Inspiring Story: ఈ కసితోనే ఎస్సైగా ఉద్యోగం కొట్టా.. కానీ నా లక్ష్యం మాత్రం ఇదే..
కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకే నేనే ఉదాహరణ.. అంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి చెందిన మరపట్ల ప్రశాంతి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం :
మా తండ్రి నిరక్ష్యరాస్యుడు. వృత్తిపరంగా వ్యాన్ డ్రైవర్. తల్లి జయలక్ష్మి. ఇంటర్ చదివారు. మేము ఇద్దరం ఆడపిల్లలం. నా అక్క పేరు సింధు. ఆమె ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చేసింది. విశాఖపట్నంలోని రెడ్డిల్యాబ్‌లో పనిచేస్తోంది.
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
నా చదువు :
నేను పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో విధ్యాభ్యాసం చేశాను. 2009–12లో స్థానిక డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి కళాశాల టాపర్‌గా నిలిచాను.
నా తండ్రి పడుతున్న కష్టం చూసి..
ఇంట్లో తండ్రి పడుతున్న కష్టాలు చూశాను. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొన్నాను. అప్పుడే పేదలకు సేవా చేయాలనే తలంపుతో ఎన్‌సీసీలో చేరాను. అప్పటి ఎన్‌సీసీ అధికారి నతానియేలు సూచన మేరకు ఎస్సై కావాలనే లక్ష్యం ఉండేది. ఎస్సై ఉద్యోగానికి దేహదారుఢ్యం అవసరమని గుర్తించాను. కళాశాలలోనే ఉదయం రన్నింగ్, లాంగ్‌జంప్, లాంటి వ్యాయామాలు చేశాను.
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఏనాటికైన నా లక్ష్యం ఇదే..
ఎస్సై కావాలనే లక్ష్యం అలా ఉండగానే, 2012–13లో పెదతాడేపల్లి వాసవి జీఎంఆర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాను. గూడెం ఏయూ క్యాంపస్‌లో ఎంఏ పూర్తి చేశాను. కరెంట్ ఎఫైర్స్ కోసం వార్తా పత్రికలు నిత్యం చదివేదాన్ని. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌గా ఉండి పలుసార్లు రక్తదానం చేశాను. తిరుపతిలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొని నృత్యంలో రెండో బహుమతి సాధించాను. కాగా ఎన్‌సీసీలో తీసుకొన్న నిర్ణయం మేరకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాశాను. ఎస్సైగా ఎంపికయ్యాను. మేనమామ ఏలూరి జగదీష్, పెద్దమ్మ మరపట్ల బాలకృష్ణ ప్రోత్సాహం, సహకారం కారణంగా పోలీస్ శాఖలో ఎస్సై అయ్యాను. అయినా ఈ లక్ష్యం కాక మరో టార్గెట్ ఉంది. ఎప్పటికైనా సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించి సమాజ శ్రేయస్సుకు, పేద ప్రజలకు సహాయం చేయాలనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే..
పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావనే అపోహ విడనాడాలి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది లేదు. నాతోటి యువతులు కూడా ఈ విధంగా ఆలోచించాలి. చదువు మధ్యలోనే ఆపకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. పేదరికంలో ఉన్నా, ఉన్నతస్థితిలో ఉన్నా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు.