Skip to main content

APPSC Group 1 Ranker: అమ్మ కష్టం, త్యాగం.. నన్ను గ్రూప్-1 సాధించేలా చేసింది!

రాయదుర్గం: అమ్మచెప్పిన మాటలు ఆయనలో కసి పెంచాయి. ప్రతిష్టాత్మక గ్రూప్‌–1 పరీక్షలో విజయబావుటా ఎగరేసేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం ఆర్‌ కొత్తపల్లి గ్రామానికి చెందిన తిప్పయ్యగారి రమేష్‌ స్ఫూర్తిదాయక గాథ ఇది. ‘‘లక్ష్య సాధనలో వైఫల్యాలు ఎదుర‌వడం మామూలే. ఎలా ఓడిపోయామో కారణాలు అన్వేషిస్తే అదే లక్ష్యం చేరుస్తుంది’’ అని చెబుతున్న రమేష్‌ విజయగాథ ఆయన మాటల్లోనే...
Ramesh's Journey to Group-1 Success, Tippaiyagari Ramesh Sucess Story,Victory in the Prestigious Group-1 Test
అనంతపురం ఎన్జీఓ కార్యాలయంలో రమేష్‌ను సన్మానిస్తున్న స్నేహితులు

మాది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలోనే నాన్న హరిజన తిప్పయ్య మృతి చెందాడు. దీంతో అమ్మ మారెక్కపై కుటుంబ భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తూ అందరినీ పోషిస్తూ వచ్చేది. ‘ఒరేయ్‌ నాన్నా.. మన ఊరి రామారావు (ఆర్డీఓ) సార్‌ని చూశావా. బాగా చదువుకున్నాడు కాబట్టే పెద్ద ఉద్యోగం సాధించాడు. ఊరికి కార్లోనే వచ్చిపోతున్నాడు. నీవు కూడా అలా ఎదగాలి, అలా చదవాలి’ అంటూ తరచూ ఆమె చెప్పేది. ఆ మాటలే నాలో కసి పెంచాయి.

చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే..

1 నుంచి 5వ తరగతి వరకూ వరకూ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివా. కణేకల్లు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీటు లభించడంతో 6 నుంచి 10 వరకూ అక్కడ పూర్తి చేశా. పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించా. ఆర్థిక ఇబ్బందులు, అమ్మకు వ్యవసాయ పనుల్లో తోడుగా నిలిచేందుకు చదువు మానాలని భావించా. అయితే, ఆ సమయంలో గ్రామానికి చెందిన పంపాపతి, ఆర్డీఓ రామారావు సార్‌ నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారిచ్చిన స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జరిగిన గురుకుల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించా.

చదవండి: Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల జూనియర్‌ కళాశాలలో సీటు దక్కడంతో అక్కడే ఇంటర్‌ పూర్తిచేశా. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో 2002–05లో బీఎస్సీ– ఎలక్ట్రానిక్స్‌ చదివా. 2005–08 మధ్య కాలంలో ఎంసీఏ చేశా. లాస్ట్‌ సెమిస్టర్‌ కొనసాగుతుండగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చింది. అయినా, దరఖాస్తు చేసి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో సత్తా చాటా. 2013లో ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యా. సుప్రీం కోర్టు ఆ నోటిఫికేషన్‌ రద్దు చేయడంతో అప్పట్లో ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. దీంతో చాలా బాధపడ్డా.

గ్రూప్‌–2కు ఎంపికయ్యా..

గ్రూప్‌–1 ఉద్యోగం రాలేదని నిరాశం కలిగినా, 2008లోనే వచ్చిన గ్రూప్‌–2 రాశా. విజయవాడ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం దక్కడంతో కొంత సంతోషమేసింది. అయినా, అమ్మ కోరుకున్నట్టు గ్రూప్‌–1 ఉద్యోగం సాధించలేక పోయాననే బాధ ఏదో ఓ మూలన మిగిలిపోయింది. ఈ కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్‌లోని ‘టైమ్‌’ కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా చేరా. చదువు చెప్పడం ఎంతో ప్రయోజనం చేకూర్చింది.

చదవండి: Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

యువత కొత్తగా ఆలోచించాలి

విద్యతోనే పేదరికం దూరం కానుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నా ఈ హోదా విద్యతోనే సాధ్యమైందని గర్వంగా చెబుతా. యువత కొత్తగా ఆలోచించాలి. జీవితంలో ఉన్నత స్థా నాలకు చేరిన వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఈ విషయాలే నా విజయంలో కీలక భూమిక పోషించాయి. నేడు టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. సెల్‌ఫోన్‌ను వృథా వాటికి కాకుండా కావాల్సిన సమాచార సేకరణకే ఎంపిక చేసుకోవాలి. పత్రికలను రోజూ చదివితే లక్ష్య సాధన సులు వవుతుంది.

అమ్మ కళ్లలో ఆనందం

గ్రూప్‌–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో నా కంటే అమ్మే ఎక్కువ సంతోష పడింది. ఆమె కళ్లలో ఆనందం చూడాలనే తపన, శ్రమ నెరవేర్చేందుకు సహకరించిన వారందరికీ రుణపడి ఉంటా. ముఖ్యంగా మా గ్రామంలో పంపాపతి, ప్రస్తుతం విజయవాడ దుర్గగుడి ఈఓగా విధులు నిర్వహిస్తున్న రామారావు సార్‌ సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. నా చిన్నప్పుడు మా అమ్మ పడ్డ కష్టం, పేదరికం ఇప్పటికీ కళ్లముందే మెదులుతోంది. పేదరికం రూపుమాపేందుకు నా వంతు కృషి చేస్తా.

తల్లి మారెక్కతో రమేష్‌
తల్లి మారెక్కతో రమేష్‌

లక్ష్యంతో చదివా.. ఉద్యోగం సాధించా

2022లో విడుదలైన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేశారు. పరీక్షల్లో పాల్గొన్నా. ఉద్యోగం వస్తుంది... అమ్మకల నెరవేరుతుందని గట్టిగా నమ్మి దేవుడిమీద భారం వేశా. ఈ ఏడాది ఆగస్టు 17న విడుదలైన ఫలితాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యా. చాలా సంతోషంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోని జీజీహెచ్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది.

Published date : 08 Jan 2024 05:40PM

Photo Stories