Admissions in Central university: సీయూఈటీకి.. సిద్ధం కావాలి ఇలా
సెంట్రల్ యూనివర్సిటీల్లో.. ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష.. సీయూఈటీ. గతమూడేళ్ల కసరత్తుకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ ఎట్టకేలకు.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది! కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పేరిట.. పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సైతం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ) విధి విధానాలు, పరీక్ష తీరుతెన్నులు, అర్హతలు, ఈ పరీక్ష ద్వారా సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశ ప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ...
- అమల్లోకి వచ్చిన సెంట్రల్ వర్సిటీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష
- ఒకే పరీక్షతో 45 సెంట్రల్ వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో అడ్మిషన్
- జూలై మొదటి, రెండో వారంలో ఆన్‌లైన్ విధానంలో సీయూఈటీ
- పదమూడు భాషల్లో పరీక్ష రాసే అవకాశం
- సీయూఈటీ–2022కి మొదలైన దరఖాస్తు ప్రక్రియ
జాతీయ స్థాయిలో 45 సెంట్రల్ వర్సిటీలు.. పదుల సంఖ్యలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు. వాటిలో చేరాలంటే.. ప్రతి యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ జాబితాలో నిలవాలి. ఇందుకోసం విద్యార్థులకు ఎన్నో వ్యయప్రయాసలు. అందుకే కొత్తగా అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే ఒక్క పరీక్ష సీయూఈటీ నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం ఎంతో మేలు చేసే విధానం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. 2022–23 విద్యా సంవత్సరంలో సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష స్కోర్ ఆధారంగా చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్ణయించింది. ఆ దిశగా సీయూఈటీ పరీక్ష నిర్వహణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి అప్పగించింది. దీంతో.. ఎన్‌టీఏ.. సీయూఈటీ–యూజీ పేరుతో ఈ పరీక్ష నిర్వహణ ప్రక్రియ ప్రారంభింది.
ఇంటర్ ఉత్తీర్ణతతో సీయూఈటీ.. కానీ..
సీయూఈటీ రాసేందుకు కనీసం ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. కాని ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత నిబంధనను పలు సెంట్రల్ వర్సిటీలు అమలు చేస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆయా వర్సిటీల ప్రవేశ నిబంధనల గురించి తెలసుకోవాలి.
మొత్తం 45 వర్సిటీలు
ఎన్‌టీఏ తాజా నోటిఫికేషన్ ప్రకారం– సీయూఈటీ–2022 స్కోర్ ఆధారంగా మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి... సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు జేఎన్‌యూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి పలు ప్రముఖ యూనివర్సిటీలకు కూడా సీయూఈటీ స్కోర్ ప్రాతిపదికగా నిలవనుంది.
పదమూడు భాషలు
సీయూఈటీగా పిలుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను పరీక్ష మాధ్యమంగా పేర్కొనాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగు,ఉర్దూ భాషల్లో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
మూడు విభాగాలు.. రెండు స్లాట్లు
- సీయూఈటీ పరీక్షను మొత్తం మూడు విభాగాలుగా.. రెండు స్లాట్లలో నిర్వహించనున్నారు. మొదటి స్లాట్‌ను 3:15 గంటలు; రెండో స్లాట్‌ను 3:45 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా పరీక్ష ఉంటుంది.
- సెక్షన్–1ఎ,1బిల,సెక్షన్–2లలో 50 ప్రశ్నలకుగాను 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు కేటాయిస్తారు.
- సెక్షన్–3 జనరల్ టెస్ట్‌లో 75 ప్రశ్నలకు గాను 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
- ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటాయి.
నచ్చిన స్లాట్ ఎంచుకోవచ్చు
సీయూఈటీ పరీక్షను రెండు స్లాట్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన స్లాట్‌ను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో స్లాట్‌లో కేవలం లాంగ్వేజెస్ విభాగాలు(సెక్షన్–1ఎ, 1బి), డొమైన్ సంబంధిత సబ్జెక్ట్ విభాగం (సెక్షన్–2) మాత్రమే ఉంటాయి. స్లాట్–1లో పేర్కొన్న సెక్షన్–3 (జనరల్ టెస్ట్) స్లాట్–2లో ఉండదు.
ఆసక్తి మేరకు విభాగం
- సీయూఈటీ పరీక్షలో.. మొత్తం మూడు విభాగాల్లో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఏ విభాగానికి హాజరవ్వాలనుకున్నారో దానికి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
- అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ విభాగాలకు హాజరవ్వాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తాము డిగ్రీలో చేరదలచుకున్న కోర్సు ఆధారంగా డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు.
- డొమైన్ సంబంధిత సబ్జెక్ట్స్‌లో.. మొత్తం 27 సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
- మొదటి స్లాట్‌లో గరిష్టంగా రెండు, రెండో స్లాట్‌లో గరిష్టంగా నాలుగు డొమైన్ సంబంధిత సబ్జెక్ట్‌లకు హాజరయ్యే అవకాశం ఉంది.
మొత్తం 9 టెస్ట్‌లకు అవకాశం
- అభ్యర్థులు గరిష్టంగా తొమ్మిది టెస్ట్‌లకు హాజరవ్వచ్చు.
- సెక్షన్–1ఎ, 1బి లాంగ్వేజ్ టెస్ట్‌ల నుంచి రెండు లాంగ్వేజ్‌లు, సెక్షన్–2లో గరిష్టంగా ఆరు డొమైన్ సంబంధిత సబ్జెక్ట్‌లు, సెక్షన్–3 జనరల్ టెస్ట్.
- సెక్షన్–1ఎ,1బిలు కలిపి గరిష్టంగా మూడు లాంగ్వేజ్‌లు,సెక్షన్–2(డొమైన్ సబ్జెక్ట్)నుంచి గరిష్టంగా 5 డొమైన్ సబ్జెక్ట్‌లు, సెక్షన్–3 జనరల్ టెస్ట్.
- అభ్యర్థులు ఈ రెండు విధానాల్లో తమకు ఆసక్తి ఉన్న విధానాన్ని దరఖాస్తు సమయంలో పేర్కొంటే.. దాని మేరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
- అదే విధంగా స్లాట్–1 పరీక్షలో సెక్షన్–1ఎ నుంచి గరిష్టంగా ఒక లాంగ్వేజ్ టెస్ట్, సెక్షన్–2(డొమైన్ సంబంధిత సబ్జెక్ట్)లో గరిష్టంగా రెండు సబ్జెక్ట్‌లు,సెక్షన్–3 జనరల్ టెస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక్కో విభాగానికి 45నిమిషాలు చొప్పున గరిష్టంగా 195 నిమిషాలు (3:15 గంటలు)సమయం అందుబాటులో ఉంటుంది.
- స్లాట్–2లో సెక్షన్–1ఎ, బి నుంచి ఒక లాంగ్వేజ్, సెక్షన్–2లో గరిష్టంగా నాలుగు డొమైన్ సంబంధిత సబ్జెక్ట్ టెస్ట్‌లు లేదా.. సెక్షన్–1ఎ,బి నుంచి రెండు లాంగ్వేజెస్, సెక్షన్–2 నుంచి మూడు డొమైన్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. అంటే.. స్లాట్–2లో అభ్యర్థుల ఆసక్తి మేరకు గరిష్టంగా అయిదు టెస్ట్‌లకు హాజరవ్వచ్చు.
- ఒక్కో టెస్ట్‌కు 45 నిమిషాలు చొప్పున 225 నిమిషాలు (3:45 గంటలు) సమయం ఉంటుంది.
సీయూఈటీ.. పరీక్షించే నైపుణ్యాలివే
- సెక్షన్–1ఎ, 1బి లాంగ్వేజ్‌లలో రీడింగ్ కాంప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్‌లో లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీలలో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్–2లోని డొమైన్ సంబంధిత సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాల ఆధారంగా ఆయా సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్–3 జనరల్ టెస్ట్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
సీయూఈటీ–యూజీ–2022 ముఖ్య సమాచారం
- అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు విధానం: https://cuet.samarth.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 6 నుంచి మే 6 వరకు
- సీయూఈటీ పరీక్ష తేదీ: జూలై మొదటి, రెండో వారంలో
- సీయూఈటీ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in, www.nta.ac.in
విజయం సాధించాలంటే
- సీయూఈటీలో విజయం సాధించాలంటే అ భ్యర్థులు ఇంటర్మీడియెట్,పదో తరగతి స్థాయి అకడమిక్ పుస్తకాలను ఔపోసన పట్టాలి.
- ముఖ్యంగా డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయాలి.
- లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల కోసం సంబంధిత లాంగ్వేజ్‌ల గ్రామర్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా వాక్య నిర్మాణం, ప్రెసిస్ రైటింగ్, ప్యాజేస్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి.
- జనరల్ టెస్ట్ విభాగం కోసం హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. అదే విధంగా కరెంట్ ఈవెంట్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
- క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, టైమ్ అండ్ డిస్టెన్స్,టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ సదుపాయం
అభ్యర్థులకు సీయూఈటీ విధానం, అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన కల్పించేందుకు ఎన్‌టీఏ.. టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ సదుపాయాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాక్టీస్ సెంటర్లలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. తద్వారా సబ్జెక్ట్‌లపై పరీక్షలో అడిగే ప్రశ్నల తీరు గురించి తెలుసుకోవచ్చు.
చదవండి: Job Opportunities: అగ్రికల్చర్ కోర్సులు.. అందించేను అవకాశాలు