు. దీనిని ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అని కూడా అంటారు. ఒక ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాలను అనుసంధానిస్తూ అన్నింటినీ కంప్యూటరీకరణ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు. ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్‌లాంటివి. ఇందులో ఏ ఒక్కదాంట్లోనైనా ప్రావీణ్యం సంపాదిస్తే చాలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని కోర్సుల్లో కష్టమైనదీ, బాగా జీతం వచ్చేదీ ఇదే!

టెస్టింగ్ టెక్
ప్రతి సాఫ్ట్‌వేర్ తయారీలోనూ ఆఖరి భాగం టెస్టింగ్. సాఫ్ట్‌వేర్ తయారుచేసిన తర్వాత దానిని కూలంకషంగా పరీక్షించి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ఇలా పరీక్షించడానికి కూడా కొన్ని సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు ఉన్నాయి. వాటినే టెస్టింగ్ టూల్స్ అంటారు. వీటిని నేర్చుకుంటే ఈ ఫీల్డులో మంచి ఉద్యోగం పొందొచ్చు.

మెయిన్‌ఫ్రేమ్ ట్రైనింగ్
పర్సనల్ కంప్యూటర్లు లేని రోజుల్లో కంప్యూటర్లు చక్కబెట్టే వ్యవహారాలన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌తోనే జరిగేవి. ఇప్పటికీ చాలా వ్యవహారాలకు వీటిని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడానికి, నిర్వహించడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ప్రస్తుతం వీటిని స్పేస్ టెక్నాలజీ వంటి ప్రముఖమైన వాటిల్లో వినియోగిస్తున్నారు. వీటిలో ఉద్యోగాలు బాగున్నా ఎదుగుదల తక్కువ. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. అవన్నీ ఉద్యోగం చేస్తూ మరింత ఉన్నత పదవులు అధిరోహించడానికి ఉపయోగపడేవి. ఈ కోర్సులన్నింటికీ మంచి ఉద్యోగావకాశాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఈ కోర్సుల సర్టిఫికెట్‌తోపాటు బీఈ/బీటెక్ డిగ్రీ కూడా ఉండాలి. అంతేకాకుండా బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి ఉంటే వీటిల్లో ఏ కోర్సు సర్టిఫికేట్ పొందినా మంచి ఉద్యోగం, భవిష్యత్తు, జీతం సొంతమవుతుంది.

కోర్సులు.. అందిస్తున్న సంస్థలు...
Chukani కోర్సులు:
ఒ లెవల్
వ్యవధి:
13 నెలలు
బి లెవల్
వ్యవధి:
14 నెలలు
హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ అండ్ సెక్యూరిటీ
వ్యవధి:
15 నెలలు
ఎ లెవల్
వ్యవధి:
24 నెలలు

ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్
వ్యవధి:
ఆరు నెలలు
సంస్థ: ఎన్‌ఐఈఎల్‌ఐటీ
వెబ్‌సైట్: www.nieltchd.in

ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్
ఈ-కామర్స్
వ్యవధి:
144 గంటలు
ఈఎల్‌ఎస్‌ఐ డిజైన్
హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్
ఆటోమేషన్ అండ్ ఎస్‌సీఏడీఏ సిస్టమ్స్
వ్యవధి:
ఆరు నెలలు, సంస్థ: సీడాక్
వెబ్‌సైట్: www.cdac.in

కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ
వ్యవధి:
16 నెలలు
సంస్థ: నిఫ్ట్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.nift.ac.in

ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్
వ్యవధి:
160 గంటలు
ఒరాకిల్ 10జీ: పీఎల్/ఎస్‌క్యూఎల్
వ్యవధి: 40 గంటలు
సంస్థ: ఎస్‌క్యూఎల్‌ఎస్‌టీఏఆర్
వెబ్‌సైట్: www.sqlstar.com

సీసీఎన్‌ఏ సెక్యూరిటీ
సంస్థ:
సిస్కో సిస్టమ్స్
వెబ్‌సైట్: www.cisco.com

ఎంసీఎస్‌ఏ
సంస్థ:
మైక్రోసాఫ్ట్
వెబ్‌సైట్: www.microsoft.com

సీఎస్‌ఎస్‌ఏ
సంస్థ:
డెల్
వెబ్‌సైట్: accessories.dell.com

ఒరాకిల్ సోలారిస్ 10 సర్టిఫైడ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్
సంస్థ:
ఒరాకిల్
వెబ్‌సైట్: www.oracle.com

ఐబీఎం సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ - టివోలి మానిటరింగ్ వీ6.2.3
సంస్థ:
ఐబీఎం
వెబ్‌సైట్: www.ibm.com

గూగుల్ యాప్స్ అడ్మినిస్ట్రేటర్
సంస్థ:
గూగుల్
వెబ్‌సైట్: certification.googleapps.com
Published date : 27 May 2014 11:54AM

Photo Stories