ఆర్టికల్‌షిప్ ఎక్కడ చేయాలి.. ఎంపిక ఎలా చేయాలో తెలుసుకోండిలా..
ఈ ఆర్టికల్‌షిప్ చేయడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ద్వారా పేరు నమోదు చేయించుకోవాలి. ఆర్టికల్‌షిప్ ఎవరి దగ్గర చేయబోతున్నారు.. ఎప్పటి నుంచి ఆర్టికల్‌షిప్ ప్రారంభించనున్నారు.. తదితర సమాచారాన్ని ఐసీఏఐకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఎంపిక ఇలా..
పెద్ద పెద్ద ఆడిట్ సంస్థల్లో ఆర్టికల్‌షిప్ చేయాలనుకునే విద్యార్థులకు ఆయా సంస్థలు ఇంటర్వూ నిర్వహించి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బడా సంస్థలో ఆర్టికల్‌షిప్ చేయాలనుకునే వారు ఐపీపీసీలోని అన్ని సబ్జెక్టుల ముఖ్యమైన టాపిక్స్‌ను రివిజన్ చేసుకొని ఇంటర్వూకు హాజరవడం మేలు. తద్వారా సబ్జెక్ట్ పరంగా ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమా«ధానాలు ఇచ్చేందుకు వీలవుతుంది. ప్రొఫెషనల్‌గా కనిపించేలా డ్రెసింగ్ ఉండాలి. అలాగే ఇంటర్వూలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. తడబాటు లేకుండా సమాధానాలు చెప్పాలి.
నైపుణ్యాలు నేర్పించే..
ఆర్టికల్‌షిప్ విషయంలో చాలామంది విద్యార్థులు హంగులు, ఆర్భాటం, అద్దాల బిల్డింగ్‌లను చూసి ఆయా సంస్థల్లో అర్టికల్‌షిప్ వైపు ఆకర్షితులవుతారు. కానీ సంస్థ చిన్నదైనా,పెద్దదైనా..నైపుణ్యాలు అందేలా శిక్షణ ఇస్తారా లేదా అనేది చూడాలి. కాబట్టి ఆర్టికల్‌షిప్‌కు సంబంధించి ఆడిట్ సంస్థను ఎంపిక చేసుకునే ముందు.. ఆయా సంస్థ క్లయింట్స్.. అక్కడ వృత్తిపరమైన నైపుణ్యాలు.. అన్ని రకాల ఆడిటింగ్ స్కిల్స్ నేర్పిస్తారా.. క్షేత్ర స్థాయి విధుల్లో అవకాశం కల్పిస్తారా.. తదితర విషయాలను తెలుసుకొని ముందడుగు వేయాలి.
బదిలీ నిబంధనలు..
ఐసీఏఐ.. ఆర్టికల్‌షిప్ చేసే ఆడిట్ సంస్థ బదిలీ, మార్పు ప్రక్రియను కఠినతరం చేసింది. ఆర్టికల్‌షిప్ సమయంలో మొదటి ఏడాది మాత్రమే సదరు సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీకి అనుమతిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆర్టికల్‌షిప్ సంస్థ ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దీనికోసం ఇంతకుముందు ఆర్టికల్‌షిప్ చేసిన వారి సలహాలు, నిపుణుల సహాయం తీసుకోవాలి.
సహనం..
ఆర్టికల్‌షిప్ చేసే విద్యార్థులు.. వివిధ రకాల వ్యక్తులు, బృందాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో చక్కటి పనితీరును ప్రదర్శించాలి. చిన్న, మధ్య తరహా సంస్థలో ఆర్టికల్‌షిప్ చేసే విద్యార్థులు.. అన్ని రకాల ఆడిట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పని భారంగా, ఒత్తిడిగా భావించకూడదు. సహనంతో పనిచేస్తేనే అన్ని అంశాలపై మంచి పట్టు, అవగాహన లభిస్తుంది.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్..
రెండేళ్ల సీఏ ఆర్టికల్‌షిప్ పూర్తిచేసిన విద్యార్థులు.. ఆసక్తి ఉంటే.. చివరి ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ద్వారా కార్పొరేట్ వర్క్ కల్చర్ గురించి తెలుస్తుంది. భవిష్యత్తులో కెరీర్‌కు ఇది ఉపయోగపడుతుంది.
ఇంకా చదవండి: part 3: సీఏ ఫైనల్స్‌కు ఇప్పటి నుంచే ప్రిపేర్.. పరిశీలనతోనే అవగాహన పెంచుకోండిలా..!