ఇంటర్మీడియెట్ half-yearly పరీక్షలు: Intermediate half-yearly examinations Dates
రాయవరం: ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2024 మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతున్న విషయం పాఠకులకు విదితమే. వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించాలని బోర్డు ఇంటర్మీడియెట్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ ఉత్వర్వులు విడుదల చేశారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లిష్, 20న గణితం, బోటనీ, సివిక్స్, ఒకేషనల్ పేపర్–1, 21న జువాలజీ, హిస్టరీ, ఒకేషనల్ పేపరు–2, 22న ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ పేపరు–3, 23న కెమిస్ట్రీ, కామర్స్‌స, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపరు పరీక్షలు జరుగుతాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్టియర్ విద్యార్థులకు పేపర్–1, సెకండియర్ విద్యార్థులకు పేపర్–2 జరుగుతాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లను సంబంధిత ప్రిన్సిపాల్స్ అనుకూల సమయాన్ని బట్టి పైన తెలిపిన టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించుకోవచ్చునని తెలిపారు.
Also Read : AP Intermediate 2024 Timetable
పరీక్షా పత్రాల మూల్యాంకనం తర్వాత విద్యార్థులు పొందిన మార్కులను ఈ నెల 24వ తేదీలోగా జ్ఞానభూమి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఉత్వర్లుల్లో పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు ఆరు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 64, ఒకేషనల్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 44 ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న 13,764 మంది ఫస్టియర్, 11,160మంది సెకండియర్ విద్యార్థులు అర్ధ సంవత్సర పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులందరూ అర్ధ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా, పబ్లిక్ పరీక్షల మాదిరిగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డీవీఈవో ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు.