Skip to main content

AP TET 2022 Preparation Tips: అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

AP TET 2022 Preparation Tips
AP TET 2022 Preparation Tips

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌.. సంక్షిప్తంగా టెట్‌! డీఈడీ, బీఈడీ వంటి కోర్సు పూర్తి చేసుకుని.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన అర్హత పరీక్ష! ఇందులో అర్హత సాధిస్తేనే.. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే.. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది! అందుకే టెట్‌ నోటిఫికేషన్‌ కోసం వేల మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారందరికీ మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీ టెట్‌–2022కు ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా పరీక్ష తేదీలను కూడా నోటిఫికేషన్‌ సమయంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఏపీ టెట్‌–2022తో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
  • ఆగస్ట్‌ 6 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు
  • ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
  • మెథడాలజీ, పెడగాజీలపై పట్టుతో విజయం

రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువు సొంతం చేసుకోవాలంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇందులో సాధించిన స్కోర్‌కు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష డీఎస్సీలో వెయిటేజీ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని.. విజయం సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

ఏపీ టెట్‌ 2022 ఇలా

  • రాష్ట్రంలో.. టెట్‌ను పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.
  • పేపర్‌–1ఎ: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. పేపర్‌–1ఎ.
  • పేపర్‌–1బి: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు.
  • పేపర్‌–2ఎ: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌ ఇది.
  • పేపర్‌–2బి: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష ఇది.

అర్హతలు

  • తరగతుల వారీగా పేపర్లను నిర్దేశించిన నేపథ్యం లో.. ఆయా పేపర్లకు హాజరయ్యేందుకు అవసరమైన కనీస అర్హత నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నారు. పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్‌ పండిట్‌/యూజీడీపీ ఈడీ/డీపీఈడీ/బీపీఈడీ/తత్సమాన అర్హతలు ఉండాలి.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పరీక్ష విధానం ఇలా

టెట్‌ పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలు.. 

పేపర్‌–1ఎ, 1బి

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2. లాంగ్వేజ్‌1 30 30
3. లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌) 30 30
4. గణితం 30 30
5. ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 30
మొత్తం   150 150
  • లాంగ్వేజ్‌–1 సబ్జెక్ట్‌ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.

పేపర్‌–2ఎ

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2. లాంగ్వేజ్‌1 30 30
3. లాంగ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌) 30 30
4. సంబంధిత సబ్జెక్ట్‌ 60 60
మొత్తం   150 150
  • నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో..మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్‌ విభాగాన్ని; సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.

పేపర్‌–2బి

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2. లాంగ్వేజ్‌1 30 30
3. లాంగ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌) 30 30
4. డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ అండ్‌ పెడగాజి 60 60
మొత్తం   150 150
  • పేపర్‌–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకున్న సబ్జెక్ట్‌ నుంచి 48 కంటెంట్‌ ప్రశ్నలు, 12 పెడగాజి సంబంధిత ప్రశ్నలు అడుగుతారు.

కనీస అర్హత మార్కులు

ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..! 

విజయం సాధించాలంటే

వేల మంది హాజరయ్యే టెట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి

ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం,అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక,బోధన పద్ధతులు, మూ ల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు,సిద్ధాంతాలు,నిబంధనలను విశ్లేషిస్తూ.. అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. 

Secondary Grade Teacher Bitbank

లాంగ్వేజ్‌–1,2

లాంగ్వేజ్‌–1లో అభ్యర్థులు ఎంచుకున్న భాష.. అలాగే లాంగ్వేజ్‌–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్‌ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి.ఇంగ్లిష్‌లో పా ర్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్,ఆర్టికల్స్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి.

మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

పేపర్‌ 1లో ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్‌పై ఉంటే.. 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. పేపర్‌ 2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్ట్‌లపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఇంటర్‌ స్థాయిలో ఉంటుంది.

సైన్స్‌

ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు అవపోసన పట్టాలి. పేపర్‌–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి.

School Assistant Bitbank 

సోషల్‌ స్టడీస్‌

హైస్కూల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లో చదవాలి. ఉదాహరణకు సివిక్స్‌లోని రాజ్యంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కేవలం రాజ్యాంగంలోని ఆర్టికల్స్, సవరణలకు పరిమితం కాకుండా.. రాజ్యాంగ రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు మొదలు తాజా సవరణలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్‌ను సమన్వయం చేసుకుంటూ చదవాలి.

మెథడాలజీ

ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్‌–1, పేపర్‌–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్‌ కొనసాగించాలి. 

ప్రస్తుత సమయంలో

  • గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సాధన చేయాలి. ఆయా విభాగాల వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్‌ సమయం కేటాయించుకోవాలి. 
  • పేపర్‌–1 అభ్యర్థులు కంటెంట్‌కు సంబంధించి మూడు నుంచి అయిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్‌ చేయాలి. 
  • పేపర్‌–2 అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. 
  • మెథడాలజీలో మంచి మార్కుల కోసం.. లక్ష్యాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
  • మోడల్‌ పేపర్లు రాయడం ఎంత ముఖ్యమో వాటిని విశ్లేషించుకోవడం అంతా కంటే ప్రధానం. విశ్లేషించుకొని తప్పులను సమీక్షించుకోవాలి.

TET Model Papers

ఏపీ టెట్‌–2022– ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జూన్‌ 16 నుంచి జూలై 16 వరకు.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూలై 25 నుంచి
  • టెట్‌ పేపర్ల పరీక్ష తేదీలు: ఆగస్ట్‌ 6 నుంచి 21 వరకు
  • ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌ 14, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: http://cse.ap.gov.in
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aptet.apcfss.in


ప్రిపరేషన్, ప్రాక్టీస్‌

అభ్యర్థులు ప్రధానంగా పెడగాజి, మెథడాలజీలపై పట్టు సాధించేలా కృషి చేయాలి. మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్లను సాధన చేయాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌ల అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. ఆయా సబ్జెక్ట్‌లలో ఫార్ములాలు, కాన్సెప్ట్‌లపై క్షుణ్నమైన అవగాహన పొందాలి. అప్పుడే పరీక్షలో ప్రశ్నలను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
–జె.సుధాకర్, సబ్జెక్ట్‌ నిపుణులు

TSTET Syllabus 2022

Published date : 20 Jun 2022 06:02PM

Photo Stories