Andhra Pradesh: జూనియర్ కాలేజీలకు మహర్దశ
నాలుగేళ్లుగా సర్కారీ బడులను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్ విద్యపైనా ప్రత్యేక దృష్టి సారించారు. విద్యారంగంలో పలు పథకాలు అమలుచేస్తూ చదువును ప్రోత్సహిస్తున్నారు.
నాడు–నేడులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మారుస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలలను..
మనబడి–నాడు నేడు కార్యక్రమంలో తొలివిడత ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,200 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండో విడతలో 1,600 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ కళాశాలలనూ కూడా నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వీటికి మహర్దశ పట్టింది.
చదవండి: Intermediate Board: ప్రైవేటు కాలేజీలకు హెచ్చరిక
ఈ మేరకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తొలి విడతగా నాడు–నేడులో అభివృద్ధి పనులకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ అభివృద్ధికి నోచుకోని కళాశాలల వివరాలను సేకరించి వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
కళాశాలల రూపురేఖలు మారుస్తూ..
ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నివేదికల ఆధారంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన కళాశాలల్లో నాడు–నేడు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా కళాశాల రూపురేఖలు మారుతున్నాయి.
కళాశాలల్లో పాఠశాలల తరహాలోనే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, ప్రహరీ గోడలు, చిన్న, పెద్ద మరమ్మతులు, విద్యుదీకరణ, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యార్థులకు, అధ్యాపకులకు అత్యాధునిక బెంచీలు, కుర్చీలు, తరగతి గది లోపల, వెలుపల, ప్రహరీ గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
రూ.12 కోట్లకు పైగా నిధులతో..
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో నాడు–నేడు కింద అభివృద్ధి చేయడానికి 33 కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఏలూరు జిల్లాలో 20 కళాశాలలు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కళాశాలలు ఉన్నాయి.
ఏలూరు జిల్లాలోని కళాశాల అభివృద్ధికి రూ.9.68 కోట్లు నిధులు కేటాయించగా వాటి నుంచి ఇప్పటికే రూ.4.18 కోట్ల నిధులు విడుదల చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 13 కళాశాలల అభివృద్ధి నిమిత్తం రూ.2.35 కోట్ల నిధులు కేటాయించగా వాటి నుంచి రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయడం ఆ నిధులతో దాదాపు 92 శాతం పనులు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ హంగులతో విద్యార్థులను ఆకట్టుకోనున్నాయి.