Skip to main content

NCET 2023: ఇంటర్‌తోనే.. బీఈడీలో ప్రవేశాలు.. బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలివే

కొత్తగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ) ప్రారంభమైంది! ఈ ఏడాది నుంచి జాతీయ స్థాయిలో 42 విద్యాసంస్థల్లో ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. అందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌సీఈటీ)ను నిర్వహించనుంది. తాజాగా.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌సీఈటీ 2023 దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌సీఈటీ వివరాలు, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ ప్రాధాన్యత, ప్రవేశం కల్పించనున్న ఇన్‌స్టిట్యూట్స్‌ తదితర వివరాలు..
National Common Entrance Test [NCET] 2023 for BEd Admissions
  • నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ)
  • ఈ ఏడాది నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభం
  • దేశవ్యాప్తంగా 42 యూనివర్సిటీల్లో మొత్తం 3950 సీట్లు
  • నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) ఆధారంగా ప్రవేశాలు
  • 2023-24కు తొలి ఎన్‌సీఈటీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

దేశంలో ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షిస్తున్న సంస్థ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ పేరుతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు ఐఐటీలు, నిట్‌లు, ఆర్‌ఐఈలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ముందుకొచ్చాయి.

అర్హతలు

ఈ కొత్త ప్రోగ్రామ్‌లో భాగంగా బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్‌ బీఈడీ అందించనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ బీఈడీలో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో, బీకాం బీఈడీలో చేరాలనుకునే విద్యార్థులు ఇంటర్‌ సీఈసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

42 ఇన్‌స్టిట్యూట్స్‌.. 3950 సీట్లు

  • ఎన్‌టీఏ సమాచారం ప్రకారం-ఎన్‌సీఈటీ స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలోని 42 విద్యాసంస్థలు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో ప్రవేశం కల్పించనున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో మొత్తం 3950 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  • తెలంగాణలో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ బీఈడీ(50 సీట్లు), బీఎస్సీ బీఈడీ(50 సీట్లు), బీకాం బీఈడీ(50 సీట్లు); గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌-లక్సెట్టిపేట మంచిర్యాలలో బీఏ బీఈడీలో 50 సీట్లు ఉన్నాయి. 
  • ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జాతీయ సంస్కృత విద్యాలయం-తిరుపతిలో బీఏ బీఈడీలో 50 సీ­ట్లు; డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ-ఎచ్చెర్లలో బీఏ బీఈడీలో 50 సీట్లు;బీఎస్సీ బీఈడీ­లో 50సీట్లు చొప్పున అందుబాటులో ఉన్నాయి.

చ‌ద‌వండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

ఎన్‌ఐటీలు, ఐఐటీల్లోనూ

సాంకేతిక విద్యకు కేరాఫ్‌గా భావించే ఎన్‌ఐటీలు, ఐఐటీలు కూడా ఈ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో ప్రవేశం కల్పిస్తుండటం విశేషం. ఎన్‌ఐటీ-కాలికట్, ఎన్‌ఐటీ-వరంగల్, ఎన్‌ఐటీ-పుదుచ్చేరిలతోపాటు ఐఐటీ-ఖరగ్‌పూర్‌ బీఎస్సీ బీఈడీ ప్రోగ్రామ్‌లో 50 సీట్లు చొప్పున అడ్మిషన్‌ కల్పించనున్నాయి.

ఎన్‌సీఈటీ.. నాలుగు విభాగాలు

  • నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎన్‌సీఈటీ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఆ వివరాలు..
  • విభాగం-1: ఈ విభాగంలో రెండు లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో లాంగ్వేజ్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఎన్‌టీఏ పేర్కొన్న 33 లాంగ్వేజ్‌లలో ఏవైనా రెండు లాంగ్వేజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • విభాగం-2: డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌: ఈ విభాగంలో మొత్తం 26 డొమైన్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా మూడు డొమైన్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
  • విభాగం-3: టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి.
  • విభాగం-4: జనరల్‌ టెస్ట్‌: ఈ విభాగంలో 25 ప్రశ్నలు అడుగుతారు.
  • మొత్తంగా 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. అదే విధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

పదమూడు భాషల్లో పరీక్ష

ఎన్‌సీఈటీని.. ఇంగ్లిష్, హిందీతోపాటు మరో 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు

ఎన్‌సీఈటీలో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఆయా యూనివర్సిటీలు /ఇన్‌స్టిట్యూట్స్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దశలో సదరు ఇన్‌స్టిట్యూట్స్‌ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, ప్రవేశ పరీక్ష స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తాయి.

guidance
​​​​​​​బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలివే

లాంగ్వేజ్‌ టెస్ట్‌

మొత్తం రెండు లాంగ్వేజ్‌లలో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌లలో మెరుగైన స్కోర్‌­కు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలకు సంబంధించి గ్రామర్, కాంప్రహెన్షన్, వాక్య నిర్మాణం, సాహిత్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రెసిస్‌ రైటింగ్, ప్యాసేజ్‌ రీడింగ్‌ ప్రాక్టీస్‌ చేయడమే కాకుండా.. సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి.

డొమైన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్ట్‌

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌ల ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఇంటర్మీడియెట్, పదో తరగతి స్థాయి అకడమిక్‌ పుస్తకాలను ఔపోసన పట్టాలి. విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన ఫార్ములాలు,అప్లికేషన్స్,సిద్ధాంతాలు, నిర్వచనాలు, భావనలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బీఎస్సీ బీఈడీ అభ్యర్థులు సైన్స్, మ్యాథ్స్‌లలోని ముఖ్యమైన కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి.

జనరల్‌ టెస్ట్‌

ఈ విభాగం కోసం హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ పుస్తకాలను చదవాలి. అదే  కరెంట్‌ ఈవెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్‌ రీజనింగ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్‌-డీ కోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, వర్క్, నంబర్‌ సిస్టమ్స్‌పై పట్టు సాధించాలి.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

బీఈడీ ప్రవేశ పరీక్షల్లో ఎంతో కీలకంగా నిలిచే ఈ విభాగంలో మంచి మార్కుల కోసం విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్‌-కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి.
ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. అదే విధంగా నూతన విద్యా విధానం-ఉద్దేశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జూన్‌ 26- జూలై 19, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: జూలై 20 - జూలై 21, 2023
  • పరీక్ష కేంద్రాల కేటాయింపు: జూలై 26, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు నుంచి;
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nta.ac.in/, https://ncet.samarth.ac.in/
Published date : 11 Jul 2023 06:25PM

Photo Stories