Skip to main content

Nagendra Reddy: మా నాన్న ఓ పేద రైతు..ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని గ్రూప్-2లో స‌క్సెస్ అయ్యానిలా..

నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా నిరంతరం అధ్యయనం చేయడం, ఒకే మెటీరియల్‌ను ఎక్కువసార్లు చదవడం, ప్రిపరేషన్‌ను మధ్యలో ఆపకపోవడం మరియు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ సాధనం చేయడం వల్ల ఏ పోటీ పరీక్షలోనైనా తప్పకుండా విజయం సాధించవచ్చంటున్నారు అనంతపురానికి చెందిన నాగేందర్ రెడ్డి.
Nagendra Reddy
Nagendra Reddy

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో 324.77 మార్కులు సాధించి జోన్-II లో ఏసీటీవో (ఎగ్జిక్యూటివ్) జాబ్‌ను సొంతం చేసుకున్న నాగేందర్ విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే...

చాలా ఆనందంగా ఉంది..
గ్రూప్-2లోఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనుభూతి, సంతోషం మాటల్లో చెప్పలేనిది. మా అమ్మ కల నెరవేరింది. ఏదో ఒక పోస్టు వస్తుందనుకున్నాను కానీ ఏసీటీవో రావడంతో నా ఆనందానికి అవధులు లేవు.

కానిస్టేబుల్ జాబ్ వచ్చినా వెళ్లలేదు..
ఎస్‌ఐ జాబ్ నా డ్రీమ్. దాని కోసం చాలా కష్టపడ్డాను. మెరిట్ జాబితాలో 297 మార్కులు వచ్చాయి. కానీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్‌లో ఫెయిల్ అవడంతో నాకు ఆ జాబ్ రాలేదు. ఒకవేళ పాస్ అయి ఉంటే స్టేట్ 6వ ర్యాంక్ వచ్చేది. కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కానీ వెళ్లలేదు. అయినా ఇంతటితో ఆగను. నా లక్ష్యం గ్రూప్-1.

ఎస్‌ఐ ని వదిలి గ్రూప్-2 వైపు..
2017 కు ముందు ఎస్‌ఐ జాబ్ మీదే నా ఫోకస్ ఉండేది. అయితే 2017 మొత్తం గ్రూప్-2 మీద దృష్టి పెట్టాను. 2013-14 లో ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 కి కోచింగ్ తీసుకున్నాను.

ఫ్యాకల్టీ నోట్సే కీలకం..
నేను పూర్తిగా ఫ్యాకల్టీ చెప్పే నోట్స్‌పైనే ఆధారపడ్డాను. నాకు సమయం ఎక్కువ ఉండటంతో ఇతర పుస్తకాలు కూడా చదివాను. సాక్షి మెటీరియల్ ను కచ్చితంగా చదివేవాడిని.

ఐదేళ్లుగా చదువుతూనే ఉన్నా..
2013 నుంచి చదువుతున్నాను. 2014-16 లో పీజీ (జియోగ్రఫీ) చేస్తూ కూడా ప్రిపరేషన్ ఆపలేదు. మా అమ్మ, నాన్న ఇద్దరూ లేని లోటును అధిగమించి పట్టుదలతో సిద్ధమయ్యాను. ఈ జాబ్ మా అమ్మ గారికే అంకితం.

హార్డ్‌వర్కే ప్రధానం..
నేను గట్టిగా నమ్మేది హార్డవర్క్‌నే. తర్వాత ఎంపిక చేసుకున్న పుస్తకాన్ని 10 - 15 సార్లు చదవడం, ప్రాక్టీస్ బిట్స్ సాధన చేయడం, డిస్కషన్ చేయడం చేశాను. కరెంట్ అఫైర్స్‌కి సాక్షి భవిత ఎంతగానో తోడ్పడింది.

మా అమ్మకు ఎంతో రుణపడి ఉన్నా..
మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. మా అమ్మకు ఎంతో రుణపడి ఉన్నా. ఎన్ని కష్టాలకైనా ఓర్చి నన్ను కోచింగ్ కు పంపించింది. ఇందు కోసం మా మేనమామ మల్లేశ్వర్ రెడ్డి గారు చాలా సహకరించారు. ఎస్‌కే యూనివర్శిటీ ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది.

చదివిన పుస్తకాలు ఇవే.. : 
➤ జియోగ్రఫీ - రమణరాజు
➤ హిస్టరీ - కరీం సార్ నోట్స్, శీనయ్య బుక్స్
➤ పాలిటీ - ప్రభాకర్ రెడ్డి
➤ సైన్స్- ఎస్‌వీఆర్ కోచింగ్ సెంటర్, ప్రసన్న హరికృష్ణ బుక్
➤ ఏపీ చరిత్ర - జోగినాయుడు
➤ ఎకానమీ - చిరంజీవి
➤ కరెంట్ అఫైర్స్ - సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ మరియు షైన్ ఇండియా మేగజీన్

సాక్షి మెటీరియల్ ఎంతో ఉపయుక్తంగా..
రోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి సాక్షి పేపర్ చదివేవాడిని. నా విజయంలో సాక్షి కీలక పాత్ర పోషించింది. పోటీ పరీక్షలంటే ఏంటో తెలియని నాకు ఏ ఏ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి? ఏ పుస్తకాలు చదవాలి? సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ ప్రణాళిక, విజేతల మనోగతాలు, మోడల్ పేపర్లు, వంటి వాటినెన్నో భవిత పరిచయం చేసింది. చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి. పేద కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత స్థానాలకు వెళ్లిన వారి గురించి చదివి స్ఫూర్తి పొందాను.

ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి..
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నల సరళి కొంచెం కఠినంగానే ఉంది. ముఖ్యంగా మొదటి పేపర్‌లో జియోగ్రఫీ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు కొంచెం కఠినంగా రావడంతో నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. మిగతా సబ్జెక్టులు సాధారణంగా ఉన్నాయి.
పేపర్ 2 లో పాలిటీ కొంచెం సులువుగా, హిస్టరీ కఠినంగా వచ్చాయి. దాంతో నాకు మార్కులు తగ్గాయి. లేదంటే మరిన్ని మార్కులు వచ్చేవి. పేపర్ 3 లో ఇండియన్, ఏపీ ఎకానమీ ప్రశ్నలు సులువుగా వచ్చాయి. అందుకే ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించాను.

ప్రిలిమ్స్, మెయిన్స్ విధానం లాభమే..
ఈ విధానం పోటీ పెంచుతుంది కాబట్టి ఇది లాభమే. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు రావడంతో మెయిన్స్‌కు ఉత్సాహంతో ప్రణాళికబద్ధంగా ప్రిపేరయ్యాను. ఖచ్చితంగా జాబ్ వస్తుందనే నమ్మకంతోనే చదివాను. అదే ప్రిలిమ్స్‌లో తక్కువ మార్కులు వచ్చినా, అర్హత సాధించకుండా ఉన్నా ఒక ప్రణాళికతో చదవడమా లేదా విరమించుకోవడమా చేయవచ్చు కాబట్టి సమయం ఆదా అవుతుంది.

ఓపెన్ కేటగిరీలో గ్రూప్స్ జాబ్స్ రావడం అంత సులువైన విషయం కాదని మా ఊర్లో అంతా నెగటివ్‌గా ఉండేవారు. నాకు ఈ జాబ్ రావడంతో దాదాపు 15 మంది హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లారు.

అమ్మా, నాన్న.. ఇద్దరూ మరణించారు...అయినా అమ్మ కలలు వృథా కాకూడదని..
మా నాన్నగారు ఆదినారాయణ రెడ్డి ఓ పేద రైతు. క్యాన్సర్ రావడంతో 2003లో మరణించారు. ఎంతో ఖర్చు చేసి కార్పోరేటు వైద్యం చేయించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో మా కుటుంబం అప్పుల పాలైంది. అప్పటినుంచి మా అమ్మ లక్ష్మీదేవి నన్ను మా అన్నయ్య ను ఎంతో కష్టపడి చదివించింది. కొంతకాలం తర్వాత అప్పులు తీర్చి సంతోషంగా ఉన్న సమయంలో 2015లో మా అమ్మగారు మరణించారు. అప్పుడు నేనెంతో కుమిలిపోయాను. అయినా అమ్మ కలలు వృథా కాకూడదని మరింత కష్టపడి చదవటం ప్రారంభించాను. దాంతో ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇందుకు మా మేనమామ కూడా చాలా సహాయ సహకారాలందించారు.

విద్యాభ్యాసం..
1 - 5 తరగతి - మండల పరిషత్ పాఠశాల బ్రాహ్మణపల్లి
6 - 10వ తరగతి - శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ (అనంతరపురం)
ఇంటర్ - శ్రీ వివేకానంద జూనియర్ కాలేజీ - అనంతపురం
డిగ్రీ - ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కాలేజ్, అనంతపురం
పీజీ - ఎస్‌కే యూనివర్శిటీ అనంతపురం

గ్రూప్-2 రాయాలనుకునేవారికి సూచనలు..
➤ జాబ్ సాధించాలనే దృఢ సంకల్పంతో ఉండాలి. హార్డ్‌వర్క్ చేయటం అలవాటు చేసుకోవాలి.
➤ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ముందు నుంచే సిద్ధమైతే ప్రిపరేషన్ తేలికవుతుంది. నిరంతరంగా ప్రిపేర్ అవడం వల్ల ఎక్కువ విషయాలు చదవవచ్చు.
➤ కొద్ది రోజులు చదివి తర్వాత నోటిఫికేషన్ రాలేదని ప్రైవేటు జాబ్‌కి వెళ్లడం, వ్యాపారం చేసుకోవడం మంచిది కాదు. దానివల్ల సమయం వృథా అవుతుంది.
నోటిఫికేషన్ సమయంలో సోషల్ మీడియాలో వినిపించే పుకార్లు, వ్యతిరేక ప్రచారాన్ని దరిచేరనీయకూడదు.
➤ మొదట మంచి పుస్తకాలు, మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని దానిపై పూర్తి విశ్వాసం ఉంచాలి.
➤ ప్రతి బుక్‌లో సాధారణంగా కొన్ని విషయాలు ఉండవు. అది సర్వసాధారణం. ఏదైనా ఒక బుక్ తీసుకొని దానినే పూర్తిగా చదవండి. అసంపూర్తిగా చదివి మళ్లీ బుక్ మార్చడం వల్ల సమయం వృథా అవుతుంది.
➤ 21 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ఒకే పుస్తకాన్ని 21 సార్లు చదవాలి. ఏవైనా తప్పులున్నాయనిపిస్తే ఇంటర్నెట్‌లో నివృత్తి చేసుకోవాలి.
➤ ఎలా ప్రిపేర్ అయినా చదవడం ముఖ్యం. చదివింది అర్థం చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవడం ముఖ్యం
➤ సిలబస్ పూర్తిచేసిన తర్వాత వీలైనన్ని ప్రాక్టీస్ బిట్స్ సాధన చేయాలి. దీని వల్ల ప్రశ్నల సరళి తెలుస్తుంది.
➤ ప్రిపరేషన్ ప్రారంభించాక ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆపకండి. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ ఆవహించి చదవడం మానేయాలనిపిస్తుంది. దానిని అధిగమించినవాడు తప్పక విజయం సాధిస్తాడు.

Published date : 23 Dec 2021 02:05PM

Photo Stories