Skip to main content

ఇంజనీరింగ్ విద్యకు వివిధ మార్గాలు..

ఏటా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు.. వివిధ రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దోహదం చేస్తున్న ఎంట్రెన్స్ టెస్టులు, వాటి వివరాలు...

మన ఇంటర్మీడియెట్ సిలబస్ అన్ని జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సరిపోతుంది. ప్రశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టత, మార్కులు వంటి అంశాల్లో మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ పరంగా కొంత సమన్వయం చేసుకోగలిగితే అన్ని ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఇంటర్‌తో సమాంతరంగా సిద్ధం కావచ్చు. అంతేకాకుండా ఒక పరీక్షకు మరొ పరీక్షకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది. ఈ సమయం కూడా సంబంధిత పరీక్షకు చక్కగా సన్నద్ధమవ్వడానికి దోహద పడుతుంది.

ఇంటర్మీడియెట్ తర్వాత:
ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలుంటాయి కాబట్టి మొత్తం సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఇంటర్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది.

భిన్నంగా:
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశపరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోపాటు ఇంగ్లిష్, ఇతర విభాగాల్లో కూడా ప్రశ్నలు ఇస్తున్నాయి. బిట్‌శాట్‌లో లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీపై ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ కోసం బొమ్మల చిత్రీకరణ, అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ కోసం సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి.

ఎంసెట్
ఇతర ఎంట్రెన్స్‌లతో పోలిస్తే ఎంసెట్‌కు సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు వేగం కూడా ముఖ్యం. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లతో పోలిస్తే ఎంసెట్‌లో దాదాపు రెట్టింపు ప్రశ్నలుంటాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి.

  • కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదివితే 160 మార్కులకుగాను 110మార్కులకు పైగా సాధించవచ్చు.
  • ఎంసెట్ 160 ప్రశ్నల్లో 70శాతం ప్రశ్నలు సులభంగా లేదా మధ్యస్థంగా ఉంటాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమ ప్రాధాన్యం లభిస్తుంది

 

పరీక్ష ప్రశ్నించే విభాగాలు, ప్రశ్నలు
ఎంసెట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (80 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు)
బిట్‌శాట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (45 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ (10 ప్రశ్నలు), ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ(15 ప్రశ్నలు)
ఎస్‌ఆర్‌ఎం ఫిజిక్స్ (35 ప్రశ్నలు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు), కెమిస్ట్రీ (35 ప్రశ్నలు)
విట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు)

 

 

  • జేఈఈ మెయిన్ బీఈ/బీటెక్ కోర్సు కోసం పేపర్ -1కు హాజరు కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల సంఖ్య ప్రతి ఏడాది మారుతూంటుంది.గత పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సులో చేరాలనుకునే వారు పేపర్-2 రాయాలి.
     
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్‌కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. ప్రతి పేపర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి.

సబ్జెక్ట్‌ల వారీగా
మ్యాథమెటిక్స్

బిట్‌శాట్‌లో కాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో హయ్యర్ ఆర్డర్, నంబర్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. మిగతా పరీక్షలకు సంబంధించి సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి.

-ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు.

ఫిజిక్స్

 

 

  • భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం.
  • ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చే అదనపు ప్రశ్నలతోసహా ప్రిపేరవ్వడం లాభిస్తుంది.
  • ఈ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులు స్కోర్ చేస్తే మెరుగైన ర్యాంక్‌ను సాధించవచ్చు.
  • ప్రథమ సంవత్సరం సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. 1) గతిశాస్త్రం, 2) ద్రవ్య ధర్మాలు, 3) ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రం.
  • ద్రవ్య ధర్మాలు, ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రాల్లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించటం చాలా ప్రధానం. ఉష్ణగతికశాస్త్రంలో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి.
  • ద్వితీయ సంవత్సరంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం, కేంద్రక, పరమాణు భౌతిక శాస్త్రాలను క్షుణ్నంగా చదవాలి.
  • ప్రతి పాఠ్యాంశంలోని సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను తప్పకుండా సాధన చేయాలి.
  • పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ తేలికవుతుంది.
  • ప్రతి చాప్టర్‌లో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను ఒక చోట చేర్చి చదివితే వాటి మధ్య పోలికలు తేలికగా తెలుస్తాయి. ప్రిపరేషన్ ప్రయోజనకరంగా సాగుతుంది.


-పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు జ్ఞాపక శక్తి ఆధారంగా ఉంటున్నాయి. కాబట్టి పీరియూడిక్ టేబుల్, ఎస్-బ్లాక్, పి-బ్లాక్ వంటి సులువైన అంశాలను నిర్లక్ష్యం చేయొద్దు.

 

  • కెమికల్ ఈక్విలిబ్రియుంలో రిలేషన్‌షిప్స్‌ను బాగా నేర్చుకోవాలి. అయానిక్ ఈక్విలిబ్రియుంలో ప్రాబ్లమ్స్, బఫర్ సొల్యూషన్స్, సాల్ట్ హైడ్రాలిసిస్, సొల్యుబిలిటీ ప్రొడక్ట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
  • ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఎలక్ట్రోలైటిక్ కండెక్టెన్స్, ఎలక్ట్రాలిసిస్ వంటి అంశా లపై దృష్టి సారించాలి. థర్మోడైనమిక్స్‌లో ఫస్ట్ లా అప్లికేషన్స్, స్పాంటెనిటీకి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అకాడమీ పుస్తకంలోని రీజెంట్స్‌ను తప్పకుండా చదవాలి.
  • కైనటిక్స్‌లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కైనటిక్స్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి.
  • ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్, బాండింగ్స్, ఆక్సియాసిడ్స్, ఆక్సైడ్ తదితరాలను విధిగా నేర్చుకోవాలి.
  • కాంప్లెక్స్ కంపౌండ్స్‌లో ఐసోమార్సిజం, బాండింగ్‌పై దృష్టి సారించాలి.
  • ఎంసెట్‌తో పోల్చితే బిట్‌శాట్‌లో ప్రశ్నల క్లిష్టత కొంచెం ఎక్కువ. మెటలర్జీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, బయోమాలిక్యుల్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. విట్ పరీక్ష కోసం కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, లిపిడ్స్ వంటి అంశాలలోని వర్గీకరణలు, ఉదాహరణలను బాగా నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి-బ్లాక్ ఎలిమెంట్స్‌కు సంబంధించి అకాడమీ పుస్తకాల్లోని అంశాలను బాగా చదవాలి.


-టి. కృష్ణ, డాక్టర్ ఆర్‌కే క్లాసెస్,
హైదరాబాద్.

Published date : 08 Jan 2024 04:45PM

Photo Stories