Skip to main content

భద్రమైన కెరీర్‌ను ఎంచుకోండిలా..!

బోర్డు పరీక్షలు పూర్తయి... ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. మరోవైపు ప్రవేశ పరీక్షలు సైతం కొద్ది రోజుల్లోనే ముగియనున్నాయి. త్వరలోనే వాటి ఫలితాలు కూడా వెల్లడవుతాయి.
మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కొంత స్పష్టతతో ముందడుగు వేస్తారు. కాని సరైన ర్యాంకు రాని విద్యార్థుల్లో సందిగ్దత, గందరగోళం నెలకొంటుంది.చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోతుంది. వేసవి సెలవులు ముగిసి.. కొత్త విద్యా సంవత్సరానికి సంసిద్ధం కావాల్సి సమయం వచ్చేస్తుంది. అందుకే ఆయా కోర్సుల్లో, కాలేజీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే విద్యార్థి తన గమ్యం, భవిష్యత్ లక్ష్యాలు, తన శక్తిసామర్థ్యాలు, బలాలు బలహీనతలు దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి.
కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు విద్యార్థికి కొంత ఆందోళన, సందిగ్ధత సహజమే! చేరాలనుకుంటున్న కోర్సు తనకు సరిపోతుందా.. కెరీర్ పరంగా సరైన నిర్ణయం తీసుకుంటున్నానా..ఒక వేళ సఫలం కాకపోతే నాకున్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటి.. స్నేహితులు ఎలాంటి కోర్సుల్లో చేరుతున్నారు.. నేను ఎంచుకున్న కోర్సు వారికి నచ్చుతుందా.. నా తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టు నేను రాణించగలనా.. ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులను వెంటాడుతుంటాయి. అన్నింటికీ సమాధానం.. విద్యార్థి తనకు సరిపోయే భద్రమైన కెరీర్‌ను ఎంచుకోవడమే!!

ఆసక్తి.. సామర్థ్యం :
మిగతా అన్ని అంశాల కంటే... విద్యార్థి కెరీర్ ఎంపికలో తన ఆసక్తికి, అభిరుచికి పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు సదరు కోర్సు/కెరీర్‌లో రాణించే శక్తిసామర్థ్యాలు తనకు ఉన్నాయో లేదో కూడా పరిశీలన చేసుకోవాలి. మీకు ఒక రంగంపై విపరీతమైన ఆసక్తి ఉంది.. కాని ఆ రంగంలో రాణించే సామర్థ్యం లేకుంటే చేసిన శ్రమ అంతా వృథా అవుతుంది. ఉదాహరణకు మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనే ఆసక్తి ఉంది. కాని మ్యాథమెటిక్స్ అంటే భయం... ఈ సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మ్యాథ్స్‌పై పట్టు లేకుండా.. కంప్యూటర్ ఇంజనీర్‌గా రాణించడం కష్టమనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఒక అంశంపై ఎంత ఆసక్తి ఉన్నా.. అందులో విజయం సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు లేకుంటే... దీర్ఘకాలంలో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవడం సాధ్యంకాదు.

సమగ్ర అధ్యయనం :
ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు... ఆయా కోర్సు ద్వారా అందుబాటులోకి వచ్చే కెరీర్ గురించి లోతైన ఆలోచన, అధ్యయనం చేయాలి. అరకొర సమాచారంతో కెరీర్‌ను ఎంచుకుంటే... ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థి తనముందున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలపైనా సమగ్ర అధ్యయనం చేయాలి. అడ్మిషన్స్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. నింపాదిగా అన్ని రకాల కోర్సులు, కెరీర్ ఆఫ్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

వాస్తవ పనిపై అవగాహన :
రాబోయే కొన్ని దశాబ్దాలపాటు కొనసాగాల్సిన కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు విద్యార్థి ఆచితూచి అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఎంచుకున్న కెరీర్‌లో వాస్తవంగా చేయాల్సిన పని గురించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయడం మేలు చేస్తుంది. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థి.. వాస్తవ పని పరంగా మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారో తెలుసుకోవాలి. అందుకోసం ఆయా రంగంలో పనిచేస్తున్న వారి సలహాలు అడగాలి. సహాయం తీసుకోవాలి. ఏదైనా సంబంధిత సంస్థకు వెళ్లి మెకానికల్ ఇంజనీర్ల జాబ్ ప్రొఫైల్‌తోపాటు పనితీరును గమనించాలి. తద్వారా సదరు మెకానికల్ ఇంజనీర్‌లు చేస్తున్న పని తనకు సరిపోతుందా... ఆయా పని పూర్తిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, దృక్పథం తనకు ఉన్నాయో లేదో అంచనాకు రావచ్చు. అంతేకాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చదవాల్సిన సబ్జెక్టులు ఏమిటి... ఆయా సబ్జెక్టులను తాను ఆసక్తిగా చదవగలనా లేదా కూడా పరిశీలించుకోవడం మేలు. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఆస్సలు ఆసక్తి కలిగించవు. ఎంత ప్రయత్నించినా ఆ సబ్జెక్టుల్లో నెగ్గుకురావడం కష్టంగా అనిపిస్తుంది.

ప్రతి ఒక్కరూ విభిన్నం..
ప్రతి ఒక్క విద్యార్థి తమ శక్తి సామర్థ్యాలు, అభిరుచులు, నైపుణ్యాలు, వ్యక్తిత్వం, దృక్పథం పరంగా ఎంతో భిన్నం. కాబట్టి తోటి వారితో పోల్చుకోవడం సరికాదు. స్నేహితులు ఎలాంటి కోర్సుల్లో చేరుతున్నారు.. వారి అభిప్రాయాలు ఏంటి.. అనేదానితో ప్రభావితం కాకుండా స్వీయ నిర్ణయం తీసుకోవాలి. జీవిత కాలం కొనసాగాల్సిన కెరీర్ కాబట్టి విద్యార్థి పూర్తిగా తన లక్ష్యాలు, తన అభిరుచులు, శక్తిసామర్థ్యాలపైనే దృష్టిసారించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని స్నేహితులు ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు కాబట్టి మనం కూడా ఇష్టమున్నా లేకున్నా అదే కోర్సులో చేరాలనుకోవడం సరికాదు.

సలహా మంచిదే..
అనేక కెరీర్ మార్గాలు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అనంత అవకాశాల ప్రపంచంలో.. ఏదో ఒక కోర్సును ఎంపిక చేసుకోవడం అంత తేలిక కాదు. గతంలో ఏవో రెండు మూడు కెరీర్ అవకాశాలు మాత్రమే కనిపించేవి. నేటి టెక్నాలజీ యుగంలో అనేక మార్గాలు ఎదురుగా ఉండటం.. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను మరింత గందరగోళానికి గురి చేస్తోంది. కాబట్టి అలాంటి సందర్భంలో నిపుణుల సూచనలు, సలహా తీసుకుంటే.. వారు విద్యార్థి వ్యక్తిత్వ లక్షణాలు, దృక్పథం, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని సరైన సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది.

అదే అంతిమం కారాదు..
విద్యార్థులు కెరీర్ నిర్ణయం పరంగా కొంత సరళంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో విలువైన సమయం, డబ్బు వెచ్చించిన తర్వాత కూడా.. సదరు కోర్సు తనకు నప్పదు అనుకుంటే.. మరో కెరీర్‌కు మారేందుకు, మరో కోర్సులో చేరేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఒక కోర్సులో చేరాక ముందుకు వెళ్లడం కష్టంగా అనిపిస్తే.. మధ్యలోనే మరో నచ్చిన రంగంవైపు వెళ్లే ఆలోచన చేయాలని సలహా ఇస్తున్నారు. నచ్చకపోయినా, రాణించే అవకాశం లేదని పూర్తిగా అర్థమైనా.. అదే కోర్సులో కొనసాగడం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. అంతిమంగా కెరీర్ నిర్ణయం తీసుకునేముందుకు ఆచితూచి అడుగేయడం అన్ని విధాల ఉత్తమం!!
Published date : 25 Apr 2018 04:22PM

Photo Stories