Skip to main content

వ్యవసాయం-అనుబంధ రంగాలు సుసంపన్న కెరీర్‌కు దారిచూపే కోర్సులు..

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (హైదరాబాద్); శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (తిరుపతి); డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (వెంకటరామన్నగూడెం) పరిధిలోని కళాశాలల్లో బైపీసీ విభాగపు కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రకటన విడుదలైంది. బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)/బీఎస్సీ (సీఏ అండ్ బీఎం)/బీఎఫ్‌ఎస్సీ కోర్సుల్లో చేరడానికి ఉద్దేశించిన ఈ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ వివరాలు, కోర్సులకు సంబంధించిన కెరీర్ తదితరాలపై ఫోకస్...

హైదరాబాద్‌లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. వెటర్నరీ, వ్యవసాయ, ఉద్యానవన, ఆహార సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కౌన్సెలింగ్‌కు సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కళాశాలలకు ఉమ్మడిగా నిర్వహించే ఈ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. రోజూ కౌన్సెలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొదటి విడత ఉదయం 9.30కు, రెండో విడత మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ఏయూ, ఓయూ, ఎస్‌వీయూ రీజియన్ల వారీగా రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

15 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు:
బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో 15 శాతం సూపర్ న్యూమరరీ సీట్లను ఎన్జీ రంగా వర్సిటీ నుంచి రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసిన వారికి కేటాయించారు. అగ్రీసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీచేస్తారు. వీటికి అక్టోబర్ 1న కౌన్సెలింగ్ జరుగుతుంది. అర్హులైన, ఔత్సాహిక ఎంపీసీ అభ్యర్థులు వాకి-ఇన్-కౌన్సెలింగ్ ద్వారా బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (60 సీట్లు), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ (18 సీట్లు), బీఎస్సీ సీఏ అండ్ బీఎం (7 సీట్లు) కోర్సుల్లో చేరొచ్చు. ఇవి కేవలం రైతుల కోటాకు సంబంధించినవి. కౌన్సెలింగ్ అక్టోబర్ 6న నిర్వహిస్తారు.

కోర్సులు- కెరీర్ అవకాశాలు
బీఎస్సీ అగ్రికల్చర్
ఎనిమిది కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 700 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. 40 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు.

కరిక్యులం: క్రాప్ ఫిజియాలజీ, ఇరిగేషన్ మేనేజ్‌మెంట్, సోయిల్ సైన్స్, ఫార్మ్ మెషినరీ, సీడ్ టెక్నాలజీ, చీడపీడల నిర్వహణ, ఆర్గానిక్ ఫార్మింగ్, హార్టికల్చరల్ క్రాప్స్, లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ తదితరాలకు సంబంధించిన అంశాలను బోధిస్తారు.

కెరీర్ అవకాశాలు: కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ విభాగాలు; బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు; ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సంస్థలు; అగ్రీ బయోటెక్ సంస్థలు; వ్యవసాయ విద్యను అందిస్తున్న సంస్థలు, పరిశోధన సంస్థలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి.

వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా జీతాలుంటాయి.

ఉన్నత విద్య: వివిధ స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్) చేయొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.

బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్)
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్ (హైదరాబాద్)లో బీఎస్సీ (సీఏ అండ్ బీఎం) కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. వ్యాపార స్థాయిలో చేసే వ్యవసాయానికి (అగ్రీ బిజినెస్) అవసరమయ్యే నైపుణ్యాలను కోర్సులో భాగంగా విద్యార్థి అందిస్తారు. వివిధ వ్యవసాయ పరిశ్రమలలో కెరీర్‌ను ప్రారంభించేందుకు పునాదులు వేస్తుంది.

కరిక్యులం: వ్యాపారం, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లకు సంబంధించిన ప్రాథమిక అంశాలు- వ్యవసాయ రంగానికి వీటి అనువర్తనాలు; సహజ వనరుల నిర్వహణ; లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను బోధిస్తారు. మొత్తంమీద అభ్యర్థులను అగ్రీ బిజినెస్ మేనేజర్లుగా తీర్చిదిద్దేలా కరిక్యులం ఉంటుంది.

కెరీర్ అవకాశాలు: బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వ్యవసాయ బీమా కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది.

ఉన్నత విద్య: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ తదితర స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ చేయొచ్చు.

బీటెక్ ఫుడ్ టెక్నాలజీ
అందరికీ నాణ్యమైన, పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలంటే.. ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు.. కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల; కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందులలో అందుబాటులో ఉంది. మొత్తం 45 సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.

కరిక్యులం: ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్, ఫుడ్ కెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ బయో టెక్నాలజీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఐటీ అప్లికేషన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ తదితర అంశాలుంటాయి.

కెరీర్: బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం శుద్ధి చేసి, నిల్వ చేసిన ప్యాకేజింగ్ ఆహారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఫుడ్ టెక్నాలజిస్టులకు అవకాశాలు పెరిగాయి. హోటల్ పరిశ్రమలో వీరికి డిమాండ్ అధికంగా ఉంది. పరిశోధన సంస్థల్లోనూ, విద్యా సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

వేతనాలు: ప్రారంభంలో రూ.15 వేల వరకూ వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు.

ఉన్నత విద్య: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) పూర్తిచేశాక ఎంటెక్/ ఎంఎస్ చేయొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా వెళ్లొచ్చు. న్యూట్రిషన్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్
ప్రపంచీకరణ ఫలితంగా మన దేశ ఫలసాయానికి విదేశాల్లో విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయి. సాగు విధానాల్లోనూ ఆధునికత సంతరించుకోవడంతో సీజన్‌తో సంబంధం లేకుండా హార్టికల్చర్ ఏడాది పొడవునా ఉత్పత్తులను నమోదు చేస్తోంది. అయితే నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఫలసాయం రావాలంటే దానికి సంబంధించిన సాంకేతిక మెలకువలు తెలిసిన అభ్యర్థులు కావాలి. అలాంటి మెలకువలను బోధించే లక్ష్యంతో ప్రారంభించిన కోర్సు.. హార్టికల్చర్ సైన్స్. మొత్తం నాలుగు కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్ కోర్సులో 210 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అవకాశాలు: వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్‌వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.10వేల వేతనం వస్తుంది. ప్రభుత్వ రంగంలో హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్లు, ఆఫీసర్ తదితర హోదాలు పొందొచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లాలనుకుంటే సొంతంగా నర్సరీలు, ఫార్మ్ సెంటర్లను నెలకొల్పవచ్చు.

బీవీఎస్సీ అండ్ ఏహెచ్
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్).. మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా డాక్టర్ కలను తీర్చే కోర్సు. దీంతో ఈ కోర్సును అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. ఐదు కాలేజీల్లో 240 వరకు సీట్లున్నాయి.

కరిక్యులం: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో 18 అంశాల్లో బోధన ఉంటుంది. ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, గైనకాలజీ, జెనెటిక్స్ తదితర అంశాలను చదవాలి. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కేవలం జంతు సంరక్షణనే కాకుండా... పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తారు.

అవకాశాలు: క్లినికల్ విభాగంతో పాటు పరిశోధన, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్ తదితర రంగాల్లో అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ. 45 వేల వేతనం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు.

బీఎఫ్‌ఎస్సీ
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-ముతుకూరు (నెల్లూరు జిల్లా)లో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ) కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో సీట్ల సంఖ్య 30. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.

కెరీర్ అవకాశాలు: మత్స్య నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో చేపల పెంపకం, పోషణ, వాటికి వచ్చే వ్యాధులు, జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రాసెసింగ్, మేనేజ్‌మెంట్ తదితర అంశాలను బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ యూనిట్స్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్, ఫిషింగ్ గీయర్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో వివిధ హోదాలను అందుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి బ్యాచిలర్ తర్వాత పీజీ (ఎంఎఫ్‌ఎస్సీ) కోర్సు చేయవచ్చు.
వ్యవసాయ కోర్సులతో ఉజ్వల అవకాశాలు
Bavitha అగ్రికల్చర్, అనుబంధ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధిపరంగా, ఉన్నత విద్య పరంగా అవకాశాలు బాగున్నాయని చెప్పొచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ మందులు, విత్తన సంస్థలు తదితరాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా అర్హులు. స్పెషలిస్టు ఆఫీసర్స్ నియామకాలకు సంబంధించి బ్యాంకులు తరచూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. వీటిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులను ముఖ్యంగా క్రెడిట్ ఆఫీసర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకోవచ్చు. నాబార్డ్‌లో ప్రవేశిస్తే వృత్తిపరంగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. స్వయం ఉపాధి దిశగా వెళ్లాలనుకునే వారు సొంత సంస్థలు ఏర్పాటు (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) చేసుకోవచ్చు. వ్యవసాయ మార్కెటింగ్ రంగంలోనూ అద్భుత అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద చెప్పాలంటే అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు పూర్తిచేసిన వారిలో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండటం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ (అగ్రికల్చర్) పూర్తిచేసి పరిశోధన రంగం దిశగా వెళ్లి, ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
Published date : 26 Sep 2014 12:48PM

Photo Stories