Skip to main content

వ్యవసాయ అనుబంధ రంగాలు - అవకాశాలు

వ్యవసాయ రంగం.. ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న రంగం. సాగుబడి విధానంలో పెరుగుతున్న వైవిధ్యం, వినూత్న విధానాలు..విత్తన ఉత్పత్తి నుంచి పంట చేతికందే వరకు కొత్త పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలైన హార్టికల్చర్ (ఉద్యాన), పౌల్ట్రీ, డెయిరీ రంగాల్లోనూ ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. యువత వాటిని అందుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకుందాం...
అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఎగ్జిక్యూటివ్...
రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఇతర వ్యవసాయ పద్ధతుల ఆవిష్కరణలు చేసే లేబొరేటరీల్లో ఆర్ అండ్ డీ బృందాలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. కొత్త టెక్నాలజీపై అవగాహన, దాన్ని రైతులకు వివరించే నైపుణ్యం అవసరం. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తోంది. 50 శాతం మార్కులతో అగ్రికల్చర్/సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (హైదరాబాద్) రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రికల్చర్)ను అందిస్తోంది. అగ్రికల్చర్/హార్టికల్చర్/వెటర్నరీ సంబంధిత అంశాల్లో 50 శాతం మార్కులతో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్
రైతులతో నేరుగా మమేకమవుతూ వారికి రుణ మంజూరులో సహకరించడం, పంటలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, తద్వారా లోన్ రీపేమెంట్ సామర్థ్యాలను అంచనా వేయగలగాలి. ఈ స్కిల్స్‌ను అందించేందుకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, పీజీ అగ్రికల్చర్ కోర్సులు ఉన్నాయి. వీటిని ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అందిస్తున్నాయి. వివిధ సెంట్రల్, స్టేట్ అగ్రికల్చరల్ వర్సిటీల్లోనూ ఈ కోర్సులున్నాయి.

మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్
సాగు నీటిపారుదల ఏర్పాట్లు చేయడం, పరీక్షించడం వీరి ప్రధాన విధులు. డ్రిప్ ఇరిగేషన్‌లో సర్టిఫికెట్ కోర్సును సెట్విన్ అందిస్తోంది

అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ ప్రొవైడర్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చెప్పడం, నిపుణులతో కలిసి పనిచేయడం, సత్వర పంట ఉత్పత్తుల పద్ధతులపై నైపుణ్యాలు అవసరం. వీటికి సంబంధించిన రెండేళ్ల కోర్సు పీజీ డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ (పీజీడీ -టీఎంఏ) హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌లో ఉంది. అగ్రికల్చరల్ సెన్సైస్/సోషల్ సెన్సైస్/ఫిజికల్ సెన్సైస్/మేనేజ్‌మెంట్/లైఫ్ సెన్సైస్/ఇంజనీరింగ్‌లో డిగ్రీ, రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. అగ్రికల్చరల్/సోషల్ సెన్సైస్/ఫిజికల్ సెన్సైస్/మేనేజ్‌మెంట్/లైఫ్ సెన్సైస్/ఇంజనీరింగ్‌లో పీజీ ఉత్తీర్ణులూ అర్హులే.

హార్వెస్టింగ్ మెషిన్ ఆపరేటర్
పంట నూర్పిడి యంత్రంగా పేర్కొనే హార్వెస్టింగ్ మెషిన్‌ను సమర్థంగా నిర్వహించడమూ వ్యవసాయ రంగంలో ఎంతో అవసరం. ఆ మెషిన్‌కు మరమ్మతులు చేయగలగడం, పంట స్థాయిని బట్టి మెషిన్‌ను నియంత్రించే నైపుణ్యాలు తప్పనిసరి. సర్టిఫికెట్ కోర్‌‌స ఇన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ను ఇగ్నో అందిస్తోంది.

సప్లయ్ చైన్ ఫీల్డ్ అసిస్టెంట్
కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉత్పత్తులను సరఫరా చేయాలి. సేకరణ, నిల్వ, ప్యాకింగ్, రవాణా పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.

వేర్‌హౌస్ (గోడౌన్) వర్కర్
డాక్యుమెంటేషన్, ఫిజికల్ వర్క్ రెండూ చేయాల్సి ఉంటుంది. గోడౌన్‌కు చేరుకున్న సరకును సరైన పద్ధతిలో నిల్వ చేయించడం, వాటి వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం, వినియోగదారులకు/ మార్కెట్‌కు సరుకును ఎలాంటి డ్యామేజ్ లేకుండా పంపేలా రవాణా వ్యవహరాలను పర్యవేక్షించడం వంటి నైపుణ్యాలు కావాలి. ఒక ఉత్పత్తి విలువను, దానికి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించే క్షేత్ర స్థాయి అవగాహన అవసరం. బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివినవారు ఈ నైపుణ్యాలను పొందొచ్చు.

మిల్క్ కలెక్షన్ ఏజెంట్స్
పాలను సేకరించడం, వాటిని చిల్లింగ్ ప్లాంట్లకు చేరవేయడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈ విభాగంలో ప్రస్తుతం నిపుణుల అవసరం ఎంతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి ఈ నైపుణ్యాలు లేకపోవడంతో నిత్యం కొన్ని వేల లీటర్ల పాలు వృథా అవుతున్నాయి.

బల్క్ మిల్క్ చిల్లర్ ఆపరేటర్
డెయిరీ ప్లాంట్లలో చిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ విధులు కూడా డెయిరీ రంగంలో ఎంతో కీలకం. రిఫ్రిజిరేషన్, కోల్డ్ స్టోరేజ్‌లపై అవగాహన అవసరం.

డెయిరీ ఫార్మర్/ఎంటర్‌ప్రెన్యూర్
సొంతంగా డెయిరీ ఫార్మ్ నెలకొల్పాలనుకునే వారికి నిర్ణయ సామర్థ్యం, పశు సంరక్షణ, డెయిరీ ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్ విభాగంలోకి ఇటీవలే విద్యావంతులు ప్రవేశిస్తున్నా సంప్రదాయ రైతులే ఎక్కువ ఉంటున్నారు. వీరిలో అవగాహన కల్పించడానికి పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ శాఖలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బీటెక్‌లో డెయిరీ టెక్నాలజీ చదివితే నైపుణ్యాలు పొందొచ్చు.

ఫార్మ్ సూపర్‌వైజర్
పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చే నైపుణ్యాలు అవసరం. కోళ్లకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక పద్ధతులపై అవగాహన కల్పించాలి. సర్టిఫికెట్ కోర్‌‌స ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ (సీపీఎఫ్)ను ఇగ్నో అందిస్తోంది. ఐసీఏఆర్ కూడా స్వల్ప కాలిక కోర్సులను ఆఫర్ చేస్తోంది.

వెటర్నరీ డాక్టర్స్
కోళ్లు, మేకలు, గొర్రెలు, ఇతర పశు వ్యాధుల నివారణ పద్ధతుల్లో నైపుణ్యాలు అవసరం. ఆయా విభాగాల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) కోర్సు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.

హ్యాచరీ ప్రొడక్షన్ వర్కర్ (ఫిషరీస్)
చేపలు, ఇతర జలచరాల ఆరోగ్య పద్ధతులు, వాటి పెరుగుదలకు అవసరమైన నీటి నిల్వలపై అవగాహన అవసరం. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ) కోర్సు ఏపీలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఉంది.
Published date : 17 Jun 2016 12:30PM

Photo Stories