Skip to main content

సీఏ-ఇంటర్‌లో రాణించాలంటే...?

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)... నేటి ఆధునిక ఆర్థిక, సాంకేతికపపంచంలో కళ్లు చెదిరే వేతనాలతో కొలువులు అందిస్తూ, వృత్తి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్న కోర్సు! భారతీయ సీఏలకు అంతర్జాతీయంగా అవకాశాలను విస్తృతం చేసే లక్ష్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)..
సీఏ కోర్సు కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018, మే నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఏ కోర్సులోని కీలక దశ అయిన ఇంటర్ పరీక్షలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఏ-ఇంటర్‌లో రాణించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

సీఏ ఇంటర్ పరీక్ష తేదీలు :
గ్రూప్-1:
నవంబర్ 2, 4, 8, 10.
గ్రూప్-2: నవంబర్ 12, 14, 16, 18.

సీఏ ఇంటర్ పరీక్ష విధానం:

గ్రూప్-1

పేపర్ సబ్జెక్టులు మార్కులు వ్యవధి
1 అకౌంటింగ్ 100 3 గం.
2 కార్పొరేట్ లాస్ (60 మా.) ఇతర చట్టాలు (40 మా.) 100 3 గం.
3 కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ 100 3 గం.
4 ఇన్‌కమ్ ట్యాక్స్(60 మా.) ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ (40 మా.) 100 3 గం.

గ్రూప్-2

5 అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ 100 3 గం.
6 ఆడిటింగ్ అండ్ ఎస్యూరెన్స్ 100 3 గం.
7 ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (50 మా.) స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ (50 మా.) 100 3 గం.
8 ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (60 మా.) ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ (40 మా.) 100 3 గం.


సన్నద్ధత...
పేపర్-1 (అకౌంటింగ్) :
  • పరీక్షలో అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు వెయిటేజీ ఎక్కువగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • అవసరమున్న ప్రతి ప్రశ్నకు బ్యాలెన్స్ షీటు తయారు చేయాలి.
  • Partnership Accounts, Amalgamation and Internal reconstruction, Accounts from incomplete Records, Consolidation of financial statements and Branch Accounts చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
పేపర్-2 (కార్పొరేట్, ఇతర చట్టాలు):
  • తప్పు-ఒప్పు, ప్రకటనల ప్రశ్నలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. 8-10 మార్కులకు ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • జనరల్ క్లాజెస్, ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ తదితర చాప్టర్లు విద్యార్థుల ఆలోచనా స్థాయి పరంగా చూస్తే కొంచెం కష్టమైనవి. అయినా వీటిని చాయిస్ కింద వదిలేయకుండా కొంతవరకైనా చదవడం మంచిది.
  • కంపెనీల చట్టం నుంచి గతంలో సరళ ప్రశ్నలు వచ్చేవి. కానీ, ప్రస్తుతం ఈ చట్టానికి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ఆచరణాత్మక ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది.
పేపర్-3 (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్) :
  • మెటీరియల్స్, లేబర్, ఓవర్‌హెడ్స్ వంటి బేసిక్ చాప్టర్లపై పట్టు సాధించడం వల్ల, ఇతర చాప్టర్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాసే సామర్థ్యం లభిస్తుంది.
  • కొత్తగా చేర్చిన Unit costing, ABC costing, Service costing, Marginal costing చాప్టర్లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
పేపర్-4(ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్):
  • ఇటీవల చట్టాలకు జరిగిన సవరణలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటినుంచి 10-15 మార్కులకు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్, టీడీఎస్, టీసీఎస్ తదితర చిన్న చాప్టర్ల నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశమున్నందున వాటిపైనా దృష్టిసారించాలి.
  • జీఎస్‌టీకి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లోని అన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-5 (అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్) :
  • తప్పనిసరిగా అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ను అధ్యయనం చేయాలి. Formats ఉన్న చాప్టర్లలోని అంశాలపై పట్టు సాధించాలి.
పేపర్-6(ఆడిటింగ్ అండ్ అస్యూరెన్స్) :
  • ఇటీవల పరీక్షల్లో ఆడిటింగ్ నుంచి 20 మార్కుల వరకు తప్పు-ఒప్పు ప్రశ్నలు ఇస్తున్నారు. అందువల్ల వీటిపై దృష్టిసారించాలి.
  • SA 701, Audit of Bank తదితర కొత్త అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
  • అన్ని చాప్టర్లలోని ప్రాక్టికల్ ప్రశ్నలను చదవాలనుకునేవారు తొలుత కంపెనీ ఆడిట్-1 నుంచి ప్రారంభించాలి.
పేపర్-7(ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్):
  • ఇందులోని చాలా అంశాలను సీఏ ఫైనల్లోని ఐఎస్‌సీఏ సబ్జెక్టు నుంచి తీసుకున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, నిర్వచనాలు, వ్యత్యాసాలు, తప్పు-ఒప్పుల ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా అధిక మార్కులు పొందొచ్చు.
  • స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చే ప్రశ్నలు తికమక పెట్టేవిగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-8 (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్) :
  • ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో Sources of finance, Scope and objectives of FM వంటి చాప్లర్లలోని థియరీ ప్రశ్నలపై దృష్టిసారించాలి.
  • Circular flows and graph; బొమ్మలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఎఫ్‌డీఐ ఉపయోగాలు, నష్టాలు; అంతర్జాతీయ వాణిజ్య సిద్ధాంతాలు, గాట్, డబ్ల్యూటీవో తదితర అంశాలు ముఖ్యమైనవి.

తార్కిక ఆలోచనా విధానం ముఖ్యం...
 తొలుత ప్రిపరేషన్‌కు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలి. చివరి వరకు దీన్ని అనుసరించాలి. సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచనా విధానం ద్వారా ఏ ప్రశ్నకైనా సులువుగా కచ్చితమైన సమాధానం ఇచ్చేందుకు అవకాశముంటుంది. విద్యార్థులు విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రిపరేషన్ సందర్భంగా వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవడం తప్పనిసరి. అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్‌పై పట్టు చిక్కాలంటే ప్రాక్టీస్ ముఖ్యం.
 - ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్ మాస్టర్ మైండ్స్
 
 ఏకకాలంలో సన్నద్ధతతో...
 నాన్న త్రినాధరావు చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించాను. ఇంటర్మీడియెట్ ఎంఈసీ చదువుతూనే సీఏ-సీపీటీ, సీఎంఏ ఫౌండేషన్‌కు ఏకకాలంలో సిద్ధమయ్యాను. ఒక ప్రణాళిక ప్రకారం సబ్జెక్టులను విభజించుకుంటూ చదవడం వల్ల ఆలిండియా స్థాయిలో టాప్ ర్యాంకులు సొంతమయ్యాయి. సీఏ-సీపీటీలో 4వ ర్యాంకు, సీఎంఏ ఫౌండేషన్‌లో మూడో ర్యాంకు, సీఎంఏ ఇంటర్‌లో 13వ ర్యాంకు, సీఎంఏ ఫైనల్లో రెండో ర్యాంకు సాధించాను.
 - నారాయణచెట్టి ఆకర్ష్, సీఎంఏ ఫైనల్ రెండో ర్యాంకర్.
 
 పోటీతత్వం ప్రధానం :
 సీఎంఏ కోర్సుకు తక్కువ సమయాన్నే కేటాయించినా, పూర్తి ఏకాగ్రతతో చదివాను. సెల్ఫ్ మోటివేషన్‌తో ముందడుగు వేశా. సీఏ కోర్సుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించా. సీఏ ఫైనల్‌ను మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయడంతో పాటు ఆలిండియా 34వ ర్యాంకు సాధించాను. సీఎంఏ ఫైనల్లో ఆలిండియా 4వ ర్యాంకు వచ్చింది. నాలో ఉన్న పోటీతత్వమే టాప్ ర్యాంకులు రావడానికి కారణం. సీఏ వంటి కోర్సుల్లో విజయానికి ఇది చాలా అవసరం.
 - కొల్లూరు సత్యస్వరూప్, సీఏ ఫైనల్ 34వర్యాంకర్, సీఎంఏ ఫైనల్ 4వ ర్యాంకర్.
Published date : 28 Aug 2018 06:04PM

Photo Stories