Skip to main content

APBIE: ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం.. పరీక్ష కేంద్రాలలో ఇవి నిషేధం

సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు–2023 మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
AP Inter exams start
ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం.. పరీక్ష కేంద్రాలలో ఇవి నిషేధం

మార్చి 15 నుంచి ప్రథమ సంవత్సరం, 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 10,03,990 మంది పరీక్ష రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మిడియెట్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షలు ముగిసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాల్‌ ప్రాక్టీస్‌ వంటి వదంతులను సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పరీక్షలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను 
పర్యవేక్షిస్తున్నారు. 

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

పరీక్ష వేళల్లో ఆర్టీసీ బస్సులు..

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా తిప్పనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించేలా ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సదుపాయంతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి 20 నుంచి 25 పరీక్ష కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి వీలుగా ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు పహారాతో పాటు ప్రత్యేక మొబైల్‌ పెట్రోలింగ్‌ బృందాల ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. 

సెల్‌ఫోన్లు, సహా డిజిటల్‌ పరికరాలపై నిషేధం 

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచ్, బ్లూటూత్, ట్యాబులు సహా అన్ని రకాల డిజిటల్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా నిషేధం విధించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేస్తారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తినా పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004257635ని ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకోవాలని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు పలు సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత సమయం దాటాక ఎవరినీ లోపలకు అనుమతించే అవకాశం లేదని వెల్లడించింది.

Published date : 15 Mar 2023 04:16PM

Photo Stories