Skip to main content

Good Handwriting : పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలల్లో మార్కుల సాధనకు చేతిరాత కీలకం ......... మార్కుల పంటే!

Good Handwriting : పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలల్లో మార్కుల సాధనకు చేతిరాత కీలకం ......... మార్కుల పంటే!
Good Handwriting - పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలల్లో  మార్కుల సాధనకు చేతిరాత కీలకం ......... మార్కుల పంటే!
Good Handwriting - పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలల్లో మార్కుల సాధనకు చేతిరాత కీలకం ......... మార్కుల పంటే!

రాయవరం: పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు, మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ, వృత్తి విద్యా కోర్సుల వార్షిక పరీక్షలు మరికొద్ది నెలల్లో రానున్నాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకుని చదవడం ప్రారంభించారు.

Also Read : Inter Exam Preparation Tips

విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేక ప్రణాళికను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. పరీక్షల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో, చేతిరాత కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. దస్తూరీ బాగా లేకుంటే..సమాధానం అర్థంకాక ఒక మార్కు, లేదా అరమార్కు అయినా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం టోటల్‌ మార్కులపై పడుతుంది. అందువల్ల విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. విద్యార్థులు రోజుకు అరగంట అయినా చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :  10th Class Preparation Tips

మార్కుల సాధనకు చేతిరాత కీలకం
మన చేతిరాతను బట్టి కూడా మన మనస్తత్వాన్ని, గుణగణాలను కూడా అంచనా వేయవచ్చునని నిపుణులు చెబుతారు. పరీక్షల్లో చేతిరాత కీలకంగా మారుతుంది. అందంగా రాసే అక్షరాలకు వచ్చే అదనపు మార్కులే మంచి ఫలితాలు అందిస్తాయి. పరీక్షల్లో ఫలితాన్ని, భవితను నిర్దేశించేది అందమైన అక్షరాలేనని విషయ నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు, గ్రేడులు సాధించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. చేతిరాత గురించి మాత్రం పట్టించుకోరు. దీంతో అనుకున్న మార్కులు పొందలేక పోతుంటారు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతను పెంచుకుంటే మంచి రాత వస్తుంది.

ఇవీ సూచనలు

► ప్రతి విద్యార్థి జవాబు పత్రాల బుక్‌లెట్‌లో సమాధానాలు స్పష్టంగా రాయాలి.

► నాలుగు వైపులా మార్జిన్లు(బార్డర్లు) వేసుకుంటే మంచిది.

► ఒక లైనుకు మరో లైనుకు సెంటీమీటర్‌ గ్యాప్‌ ఇవ్వాలి.

► అక్షరాలు మరీ పెద్దవి, చిన్నవిగా ఉండకూడదు. పేపరంతా ఒకే స్థాయిలో అక్షరాలు ఉండాలి.

► గుండ్రంగా, అందంగా రాస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

► గొలుసులా అక్షరాలను రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండదు.

► బుక్‌లెట్‌లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి.

► బొటన వేలు, మూడవ వేలికి మధ్య చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి. ఇలా చేయడం వలన రాసే సమయంలో పెన్ను స్పీడుగా ముందుకు కదులుతుంది.

► పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది.

జిల్లా వ్యాప్తంగా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 70వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. లక్ష మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు. ఏడాదంతా చదివినది పేపరుపై పెట్టే సమయం సమీపిస్తోంది. చేతిరాత బాగుంటే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పరీక్షల సమయంలో ఇటు సబ్జెక్టులకు సన్నద్ధం అవుతూ మరోవైపు రోజులో కొంత సమయం చేతిరాతపై దృష్టి సారిస్తే పట్టు వస్తుంది.

ప్రత్యేక శ్రద్ధ
దస్తూరీ అందంగా ఉండేలా విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నాం. చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. చేతిరాత అందంగా ఉంటే పేపరు వాల్యుయేషన్‌ చేసే టీచర్‌కు విద్యార్థిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
– చిట్టినీడి నిరంజని, జెడ్పీహెచ్‌ఎస్‌, మామిడికుదురు, మామిడికుదురు మండలం

సాధనతోనే సాధ్యం
చక్కటి చేతిరాత రావాలంటే సాధనతోనే సాధ్యమవుతుంది. చేతిరాతను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతీ రోజు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. తొలి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు సమాధానాలు గుండ్రంగా రాయాలంటే సాధన తప్పనిసరి.
– ఎం.చంద్రకళ, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌, ఉచ్చిలి, ఆత్రేయపురం మండలం.

 

 

Published date : 13 Jan 2024 04:18PM

Photo Stories