Skip to main content

AIAPGET 2021: ఏఐఏపీజీఈటీ 2021... ఆయుష్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం

దేశ వ్యాప్తంగా ఆయుష్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏఐఏపీజీఈటీ). ఈ పరీక్ష ద్వారా ఆయుర్వేదం, హోమియోపతి, యూనాని, సిద్ధ(ఆయుష్‌) వంటి విభాగాల్లో పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఏఐఏపీజీఈటీ 2021 పరీక్షను సెప్టెంబర్‌ 18వ తేదీన నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఆయుష్‌ పీజీ కోర్సుల ప్రత్యేకత, అర్హతలు, ప్రవేశ పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం..
AIAPGET 2021 Notification
AIAPGET 2021 Notification

ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యూనాని, సిద్ధ, హోమియోపతి.. వైద్య విధానలన్నింటినీ కలిపి ‘ఆయుష్‌’ కోర్సులుగా పేర్కొంటున్నారు. ఇవి దేశంలో పురాతన వైద్య వి«ధానాలు. వీటిని ప్రకృతి వైద్యం అని కూడా పిలుస్తారు. ఇటీవల కాలంలో ఆధునిక వైద్య విధానాలకు ప్రత్యామ్నాయంగా ఆయుష్‌ వైద్యం వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

అర్హతలు
ఏఐఏపీజీఈటీ 2021కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యా సంస్థ నుంచి బీఏఎంఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.

పరీక్ష విధానం
ఈ పరీక్షను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహాలో 120 ప్రశ్నలకు(ఎంసీక్యూ) టెస్ట్‌ ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోతను విధిస్తారు.

సిలబస్‌
కోర్సులను అనుసరించి బీఏఎంఎస్‌/బీఎస్‌ఎంఎస్‌/బీయూఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

ఆయుర్వేదం
ప్రకృతిసిద్ధంగా లభించే వనమూలికలతోపాటు, జీవన విధానంలో మార్పులుచేర్పులు చేసుకోడం ద్వారా.. రోగాల్ని ఏ విధంగా నయం చేసుకోవచ్చో ఆయుర్వేద కోర్సులో నేర్పిస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, ఆయుర్వేదిక్‌ వ్యవస్థ చరిత్ర, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ, ఈఎన్‌టీ, చర్మం, గైనకాలజీ వంటివి ఆయుర్వేద కోర్సులో భాగంగా నేర్చుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సును చదివిన వారు ఎండీ ఆయుర్వేద కోర్సులో చేరే అవకాశముంది. 

హోమియోపతి
హోమియోపతి వైద్య విధానంలో.. జంతువులు, మొక్కలు, మినరల్స్‌ ద్వారా ఎలాంటి ప్రతికూలతలు లేని మందులను అందిస్తారు. హెర్బాలజీ, నేచురల్‌ థెరపీ, హోమియోపతి పద్ధతులు, ఇతర సాంత్వన చేకూర్చే టెక్నిక్‌లను ఈ కోర్సులో భాగంగా నేర్చుకోవచ్చు. 

యూనానీ
పురాతన వైద్య విధానాల్లో యూనాని ఒకటి. మూలికల ద్వారా సహజసిద్ధంగా రోగం నుంచి కోలుకునేలా చేయడం దీని ప్రత్యేకత. సానుకూల ఆరోగ్యం, వ్యాధుల నివారణ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే రోగ లక్షణాలు, నిర్ధారణ, లేబోరేటరీ సదుపాయాలు తదితరాలు ఎలా ఉపయోగించాలో కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. అరబ్‌ దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన కోర్సు ఇది. 

నేచురోపతి అండ్‌ యోగా సైన్సెస్‌
నేచురోపతి, యోగాసైన్స్‌.. రెండింటి కలయికే ఈ కోర్సు. ఇందులో ప్రావీణ్యత సంపాదించిన వారికి చక్కటి ఆదరణ ఉంది. డైట్, యోగా, వ్యాయామం మొదలైనవి దీనిలో భాగంగా ఉం టాయి. మందులకన్నా సహజసిద్ధంగా రోగాన్ని తగ్గించడంపైనే ఎక్కువగా దృష్టిపెడతారు.

సిద్ధ వైద్యం
సిద్ధ వైద్యం మూలాలు ఎక్కువగా తమిళనాడులో కనిపిస్తాయి. ఈ విధానంలో వ్యక్తి శారీరక పరిస్థితే కాకుండా..మానసిక స్థితికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. అనారోగ్యానికి కారకాలు, నాడి, మూత్రం, కళ్లు, మాట్లాడే విధానం, శరీర రంగును, నాలుకను, జీర్ణక్రియ ప్రస్తుత పరిస్థితిని పరీక్షించడం ద్వారా రోగాన్ని నిర్ధారిస్తారు. 

ముఖ్య సమాచారం
ఏఐఏపీజీఈటీ 2021 పరీక్ష తేది: 18.09.2021
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. 

వెబ్‌సైట్‌: https://aiapget.nta.ac.in

ప్రిపరేషన్‌ ఇలా

  • సెప్టెంబర్‌ 18వ తేదీన ఆయుష్‌ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అంటే..ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి సన్నద్ధమయ్యే వారు ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తిచేసి ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో ఎక్కువగా రివిజన్‌కు కేటాయించాలి.
  • పరీక్షకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవాలి. అలాగే పరీక్ష సమయం, ప్రశ్నల సరళి, ప్రశ్నల సంఖ్య,మార్కింగ్‌ స్కీమ్‌ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • రివిజన్‌కు సంబంధించి టాపిక్‌ వైజ్‌గా సమయం కేటాయించుకోవాలి. 
  • ప్రాక్టీస్‌ పేపర్లు, గత ప్రశ్నపత్రాలను/మాక్‌ టెస్టులను రాయాలి. తద్వారా వేగం పెరుగుతుంది. కచ్చితత్వం మెరుగవుతుంది. అంతేకాకుండా ఏఏ టాపిక్స్‌లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది.
  • ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్‌ సాగించాలి. ఇది పరీక్షలో విజయం చేకూరేలా చేస్తుంది.
Published date : 09 Sep 2021 05:16PM

Photo Stories