Skip to main content

Top Marks In Inter: ఇంట‌ర్‌లో మెరిసిన పేదింటి క‌లువ‌లు... ప్రైవేటుకు దీటుగా మార్కులు సాధించిన ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌ విద్యార్థులు

కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్‌లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
తల్లిదండ్రులతో ప్రియాంక
తల్లిదండ్రులతో ప్రియాంక

ప్రభుత్వ ఇంట‌ర్మీడియ‌ట్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు.
కార్మికుడి ఇంట.. చదువుల తల్లి
మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్‌వలి మెకానిక్‌. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్‌ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది.

inter

పదో తరగతి స్థానిక హోప్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్‌ బాలికల జూనియర్‌ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్‌లో 968 మార్కులు వచ్చాయి.

చ‌ద‌వండి: ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు ఇవే

రైతు బిడ్డ ..చదువులో దిట్ట
రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్‌ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి పాసైంది. ఇంటర్‌ బాలికల జూనియర్‌ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ విద్యలో రాణించింది.

వాచ్‌మెన్‌ కూతురు..ఇంటర్‌లో టాపర్‌
తండ్రి వాచ్‌మెన్‌. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్‌. మదనపల్లె ఎస్టేట్‌కు చెందిన దిగంబర్‌దాల్‌ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్‌ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది.

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు
తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్‌మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్‌కుమార్‌ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.

తల్లి అమరావతితో విద్యార్థి అశోక్‌కుమార్‌

 అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్‌ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్‌ తో మృతి చెందాడు.

రాజుపాళెం : వైఎస్సార్ క‌డ‌ప జిల్లా రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్‌ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు.

చ‌ద‌వండి: సొంత ప్రిపరేషన్‌తో రైల్వే టీసీగా ఎంపికైన రైతు బిడ్డ

వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట
రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్‌నవుతానని తెలిపింది.

inter

డాక్టర్‌నవుతా....
నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్‌ లైన్‌మెన్‌గా, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్‌కు కోచింగ్‌ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది.

బి.ఫార్మసీ చేయాలని ఉంది
ఎంసెట్‌, నీట్‌ ఎంట్రన్స్‌ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా.  –మెహర్‌, మదనపల్లె

 

ఐఏఎస్‌ కావాలన్నదే ధ్యేయం
సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్‌ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. – ప్రీతిలతాదాల్‌

చ‌ద‌వండి: ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దివిన మ‌న తెలుగు మ‌హిళ‌.. ఐఏఎస్‌ల‌కు పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగింది.. ఆమె స‌క్సెస్ జ‌ర్నీ చ‌ద‌వండి

ఎంబీబీఎస్‌ చేస్తా
ఎంబీబీఎస్‌ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్‌,నీట్‌ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్‌ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. – కవిత

ఐఏఎస్ కావాలన్నదే ఆశయం
ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసి ఐఏఎస్‌ కావాలన్నదే తన ఆశయమని అశోక్‌కుమార్‌ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు.

Published date : 28 Apr 2023 02:06PM

Photo Stories