ఉత్పత్తి, ఉపాధి
Sakshi Education
ముఖ్యాంశాలు:
- దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించు సాంకేతిక పదం స్థూల జాతీయోత్పత్తి.
- ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల/సేవల విలువ ఆ సంవత్సరానికి, ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. మూడు రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల జాతీయోత్పత్తి వస్తుంది.
- స్థూల జాతీయోత్పత్తిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలి.
- గత ఐదు దశాబ్దాల కాలంలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతోంది. మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది.
- సేవలలో మూడు రకాలు ఉన్నాయి. ఎ) ప్రజా, సామాజిక, వ్యక్తి గత సేవలు బి) ఆర్థిక, భీమా, స్థిరాస్తిసేవలు సి) వ్యాపారం, హోటళ్ళు, రవాణా ప్రసారాలు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని 120 కోట్ల జనాభాలో 46 కోట్లమంది ఉత్పాదక కార్యకలాపాలలో భాగ స్వాములైన ప్రజలు.
- మనదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో 75%వాటా ఉన్న పారిశ్రామిక, సేవారంగాలు మొత్తం కార్మికులలో సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు.
- మన దేశంలో 92% కార్మికులు అవ్యవస్తీకృత రంగంలో పని చేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు.
- షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధికశాతం కార్మికులు అవ్యవస్తీకృత రంగంలో ఉన్నారు.
- పని సరిగా దొరకక పోవటం, తక్కువ వేతనంతో పాటు కార్మికుల సామాజిక వివక్షత అవ్యవస్తీకృత రంగంలో కలదు. కాబట్టి అవ్యవస్తీకృత రంగ కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.
కీలక భావనలు:
- స్థూల జాతీయోత్పత్త(GDP) : ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన వస్తుసేవల నికర విలువ మొత్తం స్థూల జాతీయోత్పత్తి.
- అంతిమ వస్తువులు: నేరుగా వినియోగానికి ఉపయోగించే వస్తువులు.
- ఉపాధి బదిలీ: ఒక రంగం నుండి మరొక రంగానికి ఉపాధి సదుపాయాలు మారుటను ‘ఉపాధి బదిలీ’గా వ్యవహరిస్తారు.
- వ్యవస్థీకృ రంగం: ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు. కార్మికులకు తగిన రక్షణ, మద్ధతు అందుతుంది.
- అవ్యవస్థీకృత రంగం: అవ్యవస్థీకృత కరంగంలో ఉద్యోగ భద్రత ఉండదు. ఉపాధి షరతులు ఉండవు. నమ్మకంగా పని గంటల స్థితి ఉండదు. తక్కువ వేతనంతో పనిచేయాల్సి వస్తుంది.
వ్యాస రూప ప్రశ్నలు:
1. ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా? ఎందుకో వివరించండి.
-
ప్రజలు తమ జీవనోపాధికోసం రకరకాల పనులను చేస్తారు. ఈ పనులు ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు.
- ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమైనది.
- ఏఏ రంగం ఎంత విలువైన ఉత్పత్తులను చేస్తుంది. స్థూల జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాను తెలుసుకోవచ్చు
- ఏఏ రంగం ఎంతమందికి జీవనోపాధికల్పన చేస్తుందనే విషయం తెలుస్తుంది.
- ఆరిక్థ వ్యవస్థలో ఏఏ పనులు వ్యవస్థీకృత రంగం క్రిందకు వస్తాయి. ఏఏ పనులు అవ్యవస్థీకృత రంగానికి చెందుతాయనే విషయం తెలుస్తుంది.
- పారిశ్రామిక రంగం పనితీరు, పురోగతి మరియు అభివృద్ధి అవకాశాలను, ఉపాధి కల్పన సామర్థ్యాలను అంచనా వేయగల్గుతాము.
- ‘ఉద్యోగుల బదిలీ’ ఏఏ రంగంల నుండి తరలిపోతున్నాయి. సేవారంగంలో సృష్టించబడిన నూతన వృత్తులను గురించి అవగతం అవుతుంది.
- వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న ప్రచ్ఛన్న నిరుద్యోగతను తగ్గించుటకు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుటకు ఆర్థిక కార్యకలాపాల విభజన దోహదం చేస్తుంది.
- వృత్తి నిర్మాణం, ఉపాధి కల్పన అవకాశాలు, వృద్ధి దిశ, పురోగమనం, ప్రాధాన్యతలు మొదలైన పలు ఆర్థికాంశాలను ఈ రంగాలుగా విభజించుట ద్వారా విశ్లేషించగల్గుతాము.
2. ఈ అధ్యాయంలో మనం చూసిన ప్రతి రంగంలో స్థూల జాతీయోత్పత్తి లోనూ, ఉపాధిలోనూ దృష్టి ఎందుకు కేంద్రీకరించాలి? ఇంకా పరిశీలించాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? చర్చించండి. జ:
- ఈ ఆధ్యాయంలో మనం ప్రధానంగా మూడు ఆర్థిక రంగాలను పరిశీలించుతున్నాము. అవి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు.
- ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులు ప్రాథమిక రంగంలోనికి వస్తాయి. ఈరంగంలో ప్రజల ఉపాధిస్థితి, ఈ రంగం జాతీయోత్పత్తికి ఎంత వాటాను చేకూర్చుతుంది అనే అంశాలు ముఖ్యమైనవి. ఇది జీవనాధార రంగం ఆహార భద్రత ఈ రంగం పైనే ఆధారపడు ఉంది.
- ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవించు తున్నట్లు అయితే వారి ఉపాంత ఉత్పాదకత దాదాపు శూన్యంగా ఉంటుంది.
- వ్యవసాయ రంగం నుండి కొంత మేరకు శ్రామికులను ఇతర రంగాలకు తరలించినా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు తగ్గవు.
- యంత్రాలు, పరికరాలను ఉపయోగించి వస్తూత్పత్తి కొనసాగించుట, ఇతర పరిశ్రమలు ద్వితీయరంగం క్రిందకు వస్తాయి.
- పారిశ్రామిక ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు అయితే అది దేశస్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది.
- వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యక్రమాలు తృతీయ రంగంగా వ్యవహరిస్తారు.
- ప్రస్తుత కాలంలో సేవారంగం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. 25% పైగా ప్రజలు మన దేశంలో సేవారంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. అధిక మొత్తంలో నైపుణ్యము గల శ్రామికులను ఈరంగం ఆకర్షించుతుంది. ఉపాధి బదిలీలు ఎక్కువగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల నుండి సేవారంగానికి జరుగుతున్నాయి.
3. సేవారంగం ఇతర రంగాల కంటే ఎలా భిన్నమైనది.? కొన్ని ఉదాహరణలతో వివరించండి.
జ:
జ:
- గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుండి సేవల రంగానికి ప్రాముఖ్యత మారుతుంది.
- పనిచేసే వాళ్లలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు.
- ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించుటలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఇదే తీరు కనబడుతుంది.
- సేవలలో అనేక రకాలు కలవు. ప్రభుత్వ పాలనా కార్యక్రమాల సేవలు సామాజిక, వ్యక్తిగత సేవలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, జీవిత బీమా సంస్థలు, భవనాల విక్రయాలు, దళారుల సేవలు, వ్యాపారం, హోటళ్ళు, రవాణా సాధనాలు, ప్రసార సాధనాలు మొదలైనవి అనేకం కలవు.
- గత 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా క్షీణించి, సేవా రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగింది. భారతదేశంలో సేవారంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు.
- సేవారంగంలో చదువుకున్న, నైపుణ్యాలు కల్గిన వ్యక్తులకు ఉపాధి పుష్కలంగా దొరుకుతోంది.
4. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూలీ, భద్రత, వైద్యం మొదలైన అంశాలలో రక్షణ కావాలి. వివరించండి.
జ:
జ:
- దేశంలో 92% కార్మికులు అవ్యవస్థీకృక రంగంలో పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో సంస్థలు సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు.
- అవ్యవస్తీకృత రంగంలో ఉద్యోగులకు జీతాలు తక్కువ, భద్రత ఉండదు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యం సెలవులు ఉండవు.
- ఏ కారణం లేకుండానే ఉద్యోగస్తులను మానుకోమన వచ్చును. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంత మందిని పని మాన్పించ వచ్చును.
- అవ్యవస్థీకృత రంగంలో కార్మికులలో సగం మంది స్వయం ఉపాధి పరులే. బజారులలో వస్తువులు అమ్ముతూ, చిన్న చిన్న మరమ్మతులు చేస్తుంటారు.
- అవ్యవస్థీకృత రంగంలో వారు తరచు దోపిడికి గురవుతున్నారు. వీళ్ళకు న్యాయమైన వేతనం చెల్లించరు.
- అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు తగిన రక్షణ, మద్దతు అవసరం.
- షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ కార్మికులు సామాజిక వివక్షతకు లోనౌతున్నారు.
-
కనుక, ఆర్థిక, సామాజికాభివృద్ధికి అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
బ్రాకెట్టులో ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీలు పూరించండి.
1. ఉత్పత్తితో సమానంగా సేవారంగంలో ఉపాధి...............(పెరిగింది/పెరగలేదు)
జ: పెరగలేదు.
2. ........రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చెయ్యరు. (సేవా/వ్యవసాయం)
జ:సేవా
3. ....................రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది.
(వ్యవస్థీకృత/అవ్యవస్థీకృత)
జ: వ్యవస్థీకృత
4. భారతదేశంలోని కార్మికులలో ....................శాతం అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. (ఎక్కువ/తక్కువ)
జ: ఎక్కువ
5. పత్తి ....................ఉత్పత్తి, గుడ్డ ....................ఉత్పత్తి (సహజ/పారిశ్రామిక)
జ: సహజ, పారిశ్రామిక
సరైన సమాధాన్ని ఎంచుకోండి.
(అ) ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని ....................రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
ఎ) ప్రాథమిక బి)ద్వితీయ సి)తృతీయ డి)సమాచార సాంకేతిక
జ: ఎ)
(ఆ) స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన.......మొత్తం విలువ
ఎ) అన్ని వస్తువులు, సేవలు బి) అన్ని అంతిమ వస్తువుల, సేవలు
సి) అన్ని మాధ్యమిక వస్తు సేవలు డి) అన్ని అంతిమ, మాధ్యమిక వస్తుసేవలు
జ: బి
ఇ) 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా....................
ఎ) 20-30% మధ్య బి)30-40 % మధ్య
సి)50-60% మధ్య డి)70 %
జ: సి
వేరుగా ఉన్న దానిని గుర్తించండి. కారణం చెప్పండి
ఎ) టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మేవ్యక్తి, న్యాయవాది.
బి) పోస్టుమాన్, చెప్పుకుట్టే వ్యక్తి, సైనికుడు, పోలీసు కానిస్టేబుల్.
జ: ఎ) కూరగాయలు అమ్మేవ్యక్తి
బి) చెప్పులు కుట్టే వ్యక్తి
అదనపు ప్రశ్నలు
ప్ర: ‘అల్ప ఉపాధి’ అంటే ఏమిటి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి?
జ:
- వ్యవసాయం రంగంలో అవసరమైన దాని కంటే ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయం నుంచి కొంత మందిని ఇతర రంగాలకు తరలించినా ఉత్పత్తి ప్రభావితం కాదు.
- వ్యవసాయరంగంలో కార్మికులు అల్ప ఉపాధినే కలిగి ఉన్నారు. వారు చెయ్యటానికి వేరే పనిలేనందువల్ల వారి శ్రమ విభజన జరిగింది.
- అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండటం లేదు.
- పనిలేక నిరుద్యోగిగా ఉంటే అది కనపడుతుంది. కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనబడదు. అందుకే దీనిని ‘ప్రచ్ఛన్న నిరుద్యోగం’ అని కూడా అంటారు.
- భారత దేశంలో అల్పఉపాధి కల్గినవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయం నుంచి చాలా మంది వేరే రంగాలలోనికి వెళ్ళిపోయినా వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు.
- అల్పఉపాధి ఇతర రంగాలలో, పట్టణ ప్రాంతాలలో సేవారంగంలో చిన్న చిన్న పనులు, రిపేర్లు చేసే వారిలో కలదు. వీళ్ళు రోజంతా కష్టపడిన సంపద చాలా తక్కువగా ఉంటుంది.
ప్ర: అహ్మదాబాదు నగరం జరిపిన అధ్యయనంలో 15 లక్షల కార్మికులు ఉండగా అందులో 11 లక్షల మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారని తెలసింది. ఆ సంవత్సరం (1997-98)లో నగరం మొత్తం అదాయం రూ.6000 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా రూ.3200 కోట్లు. ఈ గణాంకాలను ఒక పట్టిక రూపంలో ఇవ్వండి. పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు ఏమిటి?
జ: 1997-98 సంవత్సరంలో అహ్మదాబాద్ ఆదాయం, కార్మికులు వివరాలు:
రంగం | కార్మికులు | ఆదాయం (కోట్లలో) |
వ్యవస్థీకతరంగం |
4,00,000 |
3,200 |
అవ్యవస్థీకృత రంగం |
11,00,000 |
2,800 |
మొత్తం |
15,00,000 |
6,000 |
- పరిశ్రమలను అభివృద్ధి పర్చుటకు ప్రభుత్వం పెట్టుబడులను అధిక మొత్తంలో చేయాల్సి ఉంటుంది.
- సేవారంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవస్థాపక పెట్టుబడులు, బ్యాంకింగ్, సమాచారం మొదలైన సర్వీసులను మెరుగు పర్చుకోవాలి.
- యంత్రాలతో, సమర్థవంతంగా పని చేయటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వాలి.
- వస్తుసేవలు ఉత్పత్తి చెయ్యటానికి పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాలలో అనేక పరిశ్రమలను నెలకొల్పాలి.
Published date : 07 Oct 2023 01:12PM