Skip to main content

వ్యవసాయ కోర్సులు.. విజ్ఞాన వీచికలు...

వ్యవసాయం, అనుబంధ రంగాలు.. దేశంలో అత్యధిక మందికి జీవనాధారాలు! దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి అసలు సిసలైన సోపానాలు! పొలాన అన్నదాత ‘పంట’ పండితేనే అందరికీ ఆహార భద్రత లభిస్తుంది.. ఆ పంట పండాలంటే మెరుగైన సాగు పద్ధతులు అవలంబించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చేరువ కావాలి! అందుకే నేడు కర్షక లోకానికి వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే మానవ వనరులకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి మానవ వనరులను మార్కెట్‌కు అందించే కోర్సుల్లో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఒకటి...

గ్రామ సీమల్లోని యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోనూ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. ఇవి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా.

విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌ల వివరాలు
పాలిటెక్నిక్ జిల్లా సీట్లు
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ మహబూబ్‌నగర్ 60
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కరీంనగర్ 60
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ విశాఖపట్నం 60
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ పశ్చిమగోదావరి 60
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ నెల్లూరు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ అనంతపురం 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ వైఎస్‌ఆర్ కడప 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ అనంతపురం 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కృష్ణా 40
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ నల్లగొండ 45
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ మెదక్ 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ వరంగల్ 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కర్నూలు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ చిత్తూరు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ గుంటూరు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ విశాఖపట్నం 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ ఖమ్మం 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ (బాలికలు) మెదక్ 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ నెల్లూరు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ చిత్తూరు 25
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ (బాలురు) తూర్పుగోదావరి 25
  • విశ్వవిద్యాలయ విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌లు రెండున్నాయి. వీటిలో మొత్తం 85 సీట్లున్నాయి.
  • యూనివర్సిటీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్‌లు మూడున్నాయి. వీటిలో మొత్తం 90 సీట్లున్నాయి.
పైవేటు పాలిటెక్నిక్‌లు
  • 17 వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, మూడు విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌లు, 8 అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.
మొత్తం సీట్లు
కోర్సు ప్రభుత్వ సీట్లు (యూనివర్సిటీ) ప్రైవేటు సీట్లు
వ్యవసాయ డిప్లొమా 700 1010
విత్తన సాంకేతిక పరిజ్ఞానం డిప్లొమా 85 150
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా 90 240
అర్హత
అభ్యర్థులు వారి పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాలలోని (నాన్ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివి ఉండాలి. దీనికి గాను దరఖాస్తుతో పాటు ఉన్న ఫారం 1ను వారు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయునితో ధ్రువపరచుకోవాలి.
  • పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు మాత్రమే అర్హులు. పదో తరగతి కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్‌లో తప్పిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఉత్తీర్ణులు, ఆపై చదువులు చదివిన వారు అనర్హులు.
  • అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 5 గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 4 జీపీఏ ఉండాలి.
పవేశాలు
గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ సమానంగా ఉంటే సబ్జెక్టులలో వచ్చిన గ్రేడ్ పాయింట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
  • వయసు: డిప్లొమాలో చేరబోయే అభ్యర్థి వయసు 31.8.2014 నాటికి 15-22 ఏళ్ల మధ్య ఉండాలి.
  • బీసీలకు 29 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • ఫీజులు: ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రవేశార్హత పొందిన వారు ఏడాదికి సుమారు రూ.6,915 చెల్లించాలి. ప్రైవేటు పాలిటెక్నిక్‌లో ప్రవేశార్హత పొందిన వారు రూ.29 వేలు చెల్లించాలి.
కోర్సు కాల వ్యవధి
  • వ్యవసాయ డిప్లొమా, విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. మూడేళ్ల కాలపరిమితిలో కోర్సు పూర్తిచేయాలి.
  • అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కాలవ్యవధి మూడేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. నాలుగేళ్ల కాలపరిమితిలో కోర్సు పూర్తిచేయాలి.
  • వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞాన కోర్సులు తెలుగు మాధ్యమంలో నడుస్తున్నాయి. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
కరిక్యులం
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్: సేద్య విజ్ఞాన శాస్త్ర విభాగ సూత్రాలు; నేల రసాయన శాస్త్రం- సారవంతత; యంత్ర పరికరాలు; పంట ఉత్పత్తి; విత్తనోత్పత్తి; ఎరువులు; పంటల చీడలు-యాజమాన్యం; వ్యవసాయ సహకారం, విత్తం, క్రయవిక్రయాలు వంటి అంశాలు ఉంటాయి.
  • డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ: విజ్ఞాన శాస్త్ర విభాగ సూత్రాలు; పంట ఉత్పత్తి; కణ జీవశాస్త్రం, జన్యు శాస్త్రం, వృక్ష ప్రజననం ప్రాథమిక అంశాలు; నేల సారవంతత, ఎరువులు; విత్తనోత్పత్తి సూత్రాలు; క్షేత్ర, కూరగాయల పంటల విత్తనోత్పత్తి; విత్తన శాసన నిర్మాణం, ధ్రువీకరణ; పండ్లు, పుష్పాలు, తోట పంటల విత్తనోత్పత్తి; విత్తన నాణ్యత పరీక్ష; విత్తనాల ప్రాసెసింగ్; విత్తన నిల్వ.
  • అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా: ఇంజనీరింగ్ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అన్వయించేదే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్.ఇందులో వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు, ఇంజనీరింగ్ వనరుల నిర్వహణ, సాగునీటి నిర్వహణ, వాతావరణ విజ్ఞానం, ఫుడ్ ఇంజనీరింగ్, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, నిల్వ తదితరాలకు సంబంధించి అంశాలు కరిక్యులంలో ఉంటాయి.
కెరీర్
దేశంలో ఆహార భద్రత సవాలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని బాగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను నేర్చుకునే వారికి కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయ క్షేత్రాలు, టీ గార్డెన్లు, రబ్బర్ ప్లాంటేషన్లలోనూ అవకాశాలుంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు.
  • వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాల తయారీ కేంద్రాల్లోనూ ఉద్యోగాలుంటాయి. పాడి పరిశ్రమ, ఫిషరీస్, సెరీ కల్చర్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు.
  • ఉన్నత విద్య: అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సు చేయొచ్చు. దీనికోసం ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏటా అగ్రిసెట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఉన్న మొత్తం సీట్లు 105. వీటిలో అగ్రికల్చరల్ డిప్లొమా వారికి 95, సీడ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తిచేసిన వారికి 10 సీట్లు కేటాయించారు.
  • పాలిటెక్నిక్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 2, 2014.
  • వెబ్‌సైట్: www.angrau.ac.in
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (హైదరాబాద్), శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (తిరుపతి), డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ (వెంకట రామన్నగూడెం, పశ్చిమగోదావరి) పరిధుల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో ఎన్‌జీ రంగా వర్సిటీ పరిధిలోని కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్..

బీఎస్సీ అగ్రికల్చర్
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని ఎనిమిది కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 700 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. 40 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు.
అర్హత, ప్రవేశాలు: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/ నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంసెట్-2014 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కరిక్యులం: క్రాప్ ఫిజియాలజీ, ఇరిగేషన్ మేనేజ్‌మెంట్, సోయిల్ సైన్స్, ఫార్మ్ మెషినరీ, సీడ్ టెక్నాలజీ, చీడపీడల నిర్వహణ, ఆర్గానిక్ ఫార్మింగ్, హార్టికల్చరల్ క్రాప్స్, లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ తదితరాలకు సంబంధించిన అంశాలను బోధిస్తారు.
కెరీర్ అవకాశాలు: కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ విభాగాలు; వ్యవసాయం ఆధారంగా పనిచేస్తున్న ఆర్థిక సంస్థలు; బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు; ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సంస్థలు; అగ్రీ బయోటెక్ సంస్థలు; వ్యవసాయ విద్యను అందిస్తున్న సంస్థలు, పరిశోధన సంస్థలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా జీతాలుంటాయి.
ఉన్నత విద్య: వివిధ స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్) చేయొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.

బీఎస్సీ (అగ్రికల్చర్) 2013-14 కటాఫ్ ర్యాంకులు

Bavitha

బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్):
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్ (హైదరాబాద్)లో బీఎస్సీ (సీఏ అండ్ బీఎం) కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. వ్యాపార స్థాయిలో చేసే వ్యవసాయానికి (అగ్రీ బిజినెస్) అవసరమయ్యే నైపుణ్యాలను కోర్సులో భాగంగా విద్యార్థి అందిస్తారు. వివిధ వ్యవసాయ పరిశ్రమలలో కెరీర్‌ను ప్రారంభించేందుకు పునాదులు వేస్తుంది.
అర్హత, ప్రవేశాలు: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంసెట్-2014 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కరిక్యులం: వ్యాపారం, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లకు సంబంధించిన ప్రాథమిక అంశాలు- వ్యవసాయ రంగానికి వీటి అనువర్తనాలు; సహజ వనరుల నిర్వహణ; లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను బోధిస్తారు. మొత్తంమీద అభ్యర్థులను అగ్రీ బిజినెస్ మేనేజర్లుగా తీర్చిదిద్దేలా కరిక్యులం ఉంటుంది.
కెరీర్ అవకాశాలు: బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వ్యవసాయ బీమా కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది.
ఉన్నత విద్య: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ తదితర స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ చేయొచ్చు.

బీటెక్ ఫుడ్ టెక్నాలజీ:
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2010-12 మధ్య కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషహాకార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య 85 కోట్లు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే భారత్‌లో ఏటా రూ.58 వేల కోట్ల విలువైన ఆహారం వృథా అవుతోంది. ఆహార శుద్ధికి, నిల్వకు, మార్కెటింగ్‌కు సరైన సౌకర్యాలు లేకపోవడం దీనికి కారణం. ఇలాంటి పరిస్థితిలో అందరికీ నాణ్యమైన, పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలంటే.. ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు.. కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల; కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందులలో అందుబాటులో ఉంది. మొత్తం 45 సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
అర్హత, ప్రవేశాలు: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంసెట్-2014 ర్యాంకు ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కరిక్యులం: ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్, ఫుడ్ కెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ బయో టెక్నాలజీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఐటీ అప్లికేషన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ తదితర అంశాలుంటాయి.
కెరీర్: బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం శుద్ధి చేసి, నిల్వ చేసిన ప్యాకేజింగ్ ఆహారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఫుడ్ టెక్నాలజిస్టులకు అవకాశాలు పెరిగాయి. హోటల్ పరిశ్రమలో వీరికి డిమాండ్ అధికంగా ఉంది. ఆహార పదార్థాల తయారీ, ఆహార నాణ్యత విభాగాల్లో అవకాశాలు పుష్కలం. ఆహార శుద్ధి, నిల్వ, ప్యాకేజింగ్ పరిశ్రమల్లోనూ ఉద్యోగాలుంటాయి. పరిశోధన సంస్థల్లోనూ, విద్యా సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
వేతనాలు: ప్రారంభంలో రూ.15 వేల వరకూ వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు.
ఉన్నత విద్య: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) పూర్తిచేశాక ఎంటెక్/ ఎంఎస్ చేయొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా వెళ్లొచ్చు. న్యూట్రిషన్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

పని అనుభవంతో మెరికలుగా విద్యార్థులు
అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యముంటుంది. చివరి ఏడాది కరిక్యులంలోని రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ (ఆర్‌ఏడబ్ల్యూఈపీ) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి రైతులతో మమేకమై పొందే క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దుతోంది. అదే విధంగా విద్యార్థిని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా తీసుకెళ్లేందుకు అగ్రికల్చరల్ ఎక్స్‌పీరిఎన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (ఏఈఎల్‌పీ) ఉపయోగపడుతుంది. దీనిద్వారా వాస్తవ పరిస్థితుల్లో ఓ అగ్రీ బిజినెస్ యూనిట్‌ను నడపడానికి అవసరమైన నైపుణ్యాలు, పని అనుభవం విద్యార్థికి సొంతమవుతాయి. ఇలా ఉన్నత ప్రమాణాలతో నడుపుతున్న ఏజీ బీఎస్సీ కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్య పరంగా అవకాశాలు బాగున్నాయని చెప్పొచ్చు. బ్యాంకులు; ఎరువులు, పురుగు మందులు, విత్తన సంస్థల్లో అపార అవకాశాలు లభిస్తున్నాయి.
- డాక్టర్ జి.సుబ్బయ్య, అసోసియేట్ డీన్,

అగ్రికల్చరల్ కాలేజీ, బాపట్ల.
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ (హోంసైన్స్); బీఎస్సీ ఆనర్స్ (ఫ్యాషన్ టెక్నాలజీ); బీఎస్సీ ఆనర్స్ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 10, 2014.
వెబ్‌సైట్: www.angrau.ac.in

బీఎస్సీ ఆనర్స్ (హోంసైన్స్):
గృహ, కుటుంబ జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్రం.. హోంసైన్స్! ఈ ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలు.. వాటికి శాస్త్రీయ పరిష్కారాలను ‘హోంసైన్స్’ వివరిస్తుంది. నాణ్యమైన జీవితానికి అవసరమైన వనరులను సమీకరించుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం వంటి నైపుణ్యాలను పెంపొందించడం కోర్సు ప్రధాన లక్ష్యం. మహిళలను స్వయం ఉపాధి కల్పన దిశగా నడిపించి, వారి అభివృద్ధికి కృషిచేయడంలో కోర్సు విజయవంతమైంది.
మహిళలకు ప్రత్యేకం: వర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ (సైఫాబాద్, హైదరాబాద్), కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ (నల్లపాడు, గుంటూరు జిల్లా) కోర్సును అందిస్తున్నాయి. మొత్తం సీట్లు 130. నాలుగేళ్ల వ్యవధిగల హోంసైన్స్ కోర్సుకు మహిళలు మాత్రమే అర్హులు.
అర్హతలు: ఇంటర్లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. హోంసైన్స్ మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులు పది శాతం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తికావాలి. గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు; శారీరక వికలాంగులకు 27 ఏళ్లు.
ప్రవేశాలు: ఇంటర్ గ్రూపులో ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

స్పెషలైజేషన్స్: అపెరల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్; ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఈసీసీడీ ప్రోగ్రామ్స్; ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ స్పేస్ డిజైన్.

కెరీర్: హోంసైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు; డైట్ కౌన్సెలింగ్ కేంద్రాలు, విద్యా సంస్థలు;పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లతో పీజీ చేయొచ్చు.

బీఎస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ:
నాలుగేళ్ల కాల వ్యవధి గల బీఎస్సీ (ఆనర్స్) ఫ్యాషన టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ (సైఫాబాద్, హైదరాబాద్) అందిస్తోంది. పురుషులు, మహిళలూ ఇద్దరూ అర్హులు.
అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. పాలిటెక్నిక్‌లో హోంసైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. మొత్తం 40 సీట్లలో 20 సీట్లను ఇంటర్ వొకేషనల్ (కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్-సీజీడీఎం) చేసిన వారికి కేటాయించారు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కరిక్యులం: గార్మెంట్ కన్‌స్ట్రక్షన్; టెక్స్‌టైల్ సైన్స్; ఫ్యాషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్; ఫ్యాషన్ ఇన్నోవేషన్స్; అపరెల్ డిజైనింగ్ తదితర అంశాలుంటాయి.
కెరీర్: కోర్సును పూర్తి చేసిన వారికి ఫ్యాషన్ పరిశ్రమలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో మర్కండైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇల్లుస్ట్రేటర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఎగుమతి సంస్థలు, వస్త్ర మిల్లులు, బోటిక్‌ల్లోనూ అవకాశాలున్నాయి. ఫ్యాషన్ షోల నిర్వాహకులు కూడా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశాలిస్తున్నారు. ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. సృజనాత్మకత ఉన్నవారు ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు.
ఉన్నత విద్య: ఫ్యాషన్ టెక్నాలజీలో బీఎస్సీ తర్వాత వివిధ స్పెషలైజేషన్లతో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు.

బీఎస్సీ (ఆనర్స్) ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్:
అర్హతలు, ప్రవేశాలు:
ఇంటర్మీడియెట్ (10+2)లో బైపీసీ/ ఎంబైపీసీ ఉత్తీర్ణత. లేదా హోంసైన్స్ సంబంధిత సబ్జెక్టులు/ న్యూట్రిషన్/ బయో కెమిస్ట్రీ/హ్యూమన్ ఫిజియాలజీతో ఇంటర్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత. పాలిటెక్నిక్ (హోంసైన్స్) ఉత్తీర్ణులు కూడా కోర్సుకు అర్హులు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులాధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కరిక్యులం: హ్యూమన్ న్యూట్రిషన్; ఫుడ్ మైక్రో బయాలజీ; హ్యూమన్ ఫిజియాలజీ; ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్; ఫుడ్ ప్యాకేజింగ్, కేటరింగ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఫార్ములేషన్స్.
కెరీర్: ఆసుపత్రుల్లో డైటీషియన్లు, డైట్ కన్సల్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వసతి గృహాలు, హోటళ్లు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. పాఠశాలలు, కళాశాలలు కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నాయి. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ. 20 వరకు వేతనం ఉంటుంది.
ఉన్నత విద్య: పలు విశ్వవిద్యాలయాలు ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

మహిళల కెరీర్ ఉన్నతికి ‘హోంసైన్స్’
మహిళలు తమ కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునేందుకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో హోమ్‌సైన్స్ ప్రధానమైనదని చెప్పొచ్చు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్ వంటి స్పెషలైజేషన్లున్న ఈ కోర్సుకు గత ఐదేళ్ల నుంచి బాగా ఆదరణ పెరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఎంఎస్సీ, పీహెచ్‌డీ దిశగా వెళ్లేవారికి అత్యున్నత అవకాశాలుంటా యి. కార్పొరేట్ సంస్కృతి, ప్రపంచీకరణ ప్రభావం వల్ల హోంసైన్స్ గ్రాడ్యుయేట్లకు సమున్నత ఉద్యోగావకాశాలుంటున్నాయి.
- డాక్టర్ మహాలక్ష్మి వి.రెడ్డి,
అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, సైఫాబాద్.
Published date : 20 Jun 2014 12:37PM

Photo Stories