Skip to main content

కెరీర్ గైడెన్స్.. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం... ఫలితంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, అధికమవుతున్న జనాభాతో భూమిపై పెరుగుతున్న ఒత్తిడి, పరిమితమవుతున్న జల, శక్తి వనరుల లభ్యత, తదితర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనంగా చేయడానికి ప్రవేశపెట్టిన కోర్సు..ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.

ఒక రకంగా చెప్పాలంటే..మన చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడమే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్. ఈ క్రమంలో చుట్టూ ఉన్న పరిసరాలను రసాయనికంగా, భౌతికంగా, జీవ శాస్త్ర పరంగా పరిశోధన చేయడం, అవగాహన పెంపొందించుకో వడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాలు, భూ కాలుష్యం, శక్తి వనరులు, ప్లాస్టిక్ పదార్థాలతో జరుగుతున్న హాని గురించి, బయో డైవర్సిటీ, గ్లోబల్ వార్మింగ్, వంటి అంశాల గురించి కూడా ఈ శాస్త్రం చర్చిస్తుంది. అంతేకాకుండా వాతావరణ, పర్యావరణ మార్పులు, సంబంధిత విషయంలో ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను కూడా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

రెండిటి కలయిక:
నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్ రెండిటి కలయికగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కూర్పు ఉంటుంది. ఈ క్రమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సాయిల్ సైన్స్, జియాలజీ, జాగ్రఫీ వంటి అంశాలు ఉంటాయి. ఈ సబ్జెక్ట్‌లో నిష్ణాతులైన వారిని ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. వీరు పర్యావరణ వ్యవస్థల పరంగా మానవునికి నాణ్యమైన జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తారు. ఈ క్రమంలో వాతావరణ సమస్యలు, కాలుష్య నివారణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సూచించడం, వంటి అంశాలకు సంబంధించి విధులు నిర్వహిస్తుంటారు.

కోర్సులు:
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌కు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు..
 
  1. బ్యాచిలర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
  2. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్-ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
  3. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్-ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్
  4. మాస్టర్ ఆఫ్ సైన్స్-ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
  5. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంట్
  6. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్
  7. డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్
  8. డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
  9. డిప్లొమా ఇన్ ఎన్విరాన్‌మెంటల్ లా
  10. ఎంఫిల్-ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
  11. ఎంఫిల్-ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ
  12. పీహెచ్‌డీ- ఎర్త్ సైన్స్
  13. పీహెచ్‌డీ-ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
స్పెషలైజేషన్స్:
  1. ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ
  2. జియో సైన్స్
  3. ఎకాలజీ
  4. ఎన్విరాన్‌మెంటల్ మైక్రోబయాలజీ
  5. ఫైర్ సైన్స్
  6. వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్రీ
  7. వాటర్ అండ్ వాటర్‌షెడ్
  8. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్
  9. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  10. ఎన్విరాన్‌మెంటల్ పాలసీ అండ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్
  11. ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, టాక్సికాలజీ అండ్ రిస్క్ అసెస్‌మెంట్
  12. అక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్/ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్
బీటెక్ అభ్యర్థుల కోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఎంటెక్‌లో ఎన్విరాన్‌మెంటల్ కోర్సును కూడా ఆఫర్ చేస్తున్నాయి.

మన రాష్ట్రంలో పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

పీజీ/పీహెచ్‌డీ తప్పనిసరి:
ఈ కోర్సుతో ఉన్నత స్థానంలో స్థిరపడాలంటే మాత్రం పీజీ తప్పనిసరి. పీహెచ్‌డీ ఉంటే మరిన్ని చక్కని అవకాశాలను దక్కించుకోవచ్చు. ఎందుకంటే వీరికి అధిక శాతం అవకాశాలు ఆర్ అండ్ డీ విభాగంలోనే ఉంటాయి. పర్యావరణ సమత్యులతను కాపాడే క్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, టాక్సిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయాలాజికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కెమికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పీజీ/పీహెచ్‌డీ అభ్యర్థులకే ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి సంబంధిత పరిశ్రమలు చక్కని పే-ప్యాకేజ్‌తో వీరిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.

అవకాశాలు:
పర్యావరణ పరిరక్షణలో ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం‘ క్లీన్ ఎన్విరాన్‌మెంట్’ దిశగా అందరిలో అవగాహన పెరిగింది. ఫలితంగా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లకు ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రెవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ భాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. ప్రెవేట్ రంగంలో పరిశ్రమలు పెరుగుతున్న కొద్ది..అంతే స్థాయిలో వీరికి అవకాశాలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అందరిలో పర్యావరణం పట్ల అవగాహన పెరిగింది. దీంతో పర్యావరణ విషయంలో ఎటువంటి లోసుగులు లేకుండా ఉండటానికి పరిశ్రమలు ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటు న్నాయి.

ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్, వంటి ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.

ఇంటర్-గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లెమెట్ ఛేంజ్ (ఐపీసీసీ), యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ), ఎర్త్ సిస్టమ్ గవర్నెస్ ప్రాజెక్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయి.
ఆసక్తి ఉంటేఈ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిర పడొచ్చు.
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఎన్విరాన్‌మెంటల్ జర్నలిస్ట్‌లుగా స్థిర పడొచ్చు. అంతేకాకుండా సైన్స్, వైల్డ్‌లైఫ్ చానెల్స్‌లో వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్‌గా కూడా అవకాశాలు ఉంటాయి.

జాబ్ ప్రొఫైల్స్:
  1. ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్
  2. ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్
  3. ఎన్విరాన్‌మెంటల్ బయాలాజిస్ట్
  4. రీసెర్చ్ ఫెలో
  5. ఫారెస్ట్ కార్బన్ స్పెషలిస్ట్
  6. కన్జర్వేషన్ హైడ్రాలాజిస్ట్
  7. సీనియర్ ప్రోగ్రామర్ ఆఫీసర్
  8. వేస్ట్ మేనేజ్‌మెంట్-డెరైక్టర్
వేతనాలు:
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అభ్యర్థులకు వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి. ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీతో నెలకు రూ. 10 వేల నుంచి 20 వేల వరకు వేతనం లభిస్తుంది. పీజీ డిగ్రీ ఉంటే రూ. 35 వేల నుంచి 50 వేల వరకు సంపాదించవచ్చు. పీహెచ్‌డీ ఉంటే రూ. 50 వేల నుంచి 75 వేల వరకు వేతనంగా లభిస్తుంది.

టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
-ఐఐటీ-బాంబే
వెబ్‌సైట్: www.cese.iitb.ac.in

-జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.jnu.ac.in

-ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in

-ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in

-బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www.bhu.ac.in

-మద్రాస్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unom.ac.in

-పుణే యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unipune.ac.in
Published date : 20 May 2013 07:52PM

Photo Stories