Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మెళకువలు, సూచనలు
రాయవరం: విద్యార్థుల్లో ఇప్పటికే ‘టెన్’షన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు అనగానే తెలియని ఆందోళన. తెలిసిన సమాధానాలే అయినా వాటిని పేపరుపై ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక కొందరు సతమతమవుతారు. తరగతి గదిలో టకీమని జవాబుల చెప్పే కొందరు విద్యార్థులు మార్కుల సాధనలో మాత్రం వెనుకబడి ఉంటారు. బాగా వచ్చిన సమాధానాలను సరైన రీతిలో రాయలేక పోవడమే ఇందుకు కారణం. చిన్న అవరోధాన్ని అధిగమిస్తే విజయం వారి సొంతం. ఈ నెల 18వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 83,491 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా చేసే చిన్న చిన్న పొరపాట్లు, వాటిని సరిదిద్దుకోవలసిన తీరు, పరీక్షలు రాయడంలో మెళకువలు, సూచనలు విద్యార్థుల కోసం..
ప్రజెంటేషన్ కీలకం
ఏడాది మొత్తం చదివింది ఒక ఎత్తైతే పరీక్షల్లో ఎలా ప్రజెంట్ చేశామనేదే చాలా కీలకం. సంవత్సరం పాటు చదివిన విషయాలను మూడు గంటల్లో పరీక్ష పత్రంపై ఎలా పెట్టాలన్నదే విద్యార్థులను తొలిచే ప్రశ్న. ఒక్కోసారి సమాధానాలు తెలిసినా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమగ్రంగా రాయలేక పోతారు. అలాకాకుండా జవాబులను సూటిగా రాయాలి. సమాధానాలు టీచరుకు తెలుసని విద్యార్థి గుర్తించాలి. మనం రాసే తీరు పరీక్ష పేపరు వేల్యుయేషన్ చేసే వారిని ఇబ్బంది పెట్టేలా ఉండరాదు. వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. చేతిరాత గుండ్రంగా, అర్తమయ్యేలా ఉండాలి.
ఇలా రాస్తే మంచిది..
ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి అర్ధం చేసుకున్నాకే రాయాలి. సమాధాన పత్రంలో పేజీకి 15–16 లైన్లు ఉండాలి. పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి. మొదటి వరసలో ఎంత బాగా రాశారో చివరి వరకు అదే దస్తూరీని కొనసాగించాలి. వాక్యాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. తెలుగు, ఆంగ్లం, హిందీలోని లెటర్ రైటింగ్‌ను ఒకే పేజీలో వచ్చేలా రాయాలి. అక్షర దోషాలు దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి. గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గిస్తారు. ఇచ్చిన సమస్యను అర్థం చేసుకున్న తర్వాతే రాయడం ప్రారంభించాలి. గ్రాఫ్‌ను చక్కగా గీయాలి. సైన్స్‌లో బొమ్మలు గీసేటప్పుడు కష్టమైన వాటిని వదిలేసి సులభంగా ఉన్నవాటిని ఆకర్షణీయంగా గీయాలి. సాంఘిక శాస్త్రం సబ్జెక్టును సమాధానాలను పాయింట్ల వారీగా రాయాలి. మ్యాప్‌లో అడిగిన వాటిని స్పష్టంగా గుర్తించాలి. శీర్షికలు, ఉపశీర్షికల కింద అండర్‌లైన్ చేయాలి. మంచి పెన్నులు ఉపయోగించాలి. బిట్లు రాసేటప్పుడు కొట్టివేతలు రాకుండా చూసుకోవాలి.
మార్కుల సాధనలో దస్తూరీ కీలకమే
ఓ విద్యార్థి చేతిరాతను బట్టి సంబంధిత విషయంపై అతని అవగాహన స్థాయిని చెప్పవచ్చు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎంత తెలివైన వారనేది జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి తెలియదు. వారు రాసే తీరు, అక్షరాల కూర్పును బట్టే వారి జ్ఞానాన్ని అంచనా వేస్తారు. ఈ విషయంలో చేతిరాతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కళ్లకు ఇంపుగా కన్పించే అక్షరాలు..అందమైన దస్తూరీ చూసే వారిని ఇట్టే ఆకట్టుకుంటాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారి మనసుకు హత్తుకుని మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. పరీక్షలో విజేతగా నిలుపుతుంది.
సహజంగా చేసే పొరపాట్లివీ..
కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా, దగ్గరదగ్గరగా ఉండడంతో జవాబుపత్రం చూడగానే ఆకట్టుకోదు. అందువల్ల ఒక్కో పేజీలో 16–18 లైన్లకు మించకుండా చూడాలి. ఒక పాయింట్ దగ్గర మొదలైన రాత ఆ లైను చివరికి వెళ్లే సరికి పైకో కిందకో పోతుంది. దాంతో ఆ పేజీల్లో అన్ని లైన్లు గజిబిజిగా మారతాయి. లైన్లు సమాంతరంగా ఉండేలా చూడాలి. ప్రశ్న నంబర్లకు జవాబులో ముఖ్యమైన పాయింట్లకు ఇచ్చే సంజ్ఞలు మార్జిన్‌లో ఒక దాని కింద మరొకటి వేయవద్దు. గీత చివరి వరకూ రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి..మరో సగాన్ని కింద లైనులో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏంటో అర్థం కాదు. సాధ్యమైనంత వరకు పదాలను ఒక లైనులోనే వచ్చేలా రాయాలి.
చాలా మంది విద్యార్థులు బాగా ఒత్తిపట్టి రాస్తుంటారు. కలాన్ని వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు ఆ అక్షరాలు కన్పిస్తూ చివరికి జవాబు పత్రాలు గజిబిజిగా తయారవుతాయి. పైగా విద్యార్థులకు కూడా రాయడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే వేళ్లు నొప్పి పెడతాయి. చాలా మంది విద్యార్థులు అంకెలను సరిగా రాయరు. ‘2’ అంకెను ఇంగ్లిష్ జెడ్ తరహాలో, ‘5’ను ఎస్‌లా ‘0’ను 6 తరహాలో రాస్తుంటారు. ఫలితంగా రావలసిన మార్కులు తగ్గిపోతాయి.
చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్ ‘ఐ’పై చుక్క ‘జె’ అక్షరంపై గీత వేయరు. తెలుగులో ణ, మ, య, సరిగా రాయరు. పరీక్ష పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే వాటిని పెన్సిల్ లేదా పెన్నుతో బాగా రుద్దుతారు. దీంతో పేపరంతా నల్లగా మారుతుంది. స్కెచ్ పెన్సిల్‌ను, పలు రంగుల రీఫిల్స్‌ను అడ్డదిడ్డంగా ఉపయోగిస్తుంటారు. ఇది మంచిది కాదు. అవసరమైన చోటనే ఉపయోగిస్తే అందంగా ఉంటుందని గుర్తించాలి. సైన్స్‌లో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాల్ని గుర్తించడంలో ఒక క్రమ పద్ధతి పాటించాలి.
Also Read : AP 10th Class Model Papers ----- TS 10th Class Model Papers
మూల్యాంకనపై ప్రభావం
అందమైన దస్తూరి మూల్యాంకనం చేసే వారిని ప్రభావితం చేస్తుంది. చాలా మంది కష్టపడి చదువుతారు కాని బాగా రాయక పోవడంతో అనుకున్న మార్కులు సాధించలేక పోతున్నారు. చదివిన విషయాన్ని పేపరుపై ప్రజెంటేషన్ చేయడం కూడా ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు.
– సీహెచ్ పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు(ఎఫ్‌ఏసీ), జెడ్పీహెచ్‌ఎస్, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం
మెరుగైన ప్రతిభ కనబర్చాలి
సమాధానాలు రాసే సమయంలో తప్పులు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. చక్కగా రాసిన వారికి మంచి మార్కులు వస్తాయి. అలాగని దస్తూరి సరిగ్గా లేనివారు ఆందోళన పడాల్సిన పనిలేదు. సమాధానాలు అర్థమయ్యేలా చూసుకోవాలి. పరీక్షల్లో ఉన్నంతలో మెరుగ్గా రాసే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– బీఆర్ కామేశ్వరరావు, హెచ్‌ఎం,