AP DSC : 23 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసింది గత సర్కారే
అమరావతి: మెగా డీఎస్సీ అంటూ చాటింపు వేస్తున్న టీడీపీ పెద్దలు గత ప్రభుత్వం ఏకంగా 23,699 టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించడం, ఆ తరువాత పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం చేయడం టీడీపీ హయాంలో రివాజు. 2014, 2018లోనూ ఆర్భాటంగా డీఎస్సీలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేసింది.
అనంతరం డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్న తలంపుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి పాఠశాలలలో నూరు శాతం ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా టీచర్ ఖాళీలను భర్తీ చేసింది. కేజీబీవీల్లో సైతం 1,200 రెగ్యులర్ టీచర్లను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ప్రకటించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కూడా నిర్వహించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఫలితాలు ప్రకటించలేదు.
TS POLYCET Counselling 2024: నేటితో ముగియనున్న పాలిసెట్ కౌన్సెలింగ్
అన్యాయాలను సరిదిద్ది..
చంద్రబాబు హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఓ ప్రహసనంగా మార్చేశారు. గతంలో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో 7,902 ఉపాధ్యాయ పోస్టులకుగానూ 300 పోస్టులను భర్తీ చేసి చేతులెత్తేశారు. అంతకు ముందు 2014లోనూ 10,313 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీని గాలికి వదిలేశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి టీచర్ అభ్యర్థులను నిలువుగా మోసం చేశారు.
2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2018 డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు న్యాయం చేసింది. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు 7,254 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చింది.
Digital Teaching: బోధన..లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం
2018 లిమిటెడ్ డీఎస్సీ అభ్యర్థులు 24 మందికి పోస్టులిచ్చింది. 2019లోనే స్పెషల్ డీఎస్సీ వేసి 521 పోస్టులను భర్తీ చేసింది. ఇక 1998 డీఎస్సీ ద్వారా అన్యాయానికి గురైన 4,059 మంది అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మినిమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కింద 3,864 మందికి పోస్టింగ్ ఇచ్చారు. 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 1,910 మందిని ఎంటీఎస్ టీచర్లుగా నియమించారు. తెలంగాణలో 1998, 2018 డీఎస్సీ అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకున్నది లేదు.